మారుతి సుజుకి త్వరలో మనదేశంలో కొత్త బ్రెజాను లాంచ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కారు టీజర్‌ను కూడా కంపెనీ ఇటీవలే విడుదల చేసింది. ఇప్పుడు దీనికి సంబంధించిన బుకింగ్స్‌ను కూడా ప్రారంభించింది. మొదటి రోజు ఏకంగా 4,500 బుకింగ్స్ వచ్చాయని కంపెనీ అధికారులు తెలిపారు.


ఇంతకుముందు ఈ కారును విటారా బ్రెజా అని పిలిచేవారు. ఇప్పుడు దీన్ని ‘ది బ్రెజా’కు మార్చారు. మనదేశంలో జూన్ 30వ తేదీన ఈ కారు లాంచ్ కానుంది. ఇందులో కొన్ని కొత్త ఫీచర్లను మారుతి సుజుకి అందించనుంది. కారు ముందు, వెనక డిజైన్ కూడా కొత్తగా ఉండనున్నాయి.


ప్రస్తుతం అందుబాటులో ఉన్న మారుతి సుజుకి విటారా బ్రెజాకు సంబంధించి ఇంకా 20 వేల బుకింగ్స్ పెండింగ్‌లో ఉన్నాయని కంపెనీ సేల్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ అన్నారు. నెలకు 10 వేల యూనిట్ల చొప్పున డెలివరీ చేస్తున్నామని, కాబట్టి ప్రస్తుతం విటారా బ్రెజా వెయిటింగ్ పీరియడ్ రెండు నెలలుగా ఉందన్నారు.


వీటిని బుక్ చేసుకున్న వినియోగదారులు కావాలంటే కొత్త బ్రెజాకు అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం కూడా కల్పించామని తెలిపారు. త్వరలో రానున్న బ్రెజాను బుక్ చేసుకోవాలంటే దగ్గరలో ఉన్న షోరూంకి వెళ్లి రూ.11,000 టోకెన్ అమౌంట్ కడితే సరిపోతుంది.


త్వరలో రానున్న మారుతి సుజుకి బ్రెజాలో కే15బీ సిరీస్ 1.5 లీటర్ ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అందించారు. ఎక్స్ఎల్6 ఎంపీవీలో కూడా ఇదే డిజైన్ ఉంది. 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో ఈ కారు కొనుగోలు చేయవచ్చు.


దీంతోపాటు ఈ కారులో హెడ్స్ అప్ డిస్‌ప్లే, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా వంటి ముఖ్యమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న విటారా బ్రెజా కంటే కొంచెం ఎక్కువ ధరలోనే కొత్త బ్రెజా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న విటారా బ్రెజా ధర రూ.7.84 లక్షల నుంచి రూ.11.49 లక్షల మధ్య ఉంది.


Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?