Mahindra XUV 3XO: మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ కొత్త కారును భారత్ లో సోమవారం (ఏప్రిల్ 29) లాంచ్ చేసింది. ఇది XUV 300 మోడల్ కారు బేసిక్ స్టైలింగ్‌తో ఉంది. ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ డిజైన్లను పూర్తిగా మరింత ఆకర్షణీయంగా మార్చారు. డిజైన్ పరంగా చూస్తే కారు ఎక్స్‌టీరియర్ యాంగ్యులర్ లుక్స్‌ను చాలా అప్ డేట్ చేశారు. మరింత స్టైలిష్ గా కనిపించేలా ఎల్ఈడీ డీఆర్ఎల్ (డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్) లైట్లను అమర్చారు. అంతేకాక, బంపర్ డిజైన్ కూడా విభిన్నంగా ఉంది. అటు సరికొత్త అలోయ్ వీల్స్ 17 ఇంచుల సైజుతో ఉన్నాయి. వీటి డిజైన్ కూడా మరింత ఆకట్టుకునేలా ఉంది. 


ఇక కారు వెనుక వెపు స్టైలింగ్ మతిపోగొట్టేలా ఉంది. ఈ స్టైలింగ్ లో చెప్పుకోదగ్గ మార్పులు చేసింది మహీంద్రా కంపెనీ. ఎల్‌ఈడీ లైట్ బార్, సి ఆకారంలోని టెయిల్ ల్యాంప్స్ చూపుతిప్పుకోనివ్వకుండా ఉన్నాయి. 


ఇంటీరియర్‌లోనూ సరికొత్త లుక్‌ను పరిచయం చేశారు. ఇది XUV 400 EV లోని ఇంటీరియర్ బేసిక్ స్టైలింగ్‌లో చాలా మార్పులు చేసి.. XUV 3XO ఇంటీరియర్ డిజైన్ చేసినట్లుగా సంస్థ తెలుపుతోంది. XUV 400 EV లో ఉన్నట్లుగా 10.25 అంగుళాల స్క్రీన్ ను అమర్చారు. దీనిద్వారా హై రిజల్యూషన్ తో పాటు మరెన్నో టెక్ ఫీచర్లు పొందే అవకాశం ఉంటుంది. 10.25 అంగుళాల మరో టీఎఫ్‌టీ డిజిటల్ డిస్ ప్లే ద్వారా మరింత ప్రీమియం లుక్ ను కారు లోపల అనుభూతి చెందవచ్చు.


XUV 3XO లో మరో చెప్పుకోదగ్గ ఫీచర్ పానోరమిక్ సన్ రూఫ్. ఈ ఫీచర్ ఈ క్లాస్‌లోనే మొదటిసారిగా ప్రవేశపెట్టినట్లు చెబుతున్నారు. ఇంకా 360 డిగ్రీల కెమెరా, హార్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, వైర్ లెస్ ఛార్జింగ్ లాంటి మరెన్నో సదుపాయాలు ఈ కారులో ఉన్నాయి. భద్రాతా పరంగానూ కీలక ఫీచర్లను XUV 3XO లో జోడించారు. ఇంకా Advanced driver-assistance systems లెవెల్ 2 ఫీచర్ ఇందులో ఉంది. దీని ద్వారా కారు నడుపుతున్న వ్యక్తికి మరింత భద్రతా పరమైన ఇండికేషన్స్ కనిపిస్తాయి. ఈ ఫీచర్ ఈ క్లాస్ కార్లలో ఇదే మొదటిసారని కంపెనీ తెలిపింది. 




ఇక XUV 3XO కారు 1.2 లీటర్స్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్స్ డీజిల్ ఇంజిన్ వేరియంట్లలో లభించనుంది. 1.2 లీటర్స్ టర్బో పెట్రోల్ ఇంజిన్లలో 6 స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ ఫీచర్ ను తొలిసారిగా ప్రవేశపెట్టారు. XUV 3XO కారు XUV700 లోని అన్ని ఫీచర్స్‌తో సరిసమానంగా ఉందని మహీంద్రా సంస్థ చెబుతోంది. XUV 3XO మోడల్ టాటా నెక్సాన్, హ్యుండయ్ వెన్యూ, కియా సోనెట్ లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇక ధర విషయానికి వస్తే Mahindra XUV 3XO బేసిక్ వేరియంట్ ధర భారత్‌లో 7.4 లక్షల నుంచి మొదలు కానున్నట్లుగా మహీంద్రా సంస్థ ప్రకటించింది.