ఇండియన్ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ల వైపు దృష్టి మళ్లిస్తోంది. ఈ  విభాగంలో రాణించేందుకు కీలక ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే  ఐదు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ‌ కార్లను పరిచయం చేసిన ఈ కంపెనీ.. . ఎలక్ట్రిక్ XUV 400  మోడల్‌ను సెప్టెంబర్ 8న లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్‌లో ఎక్స్‌యూవీ 400 మొదటి ఎలక్ట్రిక్ వెహికల్.  కావడం గమనార్హం. మిడ్ సైజ్‌లో పాపులరైన XUV 300కు ఎలక్ట్రిక్ వెర్షన్‌గా XUV 400 రాబోతుంది.


ఆనంద్ మహీంద్రా ట్వీట్


ఎలక్ట్రిక్ XUV 400  విడుదలకు సంబంధించిన  విషయాన్ని  కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఆయన  వీడియోను షేర్ చేశారు.  XUV400 ఎలక్ట్రిక్ సెప్టెంబర్ 8న విడుదల అవుతుందని వెల్లడించారు.  XUV 300తో పోలిస్తే ఎలక్ట్రిక్ XUV  ఇంకా  పొడవుతో వస్తుందని కంపెనీ వెల్లడించింది.  XUV 400 ఎలక్ట్రిక్ వాహనం.. మహీంద్రా XUV700లోని సరికొత్త టెక్ అండ్ ADAS ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది. ఇంటిగ్రేటెడ్ DRLలతో కూడిన కొత్త హెడ్‌లైట్, క్లోజ్డ్ ఆఫ్ ఫ్రంట్ గ్రిల్, టెయిల్ ల్యాంప్స్ కోసం కొత్త డిజైన్, రీప్రొఫైల్డ్ టెయిల్‌గేట్ వంటి కొన్ని డిజైన్ అప్‌గ్రేడ్స్ రాబోయే ఈవీలో ఉండే అవకాశం ఉంది.  XUV 400కు సంబంధించి  రీడిజైన్ లైటింగ్ ఎలిమెంట్‌లతో అప్‌డేట్ అయిన LED టైల్‌లైట్ ఉన్నట్లు నిర్ధారించింది. XUV 400లో ఇన్ఫోటైన్‌మెంట్ డ్యూటీస్‌ను హ్యాండిల్ చేయడానికి బ్రాండ్ Adreno X ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, భారీ టచ్‌స్క్రీన్ సిస్టమ్‌తో ఉండే అవకాశం ఉంది.






టాటా నెక్సాన్ EVకి పోటీ


అటు ఈ  XUV 400 EV రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో  150 bhp అవుట్‌ పుట్‌ ను కలిగి ఉంటుందని తెలుస్తుంది.  ఈ కారు ఒక ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుందని ఆటో మొబైల్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక పవర్‌ ట్రెయిన్ స్పెసిఫికేషన్‌పై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. మహీంద్రా XUV 400 EV మోడల్ టాటా నెక్సాన్ EVకు పోటీగా భారత మార్కెట్‌లోకి రానుంది. దీని ధర రూ. 15లక్షలు వరకు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.   


పాసింజర్‌ వెహికల్‌ సెగ్మెంట్‌లో 5 ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీలు


అటు  పాసింజర్‌ వెహికల్‌ సెగ్మెంట్‌లో ఏకంగా ఐదు ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీలను తీసుకొచ్చేందుకు మహీంద్ర ప్రయత్నాలు మొదలు పెట్టింది.  ఇందులో భాగంగానే ఐదు వాహనాలను ఆగష్టు 15న ఆవిష్కరించింది. 2024లో తొలి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీని, 2026లో మిగిలిన వాహనాలను తీసుకురానున్నట్లు మహీంద్రా కంపెనీ తెలిపింది. భారత్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లోకి వీటిని విడుదల చేయనున్నట్లు ఆనంద్‌ మహీంద్రా వెల్లడించారు.