COVID-19 Precaution Dose : ప్రికాషనరీ లేదా బూస్టర్ డోస్ పై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. 18 ఏళ్లు నిండిన వారందరూ బూస్టర్ డోస్ తీసుకునేందుకు అర్హులని ప్రకటించింది. ప్రైవేట్ టీకా కేంద్రాలలో బూస్టర్ డోస్ వేయించుకోవచ్చని వెల్లడించింది. ఇప్పటికే వైద్య ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్స్, 60 ఏళ్ల నిండిన వారికి కేంద్రం బూస్టర్ డోస్ టీకా అందిస్తుంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొదటి, రెండో డోస్ టీకాలను ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా అందిస్తున్నామని తెలిపింది. అలాగే ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ కార్మికులు, 60 ఏళ్ల వయసు గల జనాభాకు ప్రికాషనరీ టీకాలు ఇస్తున్నామని తెలిపింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేస్తామని వెల్లడించింది. 






18 ఏళ్ల వయసు వారందరికీ బూస్టర్ డోస్ 


దేశంలో 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు రెండో డోస్ తీసుకుని 9 నెలల పూర్తి అయితే ప్రైవేట్ టీకా కేంద్రాలలో బూస్టర్ డోస్ తీసుకునేందుకు అర్హులని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది.  ఏప్రిల్ 10 నుంచి 18 ఏళ్లు నిండిన జనాభాకు ప్రైవేట్ టీకా కేంద్రాలలో ప్రికాషనరీ డోస్ లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 15 ఏళ్లు నిండిన జనాభాలో 96 శాతం మంది కనీసం ఒక కరోనా వ్యాక్సిన్ డోస్‌ అందించారు. అయితే 15 ఏళ్లు నిండిన వారిలో 83 శాతం మందికి రెండు డోస్‌లను అందించారు. హెల్త్‌ కేర్ వర్కర్స్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్, 60 ఏళ్లు వయసు వారికి 2.4 కోట్ల కన్నా ఎక్కువ ప్రికాషనరీ డోస్ లు అందించారు. 12 నుంచి 14 వయసు గల వారిలో 45 శాతం మందికి మొదటి డోస్ అందించారు. అర్హులైన జనాభాకు మొదటి, రెండో డోస్ కోసం ప్రభుత్వ టీకా కేంద్రాల ద్వారా కొనసాగుతున్న ఉచిత టీకా కార్యక్రమం అలాగే హెల్త్‌కేర్ వర్కర్స్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్, 60+ జనాభాకు బూస్టర్ డోస్ కొనసాగుతుంది.