స్వాతంత్య్ర దినోత్సవ వేళ రాజ్‌భవన్‌లో ఏటా తేనీటి విందు (At Home In AP) కార్యక్రమాన్ని ఎట్ హోం పేరుతో నిర్వహించే సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు, అధికార విపక్షాలకు చెందిన నేతలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరవుతుంటారు. అయితే, సోమవారం సాయంత్రం ఆగస్టు 15 సందర్భంగా ఏపీ రాజ్ భవన్ లో జరిగిన ఎట్ హోం మాత్రం ప్రత్యేకత సంతరించుకుంది. ఈ ఎట్ హోంకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. 


చంద్రబాబు కూడా
ఇదే ఎట్ హోం కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా హాజరయ్యారు. రాజకీయంగా చిరకాల వైరం ఉన్న ఈ ప్రత్యర్థులు ఇలా ఒకే కార్యక్రమానికి ఒకే సమయంలో హాజరు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎం జగన్, చంద్రబాబు ఇలా ఒకే కార్యక్రమంలో పాల్గొనడం ఇదే మొదటి సారి. ఈ సందర్భంగా కనీసం మర్యాదపూర్వకంగా అయినా, ఇద్దరు నేతలు మాట్లాడుకుంటారని, లేదంటే ఎదురుపడ్డప్పుడు ముఖంలో చిరునవ్వు నవ్వుకుంటారని అంతా భావించారు. కానీ ఇరువురు నేతలు ఒకే కార్యక్రమంలో ఉన్నా వారు కలిసే సందర్భం తెచ్చుకోలేదు. ఇద్దరు వారి సీట్లకే పరిమితం అయ్యారు.


రాజ్ భవన్ లో సాయంత్రం 5.30 నుంచి 6.30 వరకూ ఎట్ హోం కార్యక్రమం జరగ్గా, అప్పటికే చంద్రబాబు, టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కేశినేని నాని, ఎమ్మెల్సీ అశోక్ బాబు, గద్దె రామ్మోహన్ తో కలిసి వేదిక వద్ద కూర్చున్నారు. జాతీయ గీతాలాపన తర్వాత గవర్నర్ స్వయంగా చంద్రబాబు వద్దకు వచ్చి పలకరించారు. చంద్రబాబు టీడీపీ నేతలను పరిచయం చేశారు. ఆ తర్వాత గవర్నర్ దంపతులు సీఎం జగన్ దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రతో కలిసి తేనీటి విందులో పాల్గొన్నారు. ఆ తర్వాత కూడా చంద్రబాబు, జగన్ ఆ కార్యక్రమానికి వచ్చిన ఇతరులను కలయ తిరుగుతూ పలకరించకుండా తమ సీట్ల పైనే ఉండిపోయారు.


వెళ్లేటప్పుడు ఇలా..
ఎట్ హోం కార్యక్రమం ముగిశాక సీఎం బయలుదేరుతున్నారనే సమాచారంతో, చంద్రబాబు కొన్ని నిమిషాల పాటు వేచి ఉన్నారు. సీఎం కాన్వాయ్ కు సంబంధించి ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత అప్పుడు చంద్రబాబు తన వాహనంలో వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా సహా పలువురు మంత్రులు, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు.


తెలంగాణలో సీఎం గైర్హాజరు


తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించగా, ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, మంత్రులు పాల్గొంటారని ముందు సమాచారం వచ్చింది. అయితే ఆఖరి నిమిషంలో సీఎం కేసీఆర్ ప్రోగ్రామ్ రద్దు చేసుకున్నారు. ఎట్ హోం కార్యక్రమానికి సీఎం కేసీఆర్  హాజరవుతారని రాజ్ భవన్ వర్గాలకు సీఎంవో నుంచి ముందుగా సమాచారం వచ్చింది. కానీ సీఎం కేసీఆర్ ఎట్ హోమ్ కు గౌర్హాజరు అయ్యారు. సీఎం వెళ్లకపోవడంతో మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు కూడా హాజరుకాలేదు.