KTM 390 Adventure price and variants: అడ్వెంచర్ బైక్ కొనాలని ఉవ్విళ్లూరే యూత్‌ కోసం KTM ఇప్పుడు మరిన్ని ఆప్షన్లు అందిస్తోంది. ఇటీవల 350cc ఇంజిన్‌తో కొత్త KTM 390 అడ్వెంచర్‌ను లాంచ్‌ చేయడంతో, ప్రస్తుతం మన మార్కెట్లో మొత్తం నాలుగు 390 అడ్వెంచర్ వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి. స్టాండర్డ్‌, X, R & S పేర్లతో అందుబాటులో ఉన్న ఈ మోడళ్ల మధ్య ధరలతో పాటు ఫీచర్లు, ఇంజిన్‌, సస్పెన్షన్‌, వీల్స్‌లో కూడా తేడాలు ఉన్నాయి. దీంతో ఏ వేరియంట్ ఎంచుకోవాలనే విషయంలో చాలా మందికి సందిగ్ధత ఏర్పడుతోంది.

Continues below advertisement

ఈ నాలుగు మోడళ్లలో బాడీ డిజైన్‌, ప్రధాన ఫ్రేమ్‌, సబ్‌ఫ్రేమ్‌, స్టైలింగ్ దాదాపు ఒకేలా ఉంటాయి. రంగులు & గ్రాఫిక్స్ మాత్రమే మారతాయి. అయితే ఇంజిన్‌, సస్పెన్షన్‌, వీల్స్ & రైడింగ్ సామర్థ్యం పరంగా ఒక్కో వేరియంట్ ప్రత్యేకతను కలిగి ఉంది.

స్టాండర్డ్ వేరియంట్ఎంట్రీ లెవల్ స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.2.87 లక్షలు (ఎక్స్ షోరూమ్‌). ఈ మోడల్‌లో 349cc ఇంజిన్‌ను అందించారు. ఇది గరిష్ఠంగా 41.5hp పవర్‌, 33.5Nm టార్క్‌ను ఇస్తుంది. ముందు భాగంలో 200 mm & వెనుక భాగంలో 205 mm సస్పెన్షన్ ట్రావెల్ లభిస్తుంది. వెనుక సస్పెన్షన్‌లో మాత్రమే ప్రీలోడ్ అడ్జస్ట్ చేసే అవకాశం ఉంటుంది. 19 అంగుళాల ముందు అల్లాయ్ వీల్‌, 17 అంగుళాల వెనుక అల్లాయ్ వీల్‌, TFT డిస్‌ప్లే & ఆధునిక ఎలక్ట్రానిక్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ మోడల్‌పై 18 శాతం GST మాత్రమే వర్తించడంతో దీని ధర ఇతర వేరియంట్ల కంటే తక్కువగా ఉంది.

Continues below advertisement

ఇది కూడా చదవండి: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి

KTM 390 అడ్వెంచర్ XKTM 390 అడ్వెంచర్ X ధర రూ.3.50 లక్షలు. ఇందులో పూర్తి స్థాయి 398cc ఇంజిన్‌ను అందించారు. ఇది 46hp పవర్‌, 39Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్టాండర్డ్ వేరియంట్‌తో పోలిస్తే డిజైన్‌, చాసిస్‌, ఫీచర్లు దాదాపు ఒకేలా ఉంటాయి. పెయింట్ స్కీమ్‌లో మాత్రమే స్వల్ప మార్పులు ఉన్నాయి. అయితే స్టాండర్డ్ వేరియంట్ కంటే రూ.63 వేలు ఎక్కువ ధర ఉండటం గమనార్హం.

KTM 390 అడ్వెంచర్ Rఆఫ్ రోడ్ ప్రయాణాలను ఎక్కువగా ఇష్టపడేవాళ్ల కోసం KTM 390 అడ్వెంచర్ R వచ్చింది. దీని ధర రూ.3.86 లక్షలు. ముందు & వెనుక భాగంలో 230 mm లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్‌ అందించారు. దీంతో రఫ్ రోడ్లపై కూడా మెరుగైన పనితీరు లభిస్తుంది. 880 mm సీట్ ఎత్తు & 272 mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో ఇది అత్యంత ఎత్తైన వేరియంట్‌గా నిలుస్తుంది. 21 అంగుళాల ముందు & 18 అంగుళాల వెనుక ట్యూబ్డ్ వైర్ స్పోక్ వీల్స్‌తో పాటు Mitas డ్యూయల్ పర్పస్ టైర్లను ఈ వేరియంట్‌లో అమర్చారు. X వేరియంట్‌ కంటే దీని ధర రూ.36 వేలు ఎక్కువ.

ఇది కూడా చదవండి: రేస్‌ బైక్‌ తరహాలో Yamaha R15 V4, MT-15 MotoGP ఎడిషన్లు లాంచ్‌ - FZ-S సిరీస్‌కు కొత్త రంగులు

KTM 390 అడ్వెంచర్ Sటాప్ ఎండ్ KTM 390 అడ్వెంచర్ S ధర రూ.4.05 లక్షలు. ఇటీవల ధర పెరగడంతో ఈ మోడల్ రూ.4 లక్షల మార్క్‌ను దాటింది. గతంలో దీని ధర రూ.3.97 లక్షలు ఉండేది. ఇందులో అడ్జస్టబుల్ సస్పెన్షన్‌ అందించారు. ముందు భాగంలో 200 mm & వెనుక భాగంలో 205 mm సస్పెన్షన్ ట్రావెల్ ఉంటుంది. 21 అంగుళాల ముందు & 17 అంగుళాల వెనుక వైర్ స్పోక్ వీల్స్ ఉన్నప్పటికీ, వీటిలో ట్యూబ్‌లెస్ టైర్లను ఉపయోగించే అవకాశం ఉంది. 830 mm సీట్ ఎత్తు & 237 mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో తారు & సీసీ రోడ్లపై ప్రయాణానికి అనువుగా ఉంటుంది.

ఆఫ్ రోడ్ ప్రయాణాలే ప్రధాన అవసరమైతే R వేరియంట్ సరైన ఎంపిక కావచ్చు. సిటీలో తిరగడం & హైవే ప్రయాణాలకు S మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో అడ్వెంచర్ బైక్ కావాలనుకునేవాళ్లు స్టాండర్డ్ వేరియంట్‌ను ఎంచుకోవచ్చు. పూర్తి 398cc ఇంజిన్ ఉండి, అదనపు ఆఫ్ రోడ్ ఫీచర్లు అవసరం లేనివాళ్లకు X వేరియంట్ సరిపోతుంది. ఇలా.. ఒక్కో వేరియంట్‌ను ఒక్కో రకం రైడర్ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని KTM రూపొందించింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.