Manual Transmission Car: కార్లలో మాన్యువల్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ (గేర్‌బాక్స్‌) గురించి మనకు తెలుసు. ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ అనేది డ్రైవింగ్‌ను ఈజీగా మార్చి, డ్రైవర్‌పై ఒత్తిడి తగ్గిస్తుంది. అయితే, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కారును నడపడం వల్ల శారీరక ఉల్లాసంతో పాటు మెదడుకూ మంచి వ్యాయామం లభిస్తుందని తాజా అధ్యయనం చెబుతోంది. ఇప్పటికే మాన్యువల్ కార్లను ఇష్టపడే వారికి ఇది మరో మంచి కారణం కాగా, ఇప్పటి వరకు ఆటోమేటిక్ కార్లనే ఎంచుకున్న వారికి కూడా ఈ పరిశోధన కొత్త ఆలోచనలను కలిగిస్తోంది.

Continues below advertisement

జపాన్‌లోని తొహోకు యూనివర్సిటీకి చెందిన ప్రముఖ పరిశోధకుడు ర్యుటా కవాషిమా నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది. మాన్యువల్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కార్లను నడిపే సమయంలో మెదడు ఎలా స్పందిస్తుందో ఈ అధ్యయనంలో పరిశీలించారు. ఈ పరిశోధనలో మాన్యువల్ కారు నడిపేటప్పుడు మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ భాగం మరింత చురుకుగా పనిచేస్తుందని గుర్తించారు.

ఈ భాగం మన ఏకాగ్రత, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, స్వల్పకాలిక జ్ఞాపకశక్తి వంటి కీలక పనులను నియంత్రిస్తుంది. అందువల్ల తరచూ మాన్యువల్ కారు నడపడం వల్ల ఈ భాగానికి నిరంతర వ్యాయామం లభిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

Continues below advertisement

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!

మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కారును నడిపేటప్పుడు డ్రైవర్ ఒకేసారి క్లచ్, గేర్ లీవర్, యాక్సిలరేటర్, బ్రేక్ & స్టీరింగ్‌ను సమన్వయం చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో రోడ్డు పరిస్థితులు, ట్రాఫిక్, వాహనం వేగం, ఇంజిన్ ఆర్‌పీఎం వంటి అంశాలను నిరంతరం గమనిస్తూ సరైన సమయంలో సరైన గేర్‌ను ఎంచుకోవాలి. ఈ మొత్తం ప్రక్రియ మెదడుకు చిన్న స్థాయి మానసిక వ్యాయామంలా పనిచేస్తుందని అధ్యయనం వెల్లడించింది.

ఆటోమేటిక్ కార్లలో గేర్ మార్పుల బాధ్యత ఎక్కువగా సిస్టమే చూసుకుంటుంది. దీనివల్ల డ్రైవర్‌పై ఉండే మానసిక ఒత్తిడి కొంత తగ్గుతుంది. అయితే మాన్యువల్ కారులో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సి రావడం వల్ల డ్రైవర్ ఏకాగ్రత ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు.

వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గడం, మతిమరుపు వంటి సమస్యలు కనిపించే అవకాశం ఉంటుంది. మాన్యువల్ కార్లను తరచూ నడపడం వల్ల అలాంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో లేదా ఆలస్యం చేయడంలో ఉపయోగపడే అవకాశం ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై మరింత విస్తృత పరిశోధన అవసరమని కూడా స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: ట్రాఫిక్ చలాన్ పేరుతో కొత్త సైబర్ మోసం - కేంద్రం హెచ్చరిక, ఇలా జాగ్రత్తపడండి

గతంలో నిర్వహించిన కొన్ని ప్రాథమిక అధ్యయనాల్లో కూడా మాన్యువల్ కార్లు నడిపే వారు రోడ్డు మీద ఎక్కువ అప్రమత్తంగా వ్యవహరించినట్లు గుర్తించారు. డ్రైవింగ్ సమయంలో పరిసరాలను గమనించడం, వేగాన్ని అంచనా వేయడం, సరైన సమయంలో గేర్ మార్చడం వంటి చర్యలు మెదడును నిరంతరం చురుకుగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు.

మొత్తంగా చూస్తే, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కారు నడపడం కేవలం డ్రైవింగ్ అనుభవానికే పరిమితం కాదు. ప్రతి గేర్ మార్పు, ప్రతి నిర్ణయం, ప్రతి కదలిక మెదడుకు ఒక వ్యాయామంలా పనిచేస్తుంది. రోజువారీ ప్రయాణాన్నే ఒక మానసిక సాధనగా మార్చే సామర్థ్యం మాన్యువల్ డ్రైవింగ్‌లో ఉందని తాజా అధ్యయనం సూచిస్తోంది. అయితే దీనిని పూర్తి స్థాయిలో నిర్ధారించడానికి భవిష్యత్తులో మరిన్ని శాస్త్రీయ పరిశోధనలు అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.