ఎంట్రీ-లెవెల్‌లో హ్యాచ్‌బ్యాక్ కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే, మీరు ఈ విషయాన్ని తెలుసుకోవల్సిందే. హ్యాందాయ్ సంస్థ.. అత్యంత ప్రజాధారణ పొందిన ‘శాంత్రో’(Santro) కారును విక్రయాలను నిలిపేయాలని నిర్ణయించుకుందట. ‘ఎకనామిక్ టైమ్స్’ రిపోర్ట్ ప్రకారం.. ‘శాంత్రో’ కారు సేల్స్ తగ్గిపోవడం, ఇన్‌పుట్ ఖర్చులు పెరిగిపోతున్న నేపథ్యంలో ‘శాంత్రో’ కార్ల ఉత్పత్తిని ఆపేయడం బెటర్ అని భావిస్తోందట. అయితే, ఈ సంస్థ ‘శాంత్రో’ కార్లను విక్రయాలను ఆపేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఈ కార్లను మార్కెట్లో రిలీజ్ చేయలేదు.
దక్షిణ కొరియాకు చెందిన ఈ కార్ల తయారీ సంస్థ.. ఇంతకుముందు 2014లో ‘శాంత్రో’ కార్ల విక్రయాలను నిలిపేసింది. 2018లో సరికొత్త ఫేస్‌లిఫ్ట్‌తో ‘శాంత్రో’ను రంగంలోకి దించింది. ప్రారంభ-స్థాయి హ్యాచ్‌బ్యాక్ అప్పట్లో రూ.3.19 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉండేది. అయితే, ఇప్పుడు హ్యాచ్‌బ్యాక కార్ల ధరలు ఇప్పుడు గణనీయంగా పెరిగాయి. దీని వలన ‘శాంత్రో’ కారు ధర కూడా ఇప్పుడు బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం ‘హ్యుందాయ్ శాంత్రో’ ప్రారంభ ధర(ఢిల్లీలో ఎక్స్-షోరూమ్ ధరల ప్రకారం) రూ.4.9 లక్షల నుంచి మొదలై రూ.6.42 లక్షల వరకు ఉంది.
2018 నుంచి కార్ల ధరల పెరుగుదలకు సేఫ్టీ రూల్స్, BS6 ఉద్గార(emission) నిబంధనలు ప్రధాన కారణమని తెలుస్తోంది. అలాగే, పెరిగిన ఇన్‌పుట్ ఖర్చులు కూడా భారంగా మారినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబరు నుంచి కొత్త భద్రతా నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో హ్యాచ్‌బ్యాక్ కార్ల ధర మరింత పెరిగే అవకాశాలున్నాయి. రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం ప్రయాణికుల భద్రత కోసం ఇకపై అన్ని కొత్త కార్లలో ప్రామాణికంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు అమర్చాలి. ఈ నిబంధన అమలు చేస్తే.. శాంత్రో కారు ధర మరింత పెరుగుతుంది. ప్రస్తుతం ఎంట్రీ-లెవెల్ హ్యాచ్ బ్యాక్ అమ్మకాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో హ్యూందాయ్ సంస్థ.. ‘శాంత్రో’ను అప్‌డేట్ చేయడం వల్ల ప్రయోజనం ఉండదని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికికైతే హ్యూందాయ్ శాంత్రో కారు ఇండియాలో విక్రయాలకు అందుబాటులోనే ఉంది. ఆన్‌లైన్ లేదా డీలర్‌షిప్‌లలో ఈ కారును బుక్ చేసుకోవచ్చు. కానీ, ఎప్పటివరకు అందుబాటులో ఉంటుందనేది కేవలం ఆ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే తెలుస్తుంది.