కియా మనదేశంలో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఈవీ6ని లాంచ్ చేయడానికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన కచ్చితమైన లాంచ్ తేదీ మాత్రం తెలియరాలేదు. ఈ కారు మనదేశంలో రోడ్ల మీద మొదటిసారి కనిపించింది. అది కూడా మన హైదరాబాద్‌లో కావడం విశేషం. సాధారణంగా టెస్టింగ్‌లో ఉన్న కార్ల డిజైన్ వివరాలు బయటకు రాకుండా ముసుగు కప్పుతారు. కానీ ఈ కారు విషయంలో కియా ఆ జాగ్రత్త తీసుకోలేదు. దీంతో ఈ కారు ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.


ఈ సంవత్సరం మే లేదా జూన్‌లో ఈ కారు లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. గతేడాది మార్చిలోనే కియా ఈ కారును మొదటి సారి ప్రదర్శించింది. 2027 లోపు కియా లాంచ్ చేయనున్న ఏడు ఎలక్ట్రిక్ కార్లలో ఇది కూడా ఒకటి. హ్యుండాయ్ ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫాంపై ఈ కారును కియా రూపొందించింది. ఈ కారు ఎక్స్‌టీరియర్ లుక్ బాగా క్లాస్‌గా ఉంది. స్లీక్ ఫ్రంట్ గ్రిల్, పెద్ద హెడ్ ల్యాంప్స్, ప్రత్యేకమైన డీఆర్ఎల్ సిగ్నేచర్ ఇందులో ఉన్నాయి.


దీని ఇంజిన్ గురించి కియా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఎటువంటి వివరాలను వెల్లడించలేదు కూడా. గ్లోబల్‌గా ఈ కారు లాంచ్ అయినప్పుడు ఇందులో ఎక్కువ వేరియంట్లను అందించారు. ఒక వేరియంట్‌లో 58 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. దీని సింగిల్ మోటార్ సెటప్ 170 బీహెచ్‌పీని, డ్యూయల్ మోటార్ సెటప్ 235 బీహెచ్‌పీని అందించనుంది.


కియా ఈవీ 6లో పెద్ద 77.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కూడా ఉంది. ఈ వేరియంట్‌లో కూడా రెండు మోడళ్లు ఉన్నాయి. సింగిల్ మోటార్ సెటప్ 225 బీహెచ్‌పీని, డ్యూయల్ మోటార్ సెటప్ 320 బీహెచ్‌పీని అందించనుంది. ఇందులో టాప్ ఎండ్ వేరియంట్ అయితే ఏకంగా 584 బీహెచ్‌పీని అందించనుంది.






Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?