Kawasaki Z650 vs Kawasaki Z650 S Differences: కవాసకి, మన మార్కెట్లోకి కొత్త Z650 S మోటార్‌సైకిల్‌ను లాంచ్‌ చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌కు పరిచయమైన ఏడాది తర్వాత ఈ బైక్ భారత్‌కు వచ్చింది. ఇప్పటికే మన దగ్గర ఉన్న ఉన్న స్టాండర్డ్ Z650తో పోలిస్తే Z650 Sలో కొత్త డిజైన్‌తో పాటు కొన్ని ఎర్గోనామిక్ మార్పులు, అదనపు ఫీచర్లు యాడ్‌ అయ్యాయి.

Continues below advertisement

రెండు బైక్‌లలోనూ 649cc ప్యారలల్ ట్విన్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8,000rpm వద్ద 68hp పవర్, 6,700rpm వద్ద 64Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రెల్లిస్ ఫ్రేమ్, సస్పెన్షన్ యూనిట్లు, 15 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ & 130mm గ్రౌండ్ క్లియరెన్స్ కూడా రెండింటిలో ఒకేలా ఉన్నాయి. అయితే.. కొత్త Z650 S కోసం స్టాండర్డ్ మోడల్ ‍‌(Z650) కంటే రూ.33,000 ఎక్కువ ధర నిర్ణయించడానికి కారణాలేంటి?.

 1. రైడింగ్ పొజిషన్‌లో మార్పులు

Continues below advertisement

Z650 Sలో చేసిన ముఖ్యమైన మార్పుల్లో రైడింగ్ పొజిషన్ ఒకటి. స్టాండర్డ్ Z650తో పోలిస్తే ఇందులో సీటు ఎత్తు పెరిగింది. 2025 Z650లో సీటు ఎత్తు 790mm ఉండగా, కొత్త Z650 Sలో 805mmగా ఉంది. అంటే 15mm పెరిగింది. పిలియన్ సీటు కూడా స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే 10mm ఎత్తుగా, 20mm వెడల్పుగా ఉంటుంది. రెండు సీట్ల ఎత్తు పెరగడానికి మందమైన ఫోమ్ ఉపయోగించడమే కారణమని కవాసకి తెలిపింది.

మరో ముఖ్యమైన మార్పు హ్యాండిల్‌బార్. Z650 Sలో ఇది అదనంగా 30mm వెడల్పు ఉంటుంది. అంతేకాకుండా కొద్దిగా పైకి వాలినట్లు ఉంటుంది. వెడల్పైన హ్యాండిల్‌బార్ వల్ల బైక్‌ను మలుపుల్లో తిప్పడం సులభం కావచ్చు. పైకి వాలిన పొజిషన్ స్పోర్టియర్ రైడింగ్ అనుభూతిని ఇస్తుంది.

రైడర్ ఫుట్‌పెగ్స్‌ను కూడా వెనుకకు జరిపారు. ఈ మార్పులు కొత్త Z650 Sను స్టాండర్డ్ Z650 కంటే స్పోర్టియర్‌గా మార్చేలా ఉన్నాయి.

బరువు విషయంలోనూ తేడా ఉంది. Z650 S కెర్బ్ వెయిట్ 193 కిలోలు. స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే ఇది 5 కిలోలు ఎక్కువ. ముందు భాగంలోని కొత్త ఫెయిరింగ్, కొత్త హ్యాండిల్‌బార్ & రేడియేటర్ గార్డ్ వంటి అదనపు పరికరాల వల్ల బరువు పెరిగి ఉండవచ్చని అంచనా.

ఇది కూడా చదవండి: BMW F 450 GS లో Base నుంచి GS Trophy వరకు నాలుగు వేరియంట్లు.. ఏ వేరియంట్‌ బెటర్‌?

 2. డిజైన్‌లో కొత్త Sugomi స్టైల్

రెండు బైక్‌ల మధ్య తేడాను సులభంగా గుర్తించాలంటే వాటి డిజైన్‌ను చూడాలి. Z650 Sలో.. Z900 నుంచి తీసుకున్న కొత్త Sugomi డిజైన్ ఎలిమెంట్స్‌ ఉన్నాయి. కొత్త మోడల్ మొత్తం మరింత షార్ప్‌గా, సన్నగా కనిపిస్తుంది. 

ముఖ్యంగా హెడ్‌లైట్ డిజైన్‌లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో మూడు యూనిట్లతో కూడిన హెడ్‌లైట్ సెటప్ ఉంది. ఇది Z900 డిజైన్‌ను పోలి ఉంటుంది. టెయిల్‌లైట్‌ను కూడా కొత్తగా మార్చారు. Ninja 500 వంటి ఆధునిక కవాసకి బైక్‌ల డిజైన్‌కు దగ్గరగా ఉండేలా తీర్చిదిద్దారు.

