కొత్తదనం ఎక్కడున్నా ఇట్టే పట్టుకోవడంలో ముందుంటారు మంహీద్రా కంపెనీ అధిపతి ఆనంద్ మహీంద్రా. అందులో భాగంగానే.. రానున్న కాలం అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే హవా అని భావిస్తున్నారు. తన కంపెనీ నుంచి సరికొత్త వాహనాలను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు మహీంద్రా ప్రయత్నిస్తున్నారు. తాజాగా నేషనల్, ఇంటర్నేషనల్ మార్కెట్లకు అనుగుణంగా 5 ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్లను ఎక్స్ యూవీ, బీఈ బ్రాండ్లుగా రూపొందించనున్నట్లు ఆయన చెప్పారు. వీటిలో తొలి ఎలక్ట్రిక్ వాహనాన్ని 2024 చివరి నెలలోగా జనాలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు  వెల్లడించారు. మిగతా నాలుగు వెహికల్స్ ను 2026 వరకు మార్కెట్లోకి విడుదల చేస్తామని చెప్పారు.  


పెట్రో ధరలు రోజు రోజుకు భారీగా పెరగడంతో పాటు పర్యావరణానికి హాని కలుగుతున్న నేపథ్యంలో జనాలు సైతం పర్యావరణహితమైన వాహనాలనే వాడేలా ప్రయత్నిస్తున్నారు. అటు ప్రభుత్వాలు సైతం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి మొగ్గుచూపుతున్నాయి. సమీప భవిష్యత్ లో మార్కెట్ అంతా విద్యుత్ వాహనాలతోనే నిండిపోయే అవకాశం ఉంది. ఆ దిశగానే ఆలోచనలు చేస్తున్న ఆనంద్ మహీంద్రా.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి మొగ్గు చూపుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి ఇదే సరైన సమయంగా ఆయన భావిస్తున్నారు. అందులో భాగంగానే ఐదు ఎలక్ట్రిక్ SUVలను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.


మహీంద్రా కంపెనీలో బీఐఐ భారీగా పెట్టుబడులు: వాస్తవానికి మహీంద్రా కంపెనీ..  తన ఎలక్ట్రిక్ విభాగాన్ని మరింత పటిష్టం చేసేందుకు ప్రణాళికలు చేస్తుంది. ఇందుకోసం విదేశీ కంపెనీలతో కలిసి పని చేసేందుకు సిద్ధం అవుతుంది. మహీంద్రా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఈవీ కోలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ సుముఖంగా ఉందట. తమ కంపెనీలో 250 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ. 1,925 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేందుకు బీఐఐ రెడీగా ఉందని ఆనంద్ మహీంద్రా ఇప్పటికే వెల్లడించారు. ఈ కంపెనీలో మొత్తం బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 7,900 కోట్ల రూపాయలను మహీంద్రా కంపెనీ, బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్ కంపెనీలు సంయుక్తంగా పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ మొత్తాన్ని 2024-27  మధ్యలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు కంపెనీలు కలిసి సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ఇంగ్లో ఫ్లాట్ ఫామ్ మీద మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది 2.25 లక్షల ఎస్ యూ వీలను అమ్మినట్లు తెలిపిన మహీంద్రా కంపెనీ.. 2027 నాటి ఎస్ యూ వీ విభాగంలో 25 శాతం వరకు ఎలక్ట్రిక్ వాహనాలే ఉంటాయని అభిప్రాయపడింది.


మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్ యూ వీలకు ఫోక్స్‌వ్యాగన్‌ సహకారం: మరోవైపు ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీలో మహీంద్రా కంపెనీకి సహకారం అందించేందుకు ఇంటర్నేషనల్ కంపెనీ ఫోక్స్ వ్యాగన్ ముందుకు వచ్చింది. ఇందుకోసం ఓ  ఒప్పందం చేసుకుంది.  మహీంద్రా కంపెనీ, బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్ కంపెనీలు సంయుక్తంగా ఇంగ్లో ఫ్లాట్ ఫామ్ మీద తయారు చేసే ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన మాడ్యులర్‌ ఎలక్ట్రిక్‌ డ్రైవ్‌ మ్యాట్రిక్స్‌(ఎంఈబీ) ఎలక్ట్రిక్ ఎక్యుప్ మెంట్స్ ను ఫోక్స్ వ్యాగన్ అందించనుంది. ప్రధానంగా 2026 వరకు మార్కెట్లోకి రానున్న 5 ఎలక్ట్రిక్ SUVలకు ఈ కంపెనీ ఎంఈబీ ఎక్యుప్ మెంట్స్ ను సమకూర్చనుంది. 


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?