Maruti Dzire Pros & Cons: భారత కార్ల మార్కెట్లో SUVల హవా కొనసాగుతున్నప్పటికీ సెడాన్ విభాగంలో మారుతి డిజైర్‌ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 2024 చివర్లో విడుదలైన నాలుగో తరం డిజైర్‌ అమ్మకాల పరంగా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. కొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లు, మెరుగైన భద్రత & అధిక మైలేజ్‌తో ఈ సెడాన్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం కొత్త కారు కొనాలని భావిస్తున్న వారు Maruti Dzireను పరిశీలిస్తున్నట్లయితే, ఈ కారును కొందరు కొనమంటారు, మరికొందరు వద్దని కూడా చెబుతారు. మారుతి డిజైర్‌ను కొనడానికి ఉన్న 3 ప్రధాన కారణాలు & ఒకసారి ఆలోచించాల్సిన 2 లోపాల గురించి తెలుసుకోవాల్సిందే.

Continues below advertisement

అద్భుతమైన మైలేజ్

Maruti Dzireలో కంపెనీ కొత్త 1.2 లీటర్ 3 సిలిండర్ Z12E పెట్రోల్ ఇంజిన్‌ను అందిస్తోంది. ఈ ఇంజిన్ ప్రధాన బలం ఇంధన పొదుపు. తక్కువ బరువుతో రూపొందించిన ఈ సెడాన్ అత్యుత్తమ మైలేజ్‌ను అందిస్తుంది.

Continues below advertisement

ARAI ప్రకారం 5-స్పీడ్‌ మాన్యువల్‌ వేరియంట్ లీటర్‌కు 24.79 కిలోమీటర్లు & 5-స్పీడ్‌ AMT వేరియంట్ లీటర్‌కు 25.71 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. CNG వేరియంట్‌లో అయితే కిలోకు 33.73 కిలోమీటర్ల వరకు మైలేజ్ లభిస్తుంది. వాస్తవ డ్రైవింగ్ పరీక్షల్లో కూడా మాన్యువల్‌ వేరియంట్ సగటున 17.25 కిలోమీటర్లు & AMT వేరియంట్ 15.41 కిలోమీటర్ల మైలేజ్‌ను నమోదు చేసింది. రోజువారీ వినియోగంలో ఇంధన ఖర్చును తగ్గించాలనుకునే వారికి ఇది పెద్ద ప్రయోజనం.

5 స్టార్ భద్రత

తక్కువ బరువు ఉన్నప్పటికీ భద్రత విషయంలో Maruti Dzire రాజీ పడలేదు. ఈ సెడాన్‌కు గ్లోబల్‌ NCAP & భారత్‌ NCAP క్రాష్ పరీక్షల్లో 'అడల్ట్‌ ఆక్యుపెంట్‌ ప్రొటెక్షన్‌' విభాగంలో 5 స్టార్ రేటింగ్ లభించింది. ప్రస్తుతం భారత మార్కెట్లో చాలా కొద్ది కార్లకే ఈ ఘనత దక్కింది.

భద్రతా ఫీచర్లలో అన్ని వేరియంట్లలోనే 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ESP, హిల్ హోల్డ్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, రియర్ డిఫాగర్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. టాప్ వేరియంట్లలో 360-డిగ్రీల కెమెరా, TPMS & డే/నైట్ IRVM వంటి అదనపు ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: ఎయిర్‌బ్యాగ్ లోపల సరిగ్గా ఏం జరుగుతుంది? అది ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

సౌకర్యవంతమైన ప్రయాణం & మెరుగైన హ్యాండ్లింగ్

Maruti Dzire మరో ప్రధాన బలం దాని రైడ్‌ క్వాలిటీ. చిన్న గుంతలు, ఎత్తుపల్లాలు & స్పీడ్ బ్రేకర్లపై కూడా ఈ కారు చాలా సౌకర్యవంతంగా ప్రయాణిస్తుంది. 163 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటంతో సాధారణ భారత రోడ్లపై ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు.

హ్యాండ్లింగ్ పరంగా కూడా Dzire ఆకట్టుకుంటుంది. స్టీరింగ్ తేలికగా స్పందించడంతో పాటు మలుపుల్లో కూడా మంచి నియంత్రణను అందిస్తుంది. వేగంగా మలుపులు తిరిగినప్పుడు స్వల్పంగా బాడీ రోల్‌ కనిపించినప్పటికీ మొత్తం మీద డ్రైవింగ్ అనుభవం నమ్మకాన్ని కలిగిస్తుంది.

ఇంజిన్‌లో పవర్ కొద్దిగా తక్కువ

Dzireలో ఉన్న కొత్త Z12E ఇంజిన్ మైలేజ్ విషయంలో అద్భుతంగా ఉన్నా, పనితీరు పరంగా కొంత నిరాశ కలిగిస్తుంది. ఈ ఇంజిన్ 82 hp పవర్ & 112 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది గత తరం మోడల్‌తో పోలిస్తే తక్కువ. తక్కువ వేగాల్లో ఇంజిన్‌ స్పందన బాగానే ఉన్నప్పటికీ, అధిక వేగాల్లో పవర్ కొరత స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఓవర్‌టేకింగ్ సమయంలో మరింత శక్తి ఉంటే బాగుండేదనే భావన కలుగుతుంది. AMT వేరియంట్ 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి 15.21 సెకన్లు తీసుకోవడం కూడా దీనికి నిదర్శనం.

ఇది కూడా చదవండి: రూ.4.53 లక్షలకే 2026 Renault Kwid లాంచ్‌ - కొత్త స్టీరింగ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, CNG ఆప్షన్‌

వెనుక సీటులో హెడ్‌రూమ్ తక్కువ

Maruti Dzireలో మరో చిన్న లోపం వెనుక సీటు హెడ్‌రూమ్. ముఖ్యంగా పొడవైన వ్యక్తులకు పైభాగంలో స్థలం కొద్దిగా తక్కువగా అనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం సన్‌రూఫ్‌ కోసం అమర్చిన మెకానిజం. పైకప్పు లోపలి భాగాన్ని ప్రత్యేకంగా రూపొందించినప్పటికీ, పొడవైన వ్యక్తులకు ఇది పూర్తిగా సరిపోదు. ధర

2025 మారుతి డిజైర్‌ ఎక్స్‌-షోరూమ్‌ రేటు రూ.6.26 లక్షలు. తెలుగు రాష్ట్రాల్లో రూ.7.42 - రూ.11.10 లక్షల వరకు ఆన్‌రోడ్‌ ధర పలుకుతోంది.

మొత్తంగా చూస్తే Maruti Dzire మంచి మైలేజ్, అత్యుత్తమ భద్రత, సౌకర్యవంతమైన ప్రయాణం కోరుకునే వారికి అద్భుతమైన ఎంపిక. అయితే అధిక పనితీరు కోరుకునే వారు & వెనుక సీటులో ఎక్కువ హెడ్‌రూమ్ ఆశించే వారు కొనుగోలు ముందు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి నిర్ణయం తీసుకోవడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.