MG Astor Hybrid Plus Launching in India Soon: స్పెయిన్‌లో పాపులర్ క్రాసోవర్ ఎస్‌యూవీలల్లో ఒకటైన ఎంజీ ఆస్టర్‌ని కొత్త హైబ్రిడ్ వెర్షన్‌లో తీసుకురానున్నారు. దీనికి సంబధించిన టీజర్‌ని ఆ సంస్థ విడుదల చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ కారుని ఎంజీ జెడ్ఎస్ (MG ZS)గా పిలుస్తున్నారు. భారత్‌లో దీనిని ఎంజీ ఆస్టర్ హైబ్రిడ్ ప్లస్‌గా (MG Astor Hybrid plus) పిలువనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ కారు 2025 ద్వితీయార్థంలో మార్కెట్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.
ఈ ఎంజీ ఆస్టర్ హైబ్రిడ్ కారు సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ ప్రొపల్షన్ సిస్టమ్‌తో (HEV) వస్తుంది. ఇది అట్కిన్సన్ (Atkinson) సైకిల్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది. ఈ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ని ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త ఎంజీ3లో ఇప్పటికే అందించారు. ఇందులోని బ్యాటరీ ప్యాక్ 1.83 కిలోవాట్ల NCM లిథియం-అయాన్ యూనిట్ 100% ఎలక్ట్రిక్ మోడ్‌లో ఎస్‌యూవీ రన్ అవ్వడానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది.
ఇది ఫ్రంట్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో భారత్‌లో అడుగుపెట్టనుంది. ఈ హైబ్రిడ్ ఎస్‌యూవీ పెట్రోల్ ఓన్లీ మోడల్‌తో పోలిస్తే ఇది తక్కువ ఉద్గారాలను విడుదల చేయడంతోడీజీటీ (జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్) నుంచి ఎన్విరాన్‌మెంటల్ గ్రీన్ బ్యాడ్జ్‌ని పొందింది. స్పెయిన్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎంజీ ఆస్టర్ 1.0-లీటర్ T-GDi, 1.5-లీటర్ VTI-టెక్ ఇంజిన్ ఆప్షన్స్‌తో వస్తుంది. 1.0 లీటర్ ఇంజిన్ 111 ps 160 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. 1.5 లీటర్ ఇంజిన్ 106 ps 141 nm టార్క్‌ని విడుదల చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.
ఫీచర్లు
కొత్త హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లో మార్పు చేసిన ఛాసిస్‌తో పాటు మెరుగైన సేఫ్టీ, ఫర్ఫామెన్స్ అందించే విధంగా తీసుకురావడంపై ఎంజీ దృష్టి సారించింది. కొత్త ఎంజీ ఆస్టర్ హైబ్రిడ్ ప్లస్ పట్టణ రహదారులలో పాటు ఇతర ఆఫ్‌రోడ్‌లలోనూ మెరుగైన పనితీరును అందిస్తుందని భావిస్తున్నారు. ఈ సరికొత్త హెబ్రిడ్ వెర్షన్ డిజైన్‌లో భారీ మార్పులు చేయనున్నట్లు విడుదలైన చిత్రాలు సూచిస్తున్నాయి. కొత్త LED హెడ్‌లైట్లు, గ్రిల్‌తో పాటు ఫ్రంట్ ఫేసియాలో మార్పులు చోటుచేసుకున్నాయి. బంపర్, ఎయిర్ ఇన్‌టేక్స్ కూడా కొత్తగా ఉన్నాయి. కొత్త అల్లాయ్ వీల్స్, టెయిల్ లైట్స్, రియర్ బంపర్ వంటి ఇతర మార్పులు కూడా గమనించవచ్చు.
ఇంటీరియర్స్ వివరాలు వెల్లడించనప్పటికీ కొత్త ఆస్టర్ హైబ్రిడ్ క్యాబిన్‌లో ఇతర మోడళ్లతో పోల్చితే ఇంటీరియర్లలో మార్పులు ఉండే అవకాశం ఉంది. డ్యాష్ బోర్డులో ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ కోసం డ్యూయల్ స్క్రీన్ సెటప్ ఉండనుంది. పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, 360° కెమెరా సెటప్, వైర్‌లెస్ ఛార్జింగ్, కీలెస్ యాక్సెస్, స్టార్ట్ సిస్టమ్ ఇతర అప్‌గ్రేడ్స్ ఉంటాయి. కొత్త ఫీచర్లతో పాటు సేఫ్టీ కోసం ADAS టెక్నాలజీని కూడా అందించనున్నారు.
ధర & విడుదల
ఈ ఎంజీ ఆస్టర్ (MG ZS) హైబ్రిడ్ వెర్షన్ ఐరోపాలో సెప్టెంబర్‌లో విడుదల కానుంది. పైన చెప్పిన విధంగా ఇది కొత్త అప్‌డేట్స్, పవర్‌ట్రెయిన్‌తో వస్తుంది. ప్రస్తుతం ఈ పెట్రోల్ మోడల్ ప్రారంభ ధర 17,890 యూరోలు (భారత్‌లో సుమారు రూ.16.61 లక్షలు)గా ఉంది. హైబ్రిడ్ వెర్షన్‌ని సుమారు 25,000 యూరోలు (రూ.23.20 లక్షలు) వద్ద విడుదల చేసే అవకాశం ఉంది. కొత్త ఆస్టర్ హైబ్రిడ్ 2025లో భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది భారత్‌లో క్రెటా, సెల్టోస్, గ్రాండ్ విటారా, స్కోడా కుషాక్ వంటి వాటికి నేరుగా పోటి ఇవ్వనుంది.