Maruti Suzuki Swift: దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన మారుతీ సుజుకి డీలర్‌షిప్‌లు ఈ నెలలో మారుతి సుజుకి స్విఫ్ట్‌పై భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ రూపంలో కస్టమర్లు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. మార్కెట్లో ఈ కారు టాటా టియాగో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌లకు పోటీగా ఉంది.


మారుతి స్విఫ్ట్‌పై రూ. 15 వేల వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీంతో పాటు రూ. 20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 7,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ కూడా ఈ కారుపై అందించనున్నారు. ఈ ప్రయోజనాలు 2024 మార్చి 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. అయితే ఈ ఆఫర్‌లు మీరు కారు  కొనే సిటీ, కలర్, వేరియంట్లు, అనేక ఇతర అంశాలను బట్టి మారవచ్చు.


కొత్త తరం మోడల్ త్వరలో
ప్రస్తుతం కొనసాగుతున్న మారుతి స్విఫ్ట్ మోడల్ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. మారుతి ఈ కారుకు సంబంధించిన కొత్త తరం మోడల్‌పై కూడా పని చేస్తోంది. ఇది ఇప్పటికే భారతదేశంలో టెస్టింగ్ సమయంలో చాలాసార్లు కనిపించింది. ఈ నాలుగో తరం స్విఫ్ట్ గత సంవత్సరం టోక్యోలో లాంచ్ అయింది. రాబోయే నెలల్లో భారత మార్కెట్లో విడుదల కానుందని సమాచారం.


ఇంజిన్ ఇలా...
మారుతి స్విఫ్ట్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ (90 పీఎస్ పవర్ / 113 ఎన్ఎం పీక్ టార్క్)తో వస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఏఎంటీతో లభిస్తుంది. అదే ఇంజన్ సీఎన్‌జీ వేరియంట్‌లో 77.5 పీఎస్ పవర్ /98.5 ఎన్ఎం పీక్ టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎక్కువ మైలేజీ కోసం స్విఫ్ట్ యాక్టివ్ స్టార్ట్/స్టాప్ ఫంక్షన్‌ను పొందుతుంది. ఇది 1.2 లీటర్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 22.38 కిలోమీటర్ల మైలేజీని, 1.2 లీటర్ ఏఎంటీతో 22.56 కిలోమీటర్ల మైలేజీని, సీఎన్‌జీ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 30.90 కిలోమీటర్ల మైలేజీని పొందుతుంది.


మారుతి సుజుకి స్విఫ్ట్ ముఖ్య ఫీచర్లలో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, క్రూయిజ్ కంట్రోల్, ఆటో ఏసీ ఉన్నాయి. ఇక సెక్యూరిటీ ఫీచర్ల విషయానికి వస్తే... డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, హిల్ హోల్డ్ కంట్రోల్‌తో కూడిన ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ), వెనుక పార్కింగ్ సెన్సార్‌లు ఉన్నాయి.


మారుతి సుజుకి స్విఫ్ట్ ఇటీవలే మనదేశంలో కొత్త మైలురాయిని చేరుకుంది. ఇప్పటివరకు 25 లక్షల యూనిట్లను విక్రయించింది. ఈ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ మనదేశంలో బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఒకటి. 2005లో ఈ కారు మొట్టమొదటగా లాంచ్ అయింది. అప్పటి నుంచి దేశ ప్రజలకు ఇది ఫేవరెట్ కారుగా నిలిచింది. దీని సమీప పోటీదారు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌‌ కాగా, మరికొన్ని బడ్జెట్ కార్ల నుంచి కూడా స్విఫ్ట్ పోటీని ఎదుర్కొంటోంది. 2013లో స్విఫ్ట్ 10 లక్షల అమ్మకాల మైలురాయిని చేరుకుంది. ఆ తర్వాత కేవలం ఐదు సంవత్సరాల్లోనే 2018కి 20 లక్షల సేల్స్ మార్కును కూడా దాటింది.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!