Mahindra New Platform Freedom NU: మహీంద్రా & మహీంద్రా, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతోంది, వివిధ సెగ్మెంట్‌ల కోసం సరికొత్త కార్లను తయారు చేస్తోంది. ఇప్పుడు, ఈ కంపెనీ ఒక సంచలన విషయాన్ని వెల్లడించింది. మహీంద్రా బ్రాండ్‌తో భవిష్యత్‌లో తయారయ్యే మోడళ్ల కోసం కొత్త ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించనుంది. 15 ఆగస్టు 2025న, భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, ముంబైలో తన కొత్త ప్లాట్‌ఫామ్‌పై తెర తీస్తుంది. ఈ కార్యక్రమానికి ముందు, ఈ కొత్త ఫ్లాట్‌ఫామ్‌ గురించి ఊరిస్తూ ఒక చిన్నపాటి టీజర్‌ను విడుదల చేసింది. 

Continues below advertisement


కొత్త ప్లాట్‌ఫామ్‌ Freedom NU
మహీంద్రా విడుదల చేసిన తాజా టీజర్‌ను బట్టి చూస్తే, కొత్త ప్లాట్‌ఫామ్‌ను Freedom NU అని పిలుస్తారు. ప్రస్తుతం, NFA (న్యూ ఫ్లెక్సిబుల్ ఆర్కిటెక్చర్) అనే ప్లాట్‌ఫామ్‌పై మహీంద్ర కార్లు తయారవుతున్నాయి.


ICE (Internal Combustion Engine) వాహనాల తయారీని చేపట్టే మహీంద్రా ఆటోమోటివ్ అధికారిక హ్యాండిల్ ద్వారా ఈ టీజర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్లిప్‌లో, మహీంద్రా ఎలక్ట్రిక్ ఆరిజిన్ SUV లోగో & హ్యాష్‌ట్యాగ్‌లు ఉన్నాయి. "ICE & ఎలక్ట్రిక్ వాహనాలు రెండింటినీ మరింత బలమైన మోడళ్లుగా అభివృద్ధి చేసేందుకు ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకుంటాం" అని వెల్లడించడానికి ఇది ఒక సిగ్నల్‌ కావచ్చు.


భవిష్యత్‌ కార్లన్నింటికీ ఇదే ఫ్లాట్‌ఫామ్‌! 
ఈ టీజర్‌ విడుదల తర్వాత ఆటోమొబైల్‌ మార్కెట్‌లో విభిన్న ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. కొత్త ప్లాట్‌ఫామ్, మహీంద్రా బ్రాండ్‌ నుంచి భవిష్యత్‌లో రాబోయే వివిధ వెర్షన్‌లకు (పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్ & ఆల్-ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్స్‌) సపోర్ట్‌ చేయగలదు. ఈ బండ్లను చకన్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న కఠినమైన పోటీని తట్టుకుంటూ, మహీంద్రా బ్రాండ్‌ను ఫ్యూచర్‌-రెడీగా ఉంచేలా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఈ కార్ల కర్మాగారాన్ని అప్‌గ్రేడ్ చేస్తున్నారు.


మహీంద్రా నుంచి రాబోతున్న కొత్త Bolero వెర్షన్‌ ప్రస్తుతం పరీక్షల దశలో ఉంది. ఈ వెహికల్‌ను NFA లేదా Freedom NU ప్లాట్‌ఫారమ్‌పై తయారు చేశారని భావిస్తున్నారు. ఇంకా, Thar Sports కూడా ఈ ఫ్లాట్‌ఫామ్‌పై అరంగేట్రం చేయనుందని అంటున్నారు. అయితే, కంపెనీ ఈ రెండు పేర్లను ధృవీకరించలేదు.


అంతేకాదు, హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లను మహీంద్రా అభివృద్ధి చేస్తోందన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అయితే.. చిన్న బ్యాటరీలు & కనీస విద్యుత్ శ్రేణితో ఉండే సెల్ఫ్-ఛార్జింగ్ (బలమైన హైబ్రిడ్) మోడళ్ల కంటే, డ్రైవింగ్‌ రేంజ్‌ను పెంచే  PHEVలపై మహీంద్రా దృష్టి పెట్టిందని అంచనా.


ఏళ్ల నాటి సాంప్రదాయం
మహీంద్ర & మహీంద్రా, సాధారణంగా, భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఏదోక కొత్త కబురు చెప్పడం సాంప్రదాయంగా పెట్టుకుంది. చాలా సంవత్సరాలుగా, ఆగస్టు 15న వివిధ కొత్త కార్లు & కాన్సెప్టులను ప్రదర్శించింది. ఈ సంవత్సరం కూడా ఆ ఆనవాయితీని కొనసాగిస్తోంది. ఈసారి, కొత్త వాహనాలు & కొత్త ఆలోచనలను పరిచయం చేయడానికి బదులుగా కొత్త ప్లాట్‌ఫారమ్‌ను హైలైట్ చేస్తోంది.