భారత్‌లో స్టాండర్డ్ Z650కు 2025 తర్వాత అప్‌డేట్ రాలేదు. అంతర్జాతీయ మార్కెట్లోనూ 2026 నుంచి ఈ మోడల్‌కు అప్‌డేట్ లేదు. భవిష్యత్తులో స్టాండర్డ్ Z650కు కూడా Z650 S తరహా కొత్త డిజైన్ వచ్చే అవకాశం ఉందని అంచనా. అయితే దీనిపై కంపెనీ ఎలాంటి టైమ్‌లైన్ ప్రకటించలేదు.

 3. ఫీచర్లు & ఎలక్ట్రానిక్స్‌లో తేడాలు

ఫీచర్ల విషయంలో రెండు బైక్‌ల మధ్య భారీ తేడాలు లేవు. అయితే Z650 Sకు ప్రత్యేకంగా అప్‌షిఫ్ట్-ఓన్లీ కవాసకి క్విక్‌షిఫ్టర్‌ (KQS)ను యాక్సెసరీగా పొందే అవకాశం ఉంది. స్టాండర్డ్ Z650లో ఈ సదుపాయం లేదు.

బ్రేక్ రోటర్ల పరిమాణం రెండు మోడళ్లలో ఒకేలా ఉంటుంది. కానీ డిజైన్‌లో మార్పు చేశారు. Z650లో పెటల్ డిస్క్‌లు ఉండగా, Z650 Sలో సాధారణ రౌండెడ్‌ డిస్క్‌లను అందించారు.

రెండు బైక్‌లలోనూ 4.3-అంగుళాల TFT డిస్‌ప్లే ఉంటుంది. అయితే Z650 Sలో కొత్త లేఅవుట్‌ను ఇచ్చారు. ఇది Z900 డిస్‌ప్లేను పోలి ఉంటుంది. Kawasaki Rideology యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కూడా లభిస్తుంది.

Z650 Sలో రైడింగ్ లాగ్స్ వంటి అదనపు సమాచారం చూసుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ రెండు బైక్‌లలోనూ టర్న్-బై-టర్న్ నావిగేషన్ సపోర్ట్ లేదు. బ్లూటూత్‌ ద్వారా ఫోన్ & SMS అలర్ట్స్ మాత్రమే చూపిస్తుంది.

ఇది కూడా చదవండి: 743cc ఇంజిన్, 6-యాక్సిస్ IMU, క్రూయిజ్ కంట్రోల్.. హిమాలయన్ 750 ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి

రైడర్ ఎయిడ్స్ విషయంలో రెండు మోడళ్లలోనూ ఒకే ఫీచర్లు ఉన్నాయి. అవి:

- మూడు స్థాయిల కవాసకి ట్రాక్షన్‌ కంట్రోల్‌ (KTRC)- డ్యూయల్ ఛానల్ ABS- స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్

 4. Kawasaki Z650 S, Z650 ధరలు

Kawasaki Z650 S ధర: రూ.7.59 లక్షలు (ఎక్స్‌షోరూమ్)

Kawasaki Z650 ధర:  రూ.7.26 లక్షలు (ఎక్స్‌షోరూమ్)

 ఏ బైక్ కొనడం మంచిది?

Kawasaki Z650 Sలో కొత్త డిజైన్, పెరిగిన సీటు ఎత్తు, వెడల్పైన హ్యాండిల్‌బార్, వెనుకకు జరిపిన ఫుట్‌పెగ్స్ వంటి మార్పులు ఉన్నాయి. అదనంగా క్విక్‌షిఫ్టర్ యాక్సెసరీ ఆప్షన్ కూడా ప్రత్యేకతగా నిలుస్తుంది. అయితే ఇంజిన్, ఫ్రేమ్, సస్పెన్షన్, ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం వంటి కీలక అంశాలు రెండు బైక్‌లలోనూ ఒకేలా ఉన్నాయి. కాబట్టి కొత్త డిజైన్ & స్పోర్టియర్ రైడింగ్ పొజిషన్ కావాలనుకునేవారు Z650 Sను పరిశీలించవచ్చు. తక్కువ ధరలో దాదాపు అదే ఇంజిన్, ప్రధాన ఫీచర్లు కావాలనుకునేవారు స్టాండర్డ్ Z650ను పరిశీలించవచ్చు. మీకు ఏ బైక్‌ సరిపోతుందో తెలుసుకోవడానికి ముందుగా రెండింటినీ టెస్ట్ రైడ్ చేయడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.