Yamaha MotoGP Edition launched: యమహా, తన పాపులర్ స్పోర్ట్స్ బైకులైన R15 V4 & MT-15 కు కొత్త MotoGP ఎడిషన్‌ను లాంచ్ చేసింది. యూజర్ల నుంచి వచ్చిన స్పందనను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రత్యేక ఎడిషన్‌ను మళ్లీ తీసుకొచ్చినట్లు ఈ కంపెనీ తెలిపింది. అంతేకాదు... FZ-S Fi Hybrid & FZ-S Fi మోడళ్లకు కూడా కొత్త రంగులను పరిచయం చేసింది. అయినప్పటికీ ఈ రెండు మోడళ్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు.
కొత్త Yamaha R15 V4 MotoGP ఎడిషన్ ధర రూ.1.76 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. స్టాండర్డ్ కలర్స్‌తో అందుబాటులో ఉన్న R15 V4 కంటే ఇది రూ.3,000 వరకు ఎక్కువ. మరోవైపు, MT-15 MotoGP ఎడిషన్ ధర రూ.1.77 లక్షలుగా ఉంది. ఇది స్టాండర్డ్ MT-15లోని కొన్ని రంగుల వేరియంట్లతో పోలిస్తే రూ.13,000 వరకు ఎక్కువ.
ఈ రెండు బైక్‌లలో ప్రధాన ఆకర్షణ MotoGP గ్రాఫిక్స్. MotoGP రేసింగ్ బైక్ YZR-M1ను పోలి ఉండే ప్రత్యేక డిజైన్‌ను ఈ బైక్‌లపై అందించారు. గతంలో కూడా ఇదే గ్రాఫిక్స్‌తో వచ్చిన MotoGP ఎడిషన్‌కు మంచి ఆదరణ లభించడంతో మరోసారి మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
అయితే ఈ కొత్త ఎడిషన్‌లో ఇంజిన్ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. ఇంజిన్, పనితీరు, ఫీచర్లు అన్నీ మునుపటి మోడళ్ల మాదిరిగానే ఉన్నాయి. కేవలం బాహ్య రూపంలో మాత్రమే మార్పులు చేశారు.
ఇది కూడా చదవండి: కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
R15 V4 MotoGP ఎడిషన్ & MT-15 MotoGP ఎడిషన్ రెండింటిలోనూ 155cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 18.4 హెచ్‌పీ శక్తి & 14.2 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మంచి పనితీరు, వేగవంతమైన స్పందనతో ఈ ఇంజిన్ ఇప్పటికే మంచి గుర్తింపు సంపాదించుకుంది.
R15 V4 MotoGP ఎడిషన్ ధర పెరిగినా, టాప్ వేరియంట్ R15Mతో పోలిస్తే ఇప్పటికీ తక్కువ ధరకే లభిస్తోంది. ప్రస్తుతం R15M ధర దాదాపు రూ.2 లక్షలకు చేరువలో ఉంది. దీంతో MotoGP గ్రాఫిక్స్ కావాలనుకునే వారికి ఇది మరింత అందుబాటులో ఉండే ఎంపిక అవుతుంది.
ఇది కూడా చదవండి: రికార్డు సృష్టించిన TVS - వెనుకబడిన Ola.. ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల్లో టాప్ 10 కంపెనీలు ఇవే!
FZ-S సిరీస్‌కు కొత్త రంగులుఇక FZ-S శ్రేణిలో కూడా యమహా కొత్త రంగులను తీసుకొచ్చింది. FZ-S Fi Hybridకు కొత్త Ice Storm రంగును పరిచయం చేసింది. ఇప్పటికే ఉన్న Matte Black రంగుకు కూడా కొత్త గ్రాఫిక్స్‌ను జోడించింది. FZ-S Fi మోడల్‌కు కొత్త Metallic Black రంగును అందుబాటులోకి తీసుకొచ్చింది.
కొత్త రంగులు వచ్చినప్పటికీ FZ-S సిరీస్ ధరలను యమహా మార్చలేదు. FZ-S Fi Hybrid ధర రూ.1.39 లక్షలుగానే కొనసాగుతోంది. అలాగే FZ-S Fi ధర రూ.1.29 లక్షలుగానే ఉంది.
ఈ తాజా మార్పులతో, స్టైల్‌కు ప్రాధాన్యం ఇచ్చే యూజర్లను మరింత ఆకట్టుకోవాలని యమహా లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా MotoGP అభిమానులకు రేసింగ్ బైక్‌లను గుర్తు చేసే గ్రాఫిక్స్ ఈ ఎడిషన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
