Kawasaki Discount Offer December 2024: 2024 సంవత్సరంలో చివరి నెల కొనసాగుతోంది. ఈ డిసెంబర్ నెలలో చాలా మంది వాహన తయారీదారులు బైక్‌లు, స్కూటర్‌లతో పాటు కార్లపై గొప్ప ఆఫర్‌లను తీసుకువస్తున్నారు. ఓలా నుంచి టీవీఎస్ వరకు ఎలక్ట్రిక్ స్కూటర్లపై కూడా ప్రయోజనాలు అందజేస్తున్నారు. టీవీఎస్ ఐక్యూబ్‌పై 100 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడు కవాసకి కూడా తన బైక్‌లపై మంచి ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఈ నెలలో ఈ బ్రాండ్ బైక్‌లపై రూ.15 వేల నుంచి రూ.45 వేల వరకు ఆఫర్‌ ఇస్తున్నారు. 


నింజా 300పై తగ్గింపు ఆఫర్
కవాసకి తన బైక్‌లపై గొప్ప తగ్గింపు ఆఫర్‌తో ముందుకు వచ్చింది. నింజా 300 ధర రూ. 3.43 లక్షలుగా ఉంది. కంపెనీ ఈ ట్విన్ సిలిండర్ బైక్‌ను అత్యంత తక్కువ ధరకు విక్రయిస్తోంది. భారతదేశంలో కవాసకి బెస్ట్ సెల్లింగ్ మోటార్‌సైకిల్ ఇదే. ఈ బెస్ట్ సెల్లింగ్ బైక్‌పై కంపెనీ రూ. 30,000 తగ్గింపు అందిస్తోంది. దీని కారణంగా నింజా 300 ధర ఇప్పుడు రూ. 3.13 లక్షలకు తగ్గింది. అయితే ఇది ఎక్స్ షోరూం ధర. ఆన్ రోడ్ ధర మరింత ఎక్కువగా ఉంటుంది.



Also Read: టీవీఎస్ ఐక్యూబ్‌పై 100 శాతం క్యాష్‌బ్యాక్ - సూపర్ ఆఫర్ ఇస్తున్న కంపెనీ!


కవాసకి బైక్‌లపై భారీ ఆఫర్లు
కవాసకి నింజా 500 భారతదేశంలో పూర్తిగా తయారు చేయబడిన బైక్. ఇండియన్ మార్కెట్లో ఈ బైక్ ధర రూ.5.24 లక్షలుగా ఉంది. ఈ కవాసకి మోటార్‌సైకిల్‌పై రూ. 15,000 తగ్గింపు కూడా అందిస్తున్నారు. దీని కారణంగా ఈ బైక్ ధర రూ. 5.09 లక్షలకు తగ్గింది. కవాసకి వెర్సిస్ 650పై కూడా బెనిఫిట్‌లు అందిస్తున్నారు. ఆఫర్‌కు ముందు ఈ బైక్ ధర రూ.7.77 లక్షలుగా ఉంది. అయితే ఇప్పుడు రూ.30,000 తగ్గింపు తర్వాత ఈ మోడల్ ధర రూ.7.47 లక్షలుగా మారింది.


అత్యధిక తగ్గింపు ఈ బైక్‌పైనే...
కవాసకి వెర్సిస్ 650 తరహాలోనే ఉండే నింజా 650పై రూ. 45,000 తగ్గింపు అందిస్తున్నారు. ఆఫర్‌కి ముందు ఈ బైక్ ధర రూ. 7.16 లక్షలుగా ఉంది. ఇప్పుడు ఈ మోటార్ సైకిల్ ధర రూ.6.71 లక్షలకు తగ్గింది. కవాసకి జెడ్900 మార్కెట్లో రూ.40,000 తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ మోటార్ సైకిల్ ధర రూ.9.38 లక్షల నుంచి రూ.8.98 లక్షలకు తగ్గింది.



Also Read: ప్రతి నెలా లక్షల్లో అమ్ముడుపోతున్న బైక్‌లు - ఇండియాలో టాప్-5 కంపెనీలు ఇవే!