Mahindra BE 07 UIpdate: మహీంద్రా నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ SUV రాబోతోంది. BE 07 పేరుతో ఈ కారు మార్కెట్లోకి రానుంది. తాజాగా ఈ కారుకు సంబంధించిన కొత్త స్పై ఫోటోలు బయటకు వచ్చాయి. వీటిలో కారు ఇంటీరియర్ తొలిసారి స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా డ్యాష్‌బోర్డ్‌పై మూడు పెద్ద స్క్రీన్లు కనిపించడం ఆసక్తికరంగా మారింది.
మహీంద్రా BE 07ను 2027లో మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఇది BE 07 కాన్సెప్ట్ ఆధారంగా రూపొందుతున్న ప్రొడక్ట్ మోడల్. మహీంద్రా BE బ్రాండ్‌లో ఇది రెండో మోడల్‌గా రానుంది. ప్రస్తుతం BE 6 ఈ విభాగంలో ఉంది. BE 6 కంటే పై స్థాయిలో BE 07 ఉంటుంది.
మూడు స్క్రీన్లతో ఇంటీరియర్
తాజా స్పై ఫోటోలను చూస్తే BE 07 ఇంటీరియర్‌లో మూడు పెద్ద డిస్‌ప్లేలు కనిపిస్తున్నాయి. ఇవి డ్యాష్‌బోర్డ్ మొత్తానికి అమర్చినట్లు అర్ధమవుతోంది. మహీంద్రా ఇప్పటికే XEV 9e & XEV 9S మోడళ్లలో ఇలాంటి మూడు స్క్రీన్ల సెటప్‌ను అందిస్తోంది.
BE 6లో కూడా త్వరలో వచ్చే అప్‌డేట్‌లో మూడు స్క్రీన్ల లేఅవుట్ వచ్చే అవకాశం ఉంది. అదే డిజైన్ విధానాన్ని BE 07లోనూ కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: Ducati Monster V2 vs Triumph Street Triple 765 RS - 111hp vs 130hp.. ధర, పవర్, టార్క్‌లో ఏది బెస్ట్?
డ్యాష్‌క్యామ్ కూడా ఉంటుందా?
BE 07 స్పై ఫోటోల్లో విండ్‌స్క్రీన్ దగ్గర చిన్న డిస్‌ప్లే కనిపించింది. ఇది డ్యాష్‌క్యామ్‌కు సంబంధించిన స్క్రీన్‌గా కనిపిస్తోంది. అయితే ఉత్పత్తి మోడల్‌లో కూడా ఇదే విధంగా ఉంటుందా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు.
ప్రస్తుతం BE 6, XEV 9e & XEV 9S కార్లలో 360 డిగ్రీల కెమెరా ఆధారిత డ్యాష్‌క్యామ్ ఫీచర్ ఉంది. అత్యవసర పరిస్థితుల్లో వీడియోలను రికార్డు చేసి సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే సాధారణ డ్యాష్‌క్యామ్‌ల మాదిరిగా నిరంతరం వీడియో రికార్డు చేయాలంటే USB స్టోరేజ్ పరికరం అవసరం.
ఇంకా ఏ ఫీచర్లు?
BE 07లో రెండు స్పోక్‌ల స్టీరింగ్ వీల్ వచ్చే అవకాశం ఉంది. దీనిపై మహీంద్రా కొత్త ‘బటర్‌ఫ్లై’ లోగో ఉండొచ్చు. ఈ లోగోను సంస్థ తన ఎలక్ట్రిక్ కార్లలో ప్రత్యేకంగా ఉపయోగిస్తోంది.
క్యాబిన్‌లో యాంబియంట్ లైటింగ్ కూడా ఉండే అవకాశం ఉంది. ఐదుగురు ప్రయాణించేలా సీటింగ్ ఇచ్చారు. ప్రస్తుతం కనిపించిన ప్రోటోటైప్‌ను బట్టి చూస్తే, మోడ్రన్ టెక్నాలజీ ప్రతిబింబించే ఇంటీరియర్‌ను మహీంద్రా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
బ్యాటరీ & రేంజ్ ఎలా ఉంటుంది?
BE 07ను మహీంద్రా INGLO ప్లాట్‌ఫామ్‌పై నిర్మిస్తోంది. BE 6లో ఉపయోగిస్తున్న 59kWh & 79kWh బ్యాటరీ ప్యాక్‌లనే ఇందులోనూ ఉపయోగించే అవకాశం ఉంది. అయితే.. BE 07 పరిమాణంలో BE 6 కంటే పెద్దది. అందువల్ల దీని రేంజ్ BE 6 కంటే కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం BE 6ను ఫుల్‌గా ఛార్జ్ చేస్తే, MIDC పరీక్షల ప్రకారం, 548 కిలోమీటర్ల నుంచి 683 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
ఎవరికి పోటీ?
మహీంద్రా BE 07 మార్కెట్లోకి వచ్చిన తర్వాత చాలా ఎలక్ట్రిక్ SUVలకు పోటీ ఇవ్వనుంది. ముఖ్యంగా Tata Harrier EV, VinFast VF7 & BYD Atto తో గట్టిగా పోటీ పడే అవకాశం ఉంది.
ప్రస్తుతం బయటకు వచ్చిన స్పై ఫోటోలు ప్రోటోటైప్‌కు సంబంధించినవి, తుది మోడల్‌లో కొన్ని మార్పులు ఉండొచ్చు. మూడు స్క్రీన్ల సెటప్‌ను అలాగే ఉంచితే మాత్రం BE 07లో ఇదే ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
