Driving Licence Application: మోటారు వాహనాల చట్టం ప్రకారం, ఒక వ్యక్తి ఎలాంటి వాహనం నడపాలన్నా తప్పనిసరిగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. కానీ అది ఒక్క రోజులో వచ్చే విషయం కాదు. లైసెన్స్‌ పొందాలంటే ముందుగా లెర్నింగ్‌ లైసెన్స్‌ (LLR) తీసుకోవాలి. దానిని పొందిన తర్వాత పర్మినెంట్‌ లైసెన్స్‌ కోసం అప్లై చేయాలి. అయితే ఈ మొత్తం ప్రాసెస్‌ ఎలా ఉంటుంది? ఏయే దశల్లో ఏం చేయాలి? అనే విషయాలను క్లియర్‌గా తెలుసుకుందాం.

1. లెర్నర్స్ లైసెన్స్‌ ఎలా తీసుకోవాలి?

అర్హతలు:

  • వయసు 18 ఏళ్లు పైబడి ఉండాలి (గేర్‌ వాహనాల కోసం)
  • 16 ఏళ్లు నిండిన వారు నాన్‌-గేర్‌ వాహనాల కోసం అప్లై చేయొచ్చు
  • ఆధార్‌, చిరునామా, ఫోటో ఉండాలి
  • అవసరమైన డాక్యుమెంట్లు:
  • ఆధార్‌ కార్డ్‌ (వ్యక్తిగత గుర్తింపు + చిరునామా రుజువు కోసం‌)
  • పాస్‌పోర్ట్‌ సైజు ఫోటో
  • ఫారమ్‌ 1A (40 ఏళ్లు పైబడి ఉంటే మెడికల్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి)

ప్రాసెస్‌:

  • లెర్నర్స్ లైసెన్స్‌ తీసుకోవడానికి ముందుగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
  • https://parivahan.gov.in/ వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
  • “Apply for Learner’s Licence” బటన్‌పై క్లిక్‌ చేయాలి.
  • రీజియన్‌ (AP లేదా TS) ఎంచుకుని, ఫారమ్‌ 2 నింపాలి.
  • డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేసి, ఫీజు చెల్లించాలి (సుమారు ₹150–₹200 ఉంటుంది).
  • ఆన్‌లైన్‌ థియరీ టెస్ట్‌ స్లాట్‌ బుక్‌ చేయాలి.
  • RTO కార్యాలయంలో జరిగే కంప్యూటర్‌ ఆధారిత థియరీ టెస్ట్‌ రాయాలి.
  • ఆన్‌లైన్‌ థియరీ టెస్ట్‌లో ఉత్తీర్ణులు అయితే లెర్నర్స్ లైసెన్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు లేదా ప్రింట్‌ తీసుకోవచ్చు.

2. పర్మినెంట్‌ లైసెన్స్‌ కోసం ఎప్పుడు, ఎలా అప్లై చేయాలి?

లెర్నింగ్‌ లైసెన్స్‌ తీసుకున్న తర్వాత, కనీసం 30 రోజులు గడిపిన తర్వాత మాత్రమే పర్మినెంట్‌ లైసెన్స్‌ కోసం అప్లై చేయొచ్చు. గరిష్ఠంగా 180 రోజుల్లోగా (6 నెలల లోపు) అప్లై చేయాలి.

