Maruti e Vitara Price, Range And Features In Telugu: సామాన్యుల కారు కంపెనీ మారుతి సుజుకి, తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఇ-విటారాను విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఈ కారును ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో పరిచయం చేశారు. ఆ తర్వాత టెస్టింగ్ కోసం రోడ్లపై నడిపారు. చాలాకాలం ఎదురు చూపుల తర్వాత, ఇ-విటారాను సెప్టెంబర్ 3, 2025న (Maruti e Vitara launch date) లాంచ్ చేయనున్నట్లు మారుతి ప్రకటించింది. మారుతి ఇ-విటారా భారతదేశంలో అమ్మకానికి అందుబాటులో ఉండటమే కాకుండా, భారత్ నుంచి జపాన్ & యూరప్‌తో సహా ఇతర దేశాలకు కూడా ఎగుమతి కూడా అవుతుంది. 26 ఆగస్టు 2025, గుజరాత్‌లోని హన్సల్పూర్‌లో ఉన్న సుజుకి మోటార్ ప్లాంట్ నుంచి ఇ-విటారా ప్రొడక్షన్ ప్రారంభం అవుతుంది.
ఈ-విటారాలో రెండు బ్యాటరీ ఎంపికలు ఇస్తామని కంపెనీ ఇప్పటికే తెలిపింది. వీటిలో ఒకటి 48.8 kWh బ్యాటరీ ప్యాక్ & మరొకటి 61.1 kWh బ్యాటరీ ప్యాక్. వీటి రేంజ్ 500 కి.మీ. వరకు ఉంటుందని, వాస్తవ రేంజ్ డ్రైవింగ్ స్టైల్ & ట్రాఫిక్ పరిస్థితులపై మీద ఆధారపడి ఉంటుందని వెల్లడించింది.
మారుతి ఇ-విటారాలో కనిపించే ఫీచర్లుమారుతి, తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు E-Vitara కు ప్రీమియం ఫీల్ ఇవ్వడానికి, LED హెడ్‌లైట్లు, DRLs (డేటైమ్ రన్నింగ్ లైట్లు) & టెయిల్‌ల్యాంప్‌లు వంటి మోడరన్ టచ్‌లు ఇవ్వవచ్చు. ఈ SUV 18-అంగుళాల చక్రాలు & యాక్టివ్ ఎయిర్ వెంట్ గ్రిల్‌తో వస్తుంది, ఇది ఏరోడైనమిక్ సామర్థ్యాన్ని పెంచుతుంది.
ఇ-విటారా క్యాబిన్‌లో పనోరమిక్ సన్‌రూఫ్, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్ & 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ & 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి డిజిటల్ ఫీచర్లు ఉంటాయి. ఈ సిస్టమ్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇస్తుంది.
ఈ-విటారా సేఫ్టీ ఫీచర్లుమారుతి ఇ-విటారాలో అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు ఉంటాయని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఈ వాహనంలో లేన్ కీప్ అసిస్ట్ & అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి అధునాతన భద్రతా లక్షణాలు ఉండవచ్చు. ఈ SUV 7 ఎయిర్‌బ్యాగ్‌ల సౌకర్యాన్ని కలిగి ఉంటుంది, ఇది డ్రైవర్ & ప్రయాణీకుల భద్రత పెంచుతుంది. ఇంకా... స్పాట్ మానిటర్, టైర్ ప్రెజర్ మానిటర్, 360-డిగ్రీ కెమెరా, ముందు & వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి ఏర్పాట్లు కూడా ఉంటాయని భావిస్తున్నారు.
మారుతి సుజుకి ఇ-విటారాను ఎక్స్-షోరూమ్ ధర రూ. 17-18 లక్షల (Maruti e Vitara Price) నుంచి ప్రారంభం కావచ్చు. దాని టాప్ స్పెక్ వేరియంట్ ధర రూ. 25 లక్షల వరకు ఉండవచ్చు. లాంచింగ్ సమయంలో కంపెనీ పూర్తి వివరాలను వెల్లడిస్తుంది.