మారుతీ ఆల్టో.. సామాన్యుడికి కూడా అందుబాటులో ఉన్న చిన్న కారు ఇది. అయితే, ఇందులో Alto K10కు భలే మంచి డిమాండ్ ఉంది. 800 సీసీ మారుతీ కారుకు, దీనికి మధ్య తేడా చాలా చిన్నది. కానీ, త్వరలో మార్కెట్లోకి రానున్న ALTO K10 2022 కారులో సరికొత్త ఫీచర్స్ ఉండబోతున్నాయని తెలిసింది. దీనికి సంబంధించిన కొన్ని ప్రత్యేకతలు లీక్ అయ్యాయి. సెలెరియో(Celerio) కింద కాస్త తక్కువ ధరలో కారు కోసం ఎదురుచూసే సామాన్యులకు కొత్త K10 బెస్ట్ ఆప్షన్‌గా నిలిచే అవకాశం ఉంది.  


లీకైన ALTO K10, 2022 చిత్రాల ప్రకారం.. ఇది కాస్త తక్కువ బాక్సీ రూపంలో కనిపించింది. ఇటీవల కొత్త ఫేస్‌లిఫ్ట్‌తో వచ్చిన Celerio మోడల్‌కు దరిదాపుల్లో ఉంది. అయితే, రెండికి మధ్య కొన్ని మార్పులు ఉన్నాయి. K10 ముందు భాగంలో తక్కువ గ్రిల్ఉంది. దీనివల్ల హెడ్‌ల్యాంప్‌లు పెద్దగా కనిపిస్తున్నాయి. ఇతర మారుతి కార్లలో ఉపయోగించే హార్ట్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌ను కొత్త ఆల్టోలో చూడవచ్చు. దీనివల్ల పొడవైన వీల్‌బేస్, మెరుగైన భద్రత లభిస్తుంది. కొత్త ఆల్టో కూడా సెలెరియో(Celerio) తరహాలోనే డోర్ హ్యాండిల్స్‌ను కలిగి ఉంది. వెనుక టెయిల్‌ల్యాంప్‌లు బాక్సియర్ రూపంలో ఉన్నాయి.  


ఇంటీరియర్ నాణ్యతలో భారీ మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆల్టోతో పోల్చినప్పుడు కొత్త ఆల్టో  K10 మరింత ఆధునికంగా కనిపిస్తోంది. నేటి భద్రతా ప్రమాణాలకు తగినట్లుగా ఈ కారును రూపొందించి ఉండవచ్చని తెలుస్తోంది. అయితే, ఈ మోడల్‌ను స్వయంగా పరిశీలించినప్పుడే అసలు విషయం తెలుస్తుంది. అది ఎంత సేఫ్ అనేది అర్థమవుతుంది. సెలెరియోతో కొన్ని స్పష్టమైన సారూప్యతలు K10లో ఉన్నాయి. ఎయిర్ వెంట్స్, టచ్‌స్క్రీన్ కాస్త సెలెరియో(Celerio) తరహాలోనే ఉంటాయి. విండో స్విచ్‌లు మధ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ డిస్‌ప్లే కూడా సెలెరియో తరహాలోనే కనిపిస్తోంది.

అయితే, సెలెరియో తరహాలో  K10లో స్టీరింగ్ నియంత్రణలు, బ్యాక్ పార్కింగ్ సెన్సార్‌లు, కెమెరాలు లేనట్లు తెలుస్తోంది. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABSలు, మిర్రర్‌ల మాన్యువల్ సర్దుబాటు వంటివి ఇందులో ఉండవచ్చని తెలుస్తోంది. ALTO K10, 2022 మోడల్ కొత్త Dualjet 1.0l ఇంజిన్‌తో మాన్యువల్, AMT ఆప్షన్స్‌తో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దీని పవర్ అవుట్‌పుట్ 69 bhp. ఇందులో CNG ఆప్షన్ కూడా ఉంటుందట. అయితే, దీని ధర ఎంత అనేది ఇంకా తెలియరాలేదు. ఆ వివరాలు కూడా తెలియగానే.. ALTO K10, Celerio కార్ల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మరింత వివరంగా తెలియజేస్తాం.


Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!