Suzuki Jimny 5 Doors Sales Stopped: సుజుకి బ్రాండ్‌లో వచ్చిన "జిమ్నీ 5-డోర్", ఒక ఆఫ్-రోడ్ SUV మోడల్. దీనిని ప్రత్యేకంగా మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ తయారు చేస్తోంది. భారత మార్కెట్‌లో అమ్మకాలతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి అవుతోంది. మారుతి సుజుకీ, ఈ పవర్‌ఫుల్ SUVని గురుగావ్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తుంది & జపాన్, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాతో సహా వివిధ ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది.
వాస్తవానికి, సుజుకి జిమ్నీ 5-డోర్ మోడల్‌కు మన దేశంలో ప్రజాదరణ తక్కువగా ఉన్నప్పటికీ, ప్రపంచ మార్కెట్లో, ముఖ్యంగా ఆస్ట్రేలియాలో దీనికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. అక్కడ దీనిని జిమ్నీ XL పేరుతో విక్రయిస్తున్నారు. ఇప్పుడు, సుజుకీ కంపెనీ, అకస్మాత్తుగా ఆస్ట్రేలియాలో జిమ్నీ XL అమ్మకాలను నిలిపివేయాలని నిర్ణయించింది. ఇప్పటికే చేసుకున్న అన్ని బుకింగ్స్ రద్దు చేసి కస్టమర్లకు డబ్బు తిరిగి చెల్లించాలని డీలర్లకు సూచించింది.
డిమాండ్ ఉన్నప్పటికీ అమ్మకాలు ఎందుకు ఆగిపోయాయి?
సుజుకీ నిర్ణయం ఆటో ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే, ఆస్ట్రేలియాలో 3-డోర్ల జిమ్నీ అందుబాటులో లేకపోవడంతో, 5-డోర్ల జిమ్నీ XL కి డిమాండ్ బాగా పెరిగింది. 3-డోర్ల జిమ్నీ, అక్కడి అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఫీచర్ నియమాలను పాటించలేదు, కాబట్టి దాని అమ్మకాలను నిలిపివేశారు. దీనిని అప్‌గ్రేడ్ చేసి 2026 నుంచి సేల్స్ స్టార్ట్ చేస్తారని భావిస్తున్నారు. జిమ్నీ XLలో అలాంటి నియమాలు లేదా భద్రతా సంబంధిత సమస్యలు లేవు, ఎందుకంటే ఇది ఆస్ట్రేలియా ఉద్గార & భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. అయినప్పటికీ, కంపెనీ మోస్ట్ డిమాండెడ్ SUV అమ్మకాలను నిలిపివేసింది. ఈ నిర్ణయం వెనుకున్న కారణాలను కంపెనీ ఇప్పటి వరకు వెల్లడించలేదు.
ఇప్పటికే కొన్నవాళ్ల పరిస్థితి ఏంటి?
మీడియా నివేదికల ప్రకారం, జిమ్నీ XL విషయంలో భారతదేశంలోని తయారీ సైట్‌లో ఇవాల్యుయేషన్ జరుగుతోంది. ఈ నిర్ణయానికి కారణాన్ని సుజుకి బహిరంగంగా వెల్లడించనప్పటికీ, దానిలో ఎటువంటి భద్రతా లోపం లేదని కంపెనీ స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ SUVని కొన్నవాళ్లు ఎలాంటి ఆందోళన లేకుండా ఉపయోగించడం కొనసాగించవచ్చని ప్రకటించింది.
కస్టమర్లకు రెండు ఆప్షన్లు
జిమ్నీ 5-డోర్ విషయంలో తలెత్తిన సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందో కంపెనీకి తెలియదు, కాబట్టి డీలర్లు బుకింగ్‌లను రద్దు చేసి, కస్టమర్లకు డబ్బు వాపసు ఇవ్వాలని సూచించింది. తద్వారా, కస్టమర్‌లు ఈ బండి కోసం ఎదురు చూడాల్సిన అవసరాన్ని తప్పించింది. అయితే, కస్టమర్‌లు తమ బుకింగ్స్‌ను అలాగే ఉంచుకుని డెలివరీ కోసం ఎదురూ చూసే అవకాశం కూడా ఉంది.
కంపెనీ నేరుగా కస్టమర్లను సంప్రదిస్తుంది
ఆస్ట్రేలియాలో జిమ్నీ XL బుక్ చేసుకున్న కస్టమర్లందరినీ సుజుకి త్వరలో నేరుగా సంప్రదిస్తుంది. దీని కోసం, ఆస్ట్రేలియన్ డీలర్ల నుంచి బుకింగ్ వివరాలను కోరింది. కస్టమర్ల సందేహాలు & ప్రశ్నలను వ్యక్తిగతంగా పరిష్కరించడమే కంపెనీ ఉద్దేశ్యంగా తెలుస్తోంది.