Rakesh Jhunjhunwala portfolio: భారత స్టాక్‌ మార్కెట్‌ దిగ్గజం రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా మరణించి రెండు రోజులు గడిచింది. ఆయన వెళ్లిపోయాక తొలిసారిగా మంగళవారం మార్కెట్లు తెరుచుకున్నాయి. దాంతో ఆయన పెట్టుబడి పెట్టిన షేర్ల పనితీరు ఎలా ఉందో తెలుసుకొనేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.


ఆప్టెక్‌ కంపెనీలో ఝున్‌ఝున్‌వాలాకు 23 శాతం వాటా ఉంది. మంగళవారం ఈ షేరు ధర 5 శాతం వరకు పతనమైంది. ఇక స్టార్‌ హెల్త్‌ 1 శాతం, మెట్రో బ్రాండ్స్‌ 0.5 శాతం మేర నష్టపోయాయి. క్రిసిల్‌ సైతం స్వల్ప నష్టాల్లో కొనసాగుతోంది. మరికొన్ని షేర్లు మాత్రం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. నజారా 3 శాతం, టైటాన్, ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌, ఎన్‌సీసీ ఒక శాతానికి పైగా లాభపడ్డాయి.


ఇండియన్‌ వారెన్‌ బఫెట్‌.. రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా ఆగస్టు 14న కన్ను మూసిన సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా ఆయన హృదయం, మూత్రపిండాల వ్యాధులు, మధుమేహంతో బాధపడ్డారు. కాగా ఆయన కొనుగోలు చేసిన చాలా కంపెనీల షేర్లు మల్టీ బ్యాగర్‌ రిటర్నులు ఇవ్వడం గమనార్హం. కేవలం టైటాన్‌లోనే ఆయనకు రూ.11,000 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. స్టార్‌ హెల్త్‌, మెట్రో బ్రాండ్స్‌లో రూ.10,000 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. ఆయన పోర్టు పోలియోలోని 32 కంపెనీల స్టాక్స్‌ విలువే రూ.32,000 కోట్లు ఉంటుంది.


'రాకేశ్‌ పెట్టుబడి పెట్టే విధానం 1990-2020 మధ్యే మారింది. 2003 మాత్రం అతడి దశ తిరిగింది. టైటాన్‌, క్రిసిల్‌, లుపిన్‌ 100 బ్యాగర్లుగా మారాయి' అని ఝున్‌ఝున్‌వాలా సన్నిహితుడు రాకేశ్ దమానీ అన్నారు.


స్టాక్‌ మార్కెట్లో నమోదవ్వని కంపెనీల్లోనూ రాకేశ్‌ కుటుంబానికి వాటాలు ఉన్నాయి. ఈ మధ్యే మొదలైన ఆకాశ ఎయిర్‌లో వారి కుటుంబానికి ట్రస్టుల రూపంలో 45 శాతం వాటా ఉంది. స్టార్‌ హెల్త్‌, మెట్రో బ్రాండ్స్‌, నజారా టెక్నాలజీస్‌ వంటి కంపెనీల్లో మార్కెట్లోకి రాకముందే వాటాలు ఉండటం గమనార్హం.


షేర్‌ మార్కెట్‌తో పోలిస్తే నమోదవ్వని కంపెనీల పోర్టుపోలియో ద్వారానే తాను ఎక్కువ డబ్బు ఆర్జించానని గతంలో ఝున్‌ఝున్‌వాలా పేర్కొన్నారు. కొన్నింట్లో 10-12 ఏళ్లుగా తనకు వాటాలు ఉన్నాయని 2001, మార్చిలో వెల్లడించారు.




Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.