Maruti Celerio Global NCAP Rating: భారతీయులు కారు కొనేటప్పుడు సేఫ్టీకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎన్ని ఫీచర్లు ఉన్నా, ఎన్ని ఎయిర్‌బ్యాగ్స్‌ ఇచ్చినా, గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ రేటింగ్‌ ఏంటన్నదే చాలా మంది కీలకంగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో, మారుతి సుజుకి సెలెరియో తాజాగా గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ ‍‌(GNCAP) క్రాష్‌ టెస్టులకు వెళ్లి, తన సేఫ్టీ స్కోర్‌ను బయట పెట్టింది.

Continues below advertisement

గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ నిర్వహించిన పరీక్షల్లో సెలెరియోకు... పెద్దల భద్రత (Adult Occupant Protection)లో 3 స్టార్‌ రేటింగ్‌, పిల్లల భద్రత (Child Occupant Protection)లో 2 స్టార్‌ రేటింగ్‌ లభించింది. స్కోర్ల పరంగా చూస్తే, పెద్దల భద్రతలో 34 మార్కులకు గాను 18.04 పాయింట్లు, పిల్లల భద్రతలో 49 మార్కులకు గాను 18.57 పాయింట్లు సాధించింది.

తాజా సేఫ్టీ అప్‌డేట్‌ ఉన్న సెలెరియోకే పరీక్ష

Continues below advertisement

గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ పరీక్షించిన సెలెరియో మోడల్‌, తాజా సేఫ్టీ అప్‌డేట్‌తోనే వచ్చింది. ఇందులో ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్స్‌, ESC (ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌) స్టాండర్డ్‌గా ఉన్నాయి. ఇదే కారును ముందు 2 ఎయిర్‌బ్యాగ్స్‌ కాన్ఫిగరేషన్‌లో పరీక్షించగా, అప్పట్లో పెద్దల భద్రతకు 2 స్టార్‌లు, పిల్లల భద్రతకు 1 స్టార్‌ మాత్రమే వచ్చాయి. తాజా అప్‌డేట్‌తో స్కోర్‌ కాస్త మెరుగైంది. 

అయితే... ఫ్రంటల్‌ క్రాష్‌ టెస్ట్‌లో బాడీషెల్‌, ఫుట్‌వెల్‌ అస్థిరంగా ఉన్నట్లు గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ గుర్తించింది. అంటే, మరింత లోడ్‌ను తట్టుకునే స్థాయిలో అవి లేవని తెలిపింది.

సెలెరియోలో స్టాండర్డ్‌ సేఫ్టీ ఫీచర్లు

టెస్ట్‌లో పరీక్షించిన సెలెరియోలో ఈ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి:

6 ఎయిర్‌బ్యాగ్స్‌

ESC

అన్ని సీట్లకు 3 పాయింట్‌ సీట్‌బెల్ట్స్‌, రిమైండర్స్‌

వెనుక సీట్లకు ISOFIX మౌంట్స్‌

ముందు సీట్లకు సీట్‌బెల్ట్‌ ప్రీటెన్షనర్స్‌, లోడ్‌ లిమిటర్స్‌

ABSతో పాటు EBD

రియర్‌ పార్కింగ్‌ సెన్సర్స్‌

UN R127 పాదచారి భద్రత ప్రమాణాలు

భారత్‌లో తయారైన ఈ కారును దేశీయ మార్కెట్‌ కోసమే పరీక్షించారు.

పెద్దల భద్రతలో సెలెరియో ఎలా చేసింది?

ఫ్రంటల్‌ టెస్టులో... డ్రైవర్‌కు తల భద్రత సరిపడే స్థాయిలో, ప్యాసింజర్‌కు మంచి స్థాయిలో ఉంది. రెండు ముందు సీట్లకు మెడ భద్రత బాగానే ఉన్నా, డ్రైవర్‌కు ఛెస్ట్‌ ప్రొటెక్షన్‌ బలహీనంగా, ప్యాసింజర్‌కు మాత్రం సరిపడే స్థాయిలో ఉందని నివేదిక చెబుతోంది. డ్యాష్‌బోర్డ్‌ వెనుక భాగాలకు మోకాళ్లు తగిలే అవకాశం ఉండటంతో, నీ (మోకాలు) ప్రొటెక్షన్‌ మార్జినల్‌ (మధ్యస్థం)గా గుర్తించారు.

సైడ్‌ ఇంపాక్ట్‌ టెస్టులో... తల, ఛెస్ట్‌ భద్రత మార్జినల్‌గా ఉండగా, అబ్డొమెన్‌ సరిపడే స్థాయిలో, పెల్విస్‌ భద్రత మంచి స్థాయిలో ఉంది. సైడ్‌ పోల్‌ టెస్టులో తల, పెల్విస్‌ భద్రత బాగానే ఉన్నా, ఛెస్ట్‌, అబ్డొమెన్‌ భద్రత మార్జినల్‌గా నమోదైంది.

పిల్లల భద్రతలో ఎందుకు తక్కువ స్కోర్‌?

పిల్లల భద్రతలో సెలెరియోకు 2 స్టార్‌ మాత్రమే రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఫ్రంటల్‌ టెస్టులో 3 ఏళ్ల చిన్నారి కోసం వాడిన ఫార్వర్డ్‌ ఫేసింగ్‌ సీట్‌, తలను పూర్తిగా నియంత్రించలేకపోయింది. మెడ, ఛెస్ట్‌ భద్రత బలహీనంగా నమోదైంది. 18 నెలల చిన్నారి కోసం వాడిన రియర్‌వర్డ్‌ ఫేసింగ్‌ సీట్‌లో కూడా తలకు ప్రమాదం కనిపించింది.

సైడ్‌ ఇంపాక్ట్‌ టెస్టులో 18 నెలల చిన్నారి సీట్‌ పూర్తి రక్షణ ఇచ్చినా, 3 ఏళ్ల చిన్నారి సీట్‌ తలను కాపాడలేకపోయింది. ఫ్రంట్‌ ప్యాసింజర్‌ ఎయిర్‌బ్యాగ్‌ను ఆఫ్‌ చేసే ఆప్షన్‌ లేకపోవడం, చైల్డ్‌ సీట్లు కేవలం వెనుక సీట్లకే అనుమతి ఉండటం కూడా స్కోర్‌పై ప్రభావం చూపాయి.

గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ ఏమంటోంది?

గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ ప్రకారం, గతంతో పోలిస్తే, తాజా సేఫ్టీ ఫీచర్ల వల్ల సెలెరియో స్కోర్‌ మెరుగుపడింది. కానీ అస్థిరమైన బాడీషెల్‌, కొన్ని ప్రాంతాల్లో పరిమిత రక్షణ, పిల్లల సీట్‌ పనితీరులో లోపాలు ఉండటంతో, రేటింగ్‌ 3 స్టార్‌లు, 2 స్టార్‌లకే పరిమితమైంది. భవిష్యత్తులో ఎక్కువ రేటింగ్‌ రావాలంటే స్ట్రక్చర్‌, చైల్డ్‌ రెస్ట్రెంట్‌ సిస్టమ్‌లో మరిన్ని మెరుగుదలలు అవసరమని గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ స్పష్టం చేసింది.

ప్రయాణీకుల సేఫ్టీ పరంగా మారుతి సెలెరియో ఒక మెట్టు పైకి ఎక్కినప్పటికీ, మెరుగుదలకు ఇంకా అవకాశం ఉందన్నదే తాజా క్రాష్‌ టెస్ట్‌ చెప్పే నిజం.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.