Honda Cars July 2026 Offers: ఈ నెల (జులై 2026‌)లో కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వాళ్లకు Honda శుభవార్త చెప్పింది. ఈ నెలలో తన ప్రముఖ మోడళ్లపై ఆకర్షణీయమైన ప్రయోజనాలను ప్రకటించింది. ముఖ్యంగా Honda Elevateపై గరిష్ఠంగా రూ.2.15 లక్షల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉండగా, Honda Amaze రెండో తరం & మూడో తరం మోడళ్లపై కూడా మంచి ఆఫర్లు లభిస్తున్నాయి. అయితే ఇటీవలే ఫేస్‌లిఫ్ట్‌తో మార్కెట్లోకి వచ్చిన కొత్త Honda Cityపై మాత్రం ఈ నెలలో ఎలాంటి ఆఫర్లు లేవు.

Continues below advertisement

కంపెనీ ప్రకటించిన వివరాల ప్రకారం ఈ ఆఫర్లు జులై 31, 2026 వరకు మాత్రమే అమల్లో ఉంటాయి. నగరాన్ని బట్టి, డీలర్‌షిప్‌ను బట్టి & స్టాక్ లభ్యతను బట్టి ప్రయోజనాల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. అందువల్ల కొనుగోలు చేసే ముందు సమీప Honda డీలర్‌ను సంప్రదించడం మంచిది.

హోండా ఎలివేట్‌పై గరిష్ట ప్రయోజనాలుజులైలో అత్యధిక బెనిఫిట్స్‌ Honda Elevateపైనే లభిస్తున్నాయి. మొత్తం రూ.2.15 లక్షల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో గరిష్ఠంగా రూ.40,000 వరకు నగదు రాయితీ, రూ.30,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ ప్రయోజనాలు & లాయల్టీ బెనిఫిట్స్ ఉన్నాయి. అంతేకాకుండా 7 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్‌ వారంటీని కూడా డిస్కౌంట్‌ రేట్‌లో కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది.

Continues below advertisement

ప్రస్తుతం Honda Elevate ధరలు రూ.11.60 లక్షల నుంచి రూ.16.16 లక్షల వరకు ఉన్నాయి. మధ్యతరహా SUV విభాగంలో ఇది Hyundai Creta, Kia Seltos, Tata Sierra, Maruti Victoris, Maruti Grand Vitara & Renault Duster వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తోంది. మంచి గ్రౌండ్ క్లియరెన్స్, విశాలమైన క్యాబిన్, విశ్వసనీయమైన పెట్రోల్ ఇంజిన్ & Honda బ్రాండ్ నమ్మకంతో Elevate ఇప్పటికే మంచి ఆదరణ పొందుతోంది. ఇప్పుడు భారీ ఆఫర్లు కూడా జత కావడంతో కొనుగోలుదారులకు ఇది మరింత ఆకర్షణీయమైన ఎంపికగా మారింది.

ఇది కూడా చదవండి: రూ.4.53 లక్షలకే 2026 Renault Kwid లాంచ్‌ - కొత్త స్టీరింగ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, CNG ఆప్షన్‌

హోండా అమేజ్‌పై...Honda Amazeపై కూడా కంపెనీ ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది. తాజా మూడో తరం Amazeపై గరిష్ఠంగా రూ.67,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో రూ.15,000 నగదు రాయితీ, రూ.15,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్‌తో పాటు లాయల్టీ ప్రయోజనాలు కూడా లభిస్తున్నాయి. అలాగే 7 సంవత్సరాల పొడిగించిన వారంటీని తక్కువ ధరకు పొందే అవకాశం ఉంది.

మరోవైపు రెండో తరం Amazeపై గరిష్ఠంగా రూ.58,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో విశ్వసనీయమైన సెడాన్ కోసం చూస్తున్న వారికి ఈ ఆఫర్లు మంచి అవకాశంగా చెప్పవచ్చు.

ధరల విషయానికి వస్తే రెండో తరం Honda Amaze ధరలు రూ.6.98 లక్షల నుంచి రూ.7.80 లక్షల వరకు ఉన్నాయి. మూడో తరం Amaze ధరలు రూ.7.51 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు నిర్ణయించారు. ఈ రెండు మోడళ్లు కూడా Maruti Dzire, Tata Tigor & Hyundai Aura వంటి కార్లతో పోటీ పడుతున్నాయి.

అయితే ఇటీవలే ఫేస్‌లిఫ్ట్‌తో విడుదలైన కొత్త Honda Cityపై ఈ నెలలో ఎలాంటి రాయితీలు లేదా ప్రత్యేక ప్రయోజనాలు లేవు. కొత్త మోడల్‌కు ఇప్పటికే మంచి డిమాండ్ ఉండటంతో కంపెనీ ఎలాంటి డిస్కౌంట్ ప్రకటించలేదు.

ఇది కూడా చదవండి: BAT-BMSతో సహా 7 యాప్‌లను తొలగించాలని గూగుల్‌, ఆపిల్‌కు ప్రభుత్వం నోటీసులు! ఎందుకు ఎలా వివాదం మొదలైంది?

మొత్తంగా చూస్తే జులై నెలలో Honda ప్రకటించిన ఆఫర్లలో Elevate అత్యంత లాభదాయకమైన ఎంపికగా నిలిచింది. భారీ నగదు రాయితీలు, ఎక్స్చేంజ్ బోనస్, లాయల్టీ ప్రయోజనాలు & తక్కువ ధరలోనే 'ఎక్స్‌టెండెడ్‌ వారంటీ' వంటి ప్రయోజనాలతో కొత్త కారు కొనాలనుకునే వారికి ఇది అనుకూల సమయంగా చెప్పవచ్చు. ఈ ఆఫర్లు పరిమిత కాలం ‍‌మాత్రమే అందుబాటులో ఉండటంతో, ఆసక్తి ఉన్నవాళ్లు జులై 31లోపు సమీప Honda డీలర్‌షిప్‌ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవడం ఉత్తమం.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.