Maruti Suzuki eVX Electric SUV: మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ త్వరలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ విభాగంలోకి ప్రవేశించబోతోంది. కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ మోడల్ ఈవీఎక్స్‌ని ఆటో ఎక్స్‌పో 2023లో పరిచయం చేసింది. అప్పటి నుండి ప్రజలు మార్కెట్లోకి దాని రాక కోసం ఎదురు చూస్తున్నారు. 2025లో ఈ కారు మార్కెట్లో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇటీవల ఈవీఎక్స్ కారును కంపెనీ భారతీయ రోడ్లపై పరీక్షిస్తుంది.
దీని ఫొటోలు ఈవీఎక్స్ డిజైన్, ఫీచర్ల గురించి ప్రత్యేక వివరాలను రివీల్ చేస్తున్నాయని కొన్ని కథనాల్లో పేర్కొన్నారు. దీని కారణంగా భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీకి మంచి రోజులు వచ్చాయని అనుకోవచ్చు. ఫ్రంట్ లెఫ్ట్ ఫెండర్‌లో ఛార్జింగ్ పోర్టును చూడవచ్చు. ఇది దాని ప్రాక్టికాలిటీని చూపిస్తోంది. దీని సెక్యూరిటీ ఫీచర్లు కూడా అద్బుతంగా ఉండనున్నాయని సమాచారం. ముందు వైపు ఛార్జర్ పోర్టును అందించడం తాకిడి ప్రభావాన్ని కూడా తగ్గించే అవకాశం ఉంది.
రియర్‌వ్యూ మిర్రర్‌లపై అమర్చిన కెమెరాలు 360 డిగ్రీ కెమెరా సిస్టమ్‌ను సూచిస్తాయి. ఇది డ్రైవర్‌లకు మెరుగైన భద్రతను అందిస్తుంది. ప్రొడక్షన్ స్పెక్ మోడల్ స్మూత్ ఫ్రంట్ హెడ్‌ల్యాంప్ డిజైన్‌ను కలిగి ఉంది. అయితే ఎలక్ట్రిక్ మోడల్ కావడంతో నార్మల్ మోడల్స్‌లో కనిపించే గ్రిల్ ఇందులో కనిపించదు. ఇందులో ఏర్పాటు చేసిన ఎయిర్ డ్యామ్ విద్యుత్ భాగాలను చల్లబరుస్తుంది.
స్టైలిష్ మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్, వినూత్నమైన సి పిల్లర్ మౌంటెడ్ రియర్ డోర్ హ్యాండిల్ సైడ్ ప్రొఫైల్‌లో కనిపిస్తాయి. ఇది దాని రూపాన్ని మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా షార్క్ ఫిన్ యాంటెన్నా, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, రియర్ స్పాయిలర్, లైట్ బార్ వంటి అదనపు ఫీచర్లు ఈవీఎక్స్ ఆకర్షణను మరింత మెరుగుపరుస్తాయి.
ఇంటీరియర్, ఫీచర్లు ఇలా...
ఇంటీరియర్‌లో వైర్‌లెస్ ఛార్జర్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటుతో ఆటో డిమ్మింగ్ ఇంటీరియర్ రియర్‌వ్యూ మిర్రర్ వంటి అనేక అధునాతన ఫీచర్లు లభిస్తాయని భావిస్తున్నారు. ఇది కాకుండా ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే రెండింటికి సపోర్ట్ చేసే పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సీమ్‌లెస్ కనెక్టివిటీ, అనేక ఎంటర్‌టైన్‌మెంట్ ఆప్షన్లను కలిగి ఉంటుంది.
550 కిలోమీటర్ల రేంజ్
పవర్ కోసం ఇందులో 60 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ని అందించే అవకాశం ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 550 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని అంచనా. మారుతి సుజుకి ఈవీఎక్స్ భారతదేశంలోకి వచ్చే సమయం దగ్గరపడుతున్నందున కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో తన కమిట్‌మెంట్‌ను మరింత బలంగా చూపిస్తుంది.
మరోవైపు జీప్ ఇండియా కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని మన దేశంలో లాంచ్ చేయడంపై వర్క్ చేస్తుంది. జీప్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న మిడ్ సైజ్ ఎస్‌యూవీ కంపాస్ కంటే ఇది కాస్త తక్కువ స్థాయిలో ఉండనుందని తెలుస్తోంది. జీప్ లాంచ్ చేయనున్న ఈ కొత్త ఎస్‌యూవీ... హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్ వంటి ఇతర కార్లతో పోటీపడనుంది. జీప్ ప్రస్తుతం రూపొందిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీని సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్‌ను రూపొందించిన స్టెల్లాంటిస్ సీఎం ప్లాట్‌ఫారమ్‌పైనే రూపొందించనున్నారు.