Ducati Monster V2 vs Triumph Street Triple 765 RS: ప్రీమియం బైక్‌ల మార్కెట్‌లోకి డుకాటి మాన్‌స్టర్ V2 కొత్త లుక్‌తో అడుగుపెట్టింది. ఈసారి కంపెనీ చాలా కీలక మార్పులు చేసింది. ఇంజిన్ సామర్థ్యాన్ని తగ్గించింది. కొత్త 890cc V-ట్విన్ ఇంజిన్‌ను తీసుకొచ్చింది. కొత్త మోనోకాక్ ఛాసిస్‌ను కూడా అందించింది. బైక్ బరువును 4 కిలోలు తగ్గింది. దీని ప్రారంభ ధర రూ.13.99 లక్షలు. ఇదే ధరల పరిధిలోని ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ 765 RSకు మంచి డిమాండ్ ఉంది. దీని ప్రారంభ ధర రూ.12.92 లక్షలు.
ఇంజిన్ కంపారిజన్
Ducati Monster V2లో 890cc, V-ట్విన్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 9,000 ఆర్‌పీఎమ్ వద్ద 111hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7,250 ఆర్‌పీఎమ్ వద్ద 91.1Nm టార్క్ అందిస్తుంది. ఇందులో 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది.
Triumph Street Triple 765 RSలో 765cc, 3-సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 12,000 ఆర్‌పీఎమ్ వద్ద 130hp పవర్ ఇస్తుంది. 9,500 ఆర్‌పీఎమ్ వద్ద 80Nm టార్క్ అందిస్తుంది. ఇందులోనూ 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది.
పవర్ విషయంలో Triumph స్పష్టంగా ముందుంది. Monster V2 కంటే 19hp అధిక పవర్ ఆఫర్ చేస్తుంది. అయితే టార్క్ విషయంలో Ducati ముందుంది. Monster V2లో 91.1Nm టార్క్ ఉండగా, Street Triple RSలో 80Nm మాత్రమే ఉంది. Triumphలో పవర్ & టార్క్ రెండూ ఎక్కువ ఆర్‌పీఎమ్ వద్ద అందుబాటులోకి వస్తాయి.
ఇది కూడా చదవండి: డ్యూక్ నుంచి RC వరకు ధరల బాదుడు.. KTM బైక్ కొంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ చెల్లించాల్సిందే
బరువు & సీటు ఎత్తు
90 శాతం ఇంధనం నింపిన తర్వాత Monster V2 బరువు సుమారు 185.3 కిలోలకు చేరుతుంది. Triumph బరువు ఇంధనంతో కలిపి 188 కిలోలు. అందువల్ల, ఈ రెండు బైకులకు బరువులో పెద్ద తేడా లేదు.
Monster V2 సీటు ఎత్తు 815 మిల్లీమీటర్లు. తక్కువ ఎత్తు సీటు కావాలనుకునేవారికి 795 మిల్లీమీటర్లు & 775 మిల్లీమీటర్ల ఎంపికలు ఉన్నాయి. Street Triple RS సీటు ఎత్తు 836 మిల్లీమీటర్లు. దీనికి 808 మిల్లీమీటర్లు & 798 మిల్లీమీటర్ల తక్కువ ఎత్తు సీట్లు అందుబాటులో ఉన్నాయి.
బ్రేకులు & సస్పెన్షన్
రెండు బైకుల్లోనూ ఒకే సైజ్ టైర్లు ఉన్నాయి. ముందు 120/80 R17, వెనుక 180/55 R17 టైర్లు ఉంటాయి. Monster V2లో ముందు 320mm డిస్క్, వెనుక 245mm డిస్క్ ఉన్నాయి. Street Triple RSలో ముందు 310mm, వెనుక 220mm డిస్క్‌లు ఉంటాయి.
రెండు బైకుల్లోనూ కార్నరింగ్ సెన్సిటివ్ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఉంటుంది. Monster V2లో 43mm అప్‌సైడ్ డౌన్ ఫోర్క్ ఉంది. Street Triple RSలో 41mm ఫోర్క్ ఉంటుంది. అయితే సస్పెన్షన్ సర్దుబాట్ల విషయంలో Triumph ముందుంది.
Monster V2లో వెనుక సస్పెన్షన్‌కు ప్రీలోడ్ సర్దుబాటు మాత్రమే ఉంటుంది. Triumphలో ముందు & వెనుక సస్పెన్షన్‌కు ప్రీలోడ్, రీబౌండ్, కంప్రెషన్ సర్దుబాట్లు ఉన్నాయి. Monster V2లో సస్పెన్షన్ లాంగర్ ట్రావెల్ ఉంటుంది. దీంతో రోజువారీ రోడ్లపై సౌకర్యవంతమైన ప్రయాణానికి Ducati అనుకూలంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి: పల్సర్ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్ యూత్‌ఫుల్ బైక్!
ఫీచర్లు
రెండు బైకుల్లోనూ ఈ విభాగంలో ఆశించే ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. అయితే Ducati కొన్ని అదనపు ఫీచర్లను ప్రామాణికంగా అందిస్తోంది. వీలీ కంట్రోల్ & రెండు దిశల్లో పనిచేసే క్విక్‌షిఫ్టర్ ఇందులో ఉన్నాయి. క్రూయిజ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ వంటి ఫీచర్లను అదనపు పరికరాలుగా పొందవచ్చు.
ధరలో భారీ తేడా
Ducati Monster V2 ధర రూ.13.99 లక్షల నుంచి రూ.14.45 లక్షల వరకు ఉంది. పాత మోడల్‌తో పోలిస్తే ప్రారంభ ధర రూ.15,000 పెరిగింది. Triumph Street Triple 765 RS ధర రూ.12.92 లక్షలు. అంటే Monster V2 కంటే Triumph సుమారు రూ.1.07 లక్షలు చౌక.
ధరను పరిగణనలోకి తీసుకుంటే Triumphకు స్పష్టమైన ఆధిక్యం ఉంది. ప్రత్యేకమైన డిజైన్ & రోజువారీ వినియోగానికి అనుకూలమైన సెటప్ కోరుకునేవారికి మాత్రం Monster V2 ఒక ఆసక్తికరమైన ఎంపిక.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
