Kinetic DX Electric Scooter Features And Launching Date: 1984లో కైనెటిక్ ఇంజినీరింగ్ & హోండా సంయుక్తంగా ప్రారంభించిన కైనెటిక్ DX స్కూటర్, 41 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు, ఎలక్ట్రిక్ రూపంలో తిరిగి వస్తోంది. నిజానికి, 1984లో, ఈ బండి భారతదేశంలో మొట్టమొదటి టూ-స్ట్రోక్ ఆటోమేటిక్ స్కూటర్ & ఆ సమయంలో బాగా పాపులర్‌ అయింది. ముఖ్యంగా యువతను ఉర్రూతలూగించింది. ఇప్పుడు, ఫిరోడియా గ్రూప్ దీనిని కొత్త ఎలక్ట్రిక్ అవతార్‌లో మార్కెట్లోకి మళ్ళీ విడుదల చేయబోతోంది.
 
గేమ్ చేంజర్ స్కూటర్ కైనెటిక్ హోండా DX
1980ల్లో, భారతదేశ ద్విచక్ర వాహన విభాగం వేగవంతమైన మార్పుల దశలో ఉన్న సమయంలో కైనెటిక్ హోండా DX మార్కెట్లోకి విడుదలైంది. ఆ సమయంలో వెస్పా & బజాజ్ వంటి స్కూటర్లు మాన్యువల్ గేర్ ఛాంబర్‌లను ఉపయోగించగా, కైనెటిక్ DX పూర్తిగా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కొత్త దారిని చూపించింది. 98cc ఇంజిన్, 7.7 HP పవర్ & 9.8 Nm టార్క్‌తో ఈ స్కూటర్ గొప్ప డ్రైవింగ్ అనుభవాన్ని అందించింది. దీని CVT (కంటిన్యూయస్లీ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్) టెక్నాలజీ, స్కూటర్ నడపడాన్ని చాలా సులభంగా మార్చింది. ఇది మాత్రమే కాదు, ఆ కాలంలోని ఇతర స్కూటర్లలో అందుబాటులో లేని సెల్ఫ్ స్టార్ట్ & కిక్ స్టార్ట్ ఎంపికలు రెండూ ఈ స్కూటర్‌లో ఉన్నాయి. దీని గురించి మరో ప్రత్యేకత ఏమిటంటే దీని నిర్వహణ ఖర్చు నెలకు కేవలం ₹21 మాత్రమే అని ప్రకటించారు. విడిభాగాలు & లేబర్ ఛార్జీలు రెండూ కలిసే ఈ ఖర్చును వెల్లడించారు, సంచలనం సృష్టించారు. ఈ బైక్‌ విడుదలైన తర్వాత దేశాన్ని ఒక ఊపు ఊపింది. అయితే, వివిధ కారణాల వల్ల ఆ తర్వాత కనుమరుగైంది.

Continues below advertisement


కైనెటిక్ DX మళ్ళీ వస్తోంది
ఇప్పుడు, దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగం ఊపందుకుంటున్న తరుణం. ఈ సమయంలో వస్తున్న కైనెటిక్ గ్రీన్ బ్రాండ్, ఈ పాపులర్‌ స్కూటర్‌ను మరోసారి పరిచయం చేయబోతోంది. ఈ స్కూటర్ కొత్త డిజైన్‌కు కంపెనీ పేటెంట్ పొందింది & ఇటీవల టెస్టింట్‌ సమయంలో కూడా ఈ బండి రోడ్లపై కనిపించింది.


కొత్త డిజైన్‌కు సంబంధించిన లీక్స్‌ను బట్టి చూస్తే... కొత్త కైనెటిక్ DX EV స్కూటర్, పాత రెట్రో లుక్‌ను చాలా వరకు కంటిన్యూ చేసింది. ఇందులో వెడల్పాటి హెడ్‌ల్యాంప్, పొడవైన సీటు & స్టైలిష్ ఫ్రంట్ ఆప్రాన్ ఉన్నాయి, ఇది పాత కైనెటిక్ ప్రియులకు నోస్టాల్జిక్ అనుభూతిని ఇచ్చింది.


లాంచ్‌ తర్వాత పోటీ ఎవరితో?
కైనెటిక్ DX ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ తేదీని ప్రకటించారు. ఈ స్కూటర్ ఈ నెలాఖరులో, జులై 28, 2025న లాంచ్ అవుతుంది. దీనిని ఫిరోడియా గ్రూప్‌కు చెందిన కైనెటిక్ గ్రీన్ లాంచ్‌ చేస్తుంది. ప్రస్తుతానికి, కైనెటిక్ DX ఎలక్ట్రిక్ స్కూటర్ పవర్‌ట్రెయిన్, బ్యాటరీ స్పెసిఫికేషన్లు లేదా రేంజ్‌ గురించి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. కానీ, ఈ స్కూటర్ ఇప్పటికే భారత మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు గట్టి పోటీని ఇస్తుందని ఆటో ఎక్స్‌పర్ట్స్‌ విశ్వసిస్తున్నారు. భారతీయ EV మార్కెట్లో, ఇది బజాజ్ చేతక్ EV, TVS iQube, Hero Vida V1, & Ola S1 X+ & Pro మోడల్‌ల వంటి ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్‌లతో నేరుగా పోటీపడుతుంది.