Maruti Suzuki Safety Focus: భారతీయ కార్ మార్కెట్‌లో, మారుతి సుజుకి పేరు వినగానే ఇప్పటికీ చాలామందికి ముందుగా అడిగే మాట – “ఎంత ఇస్తుంది?”. మైలేజ్ అంటే మారుతి, మారుతి అంటే మైలేజ్ అనే స్థాయిలో ఈ బ్రాండ్ దశాబ్దాల పాటు తన గుర్తింపును నిర్మించుకుంది. దేశంలో ఇంధన ధరలు పెరుగుతున్న కాలంలో, ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లతో మారుతి కోట్లాది కుటుంబాల గుండెల్లో చోటు సంపాదించుకుంది. అప్పట్లో వచ్చిన ప్రకటనలు కూడా అదే విషయాన్ని బలంగా చెప్పేవి.
మారిన ట్రెండ్‌కానీ కాలం మారింది. కస్టమర్ల ఆలోచనలూ మారాయి. ఇప్పటి కొనుగోలుదారులు మైలేజ్‌తో పాటు సేఫ్టీ, ఫీచర్లు, టెక్నాలజీ కూడా కోరుకుంటున్నారు. ముఖ్యంగా యువత, కుటుంబాలు ఇప్పుడు కార్ కొనుగోలులో భద్రతకు పెద్దపీట వేస్తున్నారు. ఈ మార్పును టాటా, మహీంద్రా వంటి బ్రాండ్లు ముందే గుర్తించాయి, తమ కార్లను బలమైన నిర్మాణం & ఎక్కువ ఎయిర్‌బ్యాగ్స్‌తో మార్కెట్‌లోకి తీసుకొచ్చాయి. GNCAP రేటింగ్స్ కూడా సాధించి, సేఫ్టీ పరంగా మంచి పేరు సంపాదించుకున్నాయి.
మారిన మారుతిఇన్నాళ్లు మారుతి మాత్రం కనీస భారత ప్రమాణాలు సరిపోతాయని భావిస్తూ, GNCAP పరీక్షల విషయంలో దూరంగా ఉంది. అధికారికంగా కూడా ఆ సంస్థను గుర్తించబోమని చెప్పింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోంది. మారుతి స్వయంగా తన కార్లను GNCAP, BNCAP పరీక్షలకు పంపిస్తోంది. ఇది బ్రాండ్ ఆలోచనల్లో వచ్చిన పెద్ద మార్పుకు స్పష్టమైన సంకేతం.
ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లువిక్టోరిస్, కొత్త డిజైర్, ఇన్విక్టో వంటి మోడళ్లను ఫైవ్ స్టార్ లక్ష్యంగా క్రాష్ టెస్టులకు పంపింది. వినియోగదారులు సేఫ్టీకి ఇస్తున్న ప్రాధాన్యాన్ని మారుతి ఎట్టకేలకు అంగీకరించినట్టే. అంతేకాదు, విక్టోరిస్ మోడల్‌లో ADAS వంటి యాక్టివ్ సేఫ్టీ ఫీచర్లను కూడా పరిచయం చేసింది. ఇది మారుతి నుంచి వచ్చిన ఒక కీలక ముందడుగు.
మోడ్రన్ ఫీచర్లు కూడా...సేఫ్టీతో పాటు ఫీచర్ల విషయంలోనూ మారుతి మారుతోంది. ఈ విషయం హ్యుందాయ్, కియా లాంటి బ్రాండ్లు చాలా ఏళ్ల కిందే గ్రహించాయి. ఆడియో సిస్టమ్‌లను ఉదాహరణగా తీసుకుంటే, ఒకప్పుడు కస్టమర్లు బయట మార్కెట్‌లో వేల రూపాయలు ఖర్చు చేసి స్పీకర్లు, సబ్‌వూఫర్లు అమర్చుకునేవారు. ఆ అవసరాన్ని గుర్తించిన ఇతర బ్రాండ్లు Bose, JBL, Harman, Infinity లాంటి పేరున్న ఆడియో సిస్టమ్‌లను ఫ్యాక్టరీ నుంచే అందించాయి.
ఇప్పుడు మారుతి కూడా అదే దారిలో నడుస్తోంది. విక్టోరిస్‌లో Infinity ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, హెడ్ అప్ డిస్‌ప్లే, పానోరామిక్ సన్‌రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇవ్వడం గమనార్హం. ఇవన్నీ ఒకప్పుడు మారుతి కార్లలో ఊహించనివే.
మొత్తంగా చూస్తే, మైలేజ్ అనే పాత ఫార్ములా నుంచి బయటకు వచ్చి, సేఫ్టీ, టెక్నాలజీ, ఫీచర్ల వైపు మారుతి సుజుకి అడుగులు వేస్తోంది. ఇది ఆలస్యమైన నిర్ణయమే అయినా, సరైన దిశలో వేసిన అడుగే. భారత కస్టమర్ కోరుకునే కొత్త తరహా కార్లను మారుతి ఇకపై మరింత సీరియస్‌గా తీసుకుంటుందని చెప్పే సంకేతమే ఇది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.