అవసరమైన డాక్యుమెంట్లు:

  • లెర్నర్స్ లైసెన్స్‌ కాపీ
  • ఆధార్‌ కార్డ్‌ లేదా ఇతర గుర్తింపు రుజువు
  • డ్రైవింగ్‌ టెస్ట్‌ కోసం వాహన వివరాలు (RC, ఇన్సూరెన్స్‌)
  • ఫోటో, సంతకం

అప్లికేషన్‌ ప్రాసెస్‌:

  • మళ్లీ https://parivahan.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
  • “Apply for Driving Licence” ఆప్షన్‌ సెలెక్ట్‌ చేయాలి.
  • అవసరమైన వివరాలు నింపిన తర్వాత, డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేయాలి.
  • డ్రైవింగ్‌ టెస్ట్‌ కోసం డేట్‌ & టైమ్‌ బుక్‌ చేయాలి.
  • ఫీజు చెల్లించాలి (సుమారు ₹700–₹800 వరకు ఉంటుంది).
  • డ్రైవింగ్‌ టెస్ట్‌ రోజున RTO కార్యాలయం వద్దకు మీ వాహనంతో పాటు హాజరుకావాలి.
  • టూవీలర్‌ లైసెన్స్‌ కోసం అప్లై చేసిన వాళ్లు కచ్చితంగా హెల్మెట్‌తోనే వెళ్లాలి.

3. డ్రైవింగ్‌ టెస్ట్‌లో ఏముంటుంది?

  • ఫోర్‌ వీలర్‌/టూ వీలర్‌ కోసం ప్రత్యేకంగా ట్రాక్‌ ఉంటుంది.
  • ట్రాఫిక్‌ గుర్తులపై ప్రశ్నలు అడగొచ్చు.
  • మీరు వాహనం నడిపే సమయంలో క్లచ్‌, బ్రేక్‌, మిర్రర్‌, ఇండికేటర్స్‌ను ఎలా వాడుతున్నారో పరిశీలిస్తారు.
  • యూ టర్న్‌, ఆఫ్‌స్టాకిల్‌, 8 వంటి ఆకారాల్లో డ్రైవింగ్‌/ రైడింగ్‌ చేయాల్సి ఉంటుంది.
  • ఈ పరీక్షలో ఉత్తీర్ణులైతే, కొన్ని రోజులలోనే మీ పర్మినెంట్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ పోస్ట్‌ ద్వారా మీ ఇంటికే వస్తుంది లేదా డిజిటల్‌గా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

సాధారణంగా, చాలామంది, టూవీలర్‌ కమ్‌ లైట్‌ వెయిట్‌ మోటార్‌ వెహికల్‌ (LMV) డ్రైవింగ్‌ లైసెన్స్‌ను తీసుకుంటారు. అంటే, బైక్‌, స్కూటర్‌తో పాటు కారు, జీపు వంటి చిన్న వాహనాలు నడపడానికి ఈ లెసెన్స్‌ పనికొస్తుంది. లారీలు, బస్సులు వంటివి హెవీ వెయిట్‌ మోటార్‌ వెహికల్స్‌ (HMV) కిందకు వస్తాయి.

4. ముఖ్యమైన సూచనలు

  • ఫారాన్ని తప్పులు లేకుండా నింపాలి. తప్పులు నింపితే తిరస్కారానికి గురయ్యే అవకాశం ఉంటుంది.
  • అన్ని డాక్యుమెంట్లను క్లియర్‌గా స్కాన్‌ చేసి అప్‌లోడ్‌ చేయాలి.
  • డ్రైవింగ్‌ టెస్ట్‌ కంటే ముందే మీరు మీ వాహనాన్ని నడిపి అనుభవం సంపాదించడం మంచిది.
  • వెబ్‌సైట్‌ ద్వారా అప్లికేషన్‌ స్టేటస్‌ ట్రాక్‌ చేయవచ్చు.

ఇప్పుడు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకునే ప్రక్రియ పూర్తి డిజిటల్‌ అయింది. కేవలం సరైన సమాచారం, అవసరమైన డాక్యుమెంట్లు, & కాస్త ముందు ప్రిపరేషన్‌తో మీరు కూడా తేలిగ్గా లైసెన్స్‌ పొందొచ్చు. మీరు సిద్ధంగా ఉంటే, వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లై చేయండి, లైసెన్స్‌ వచ్చాక రోడ్డుపై లీగల్‌గా బండి నడపండి!.