ఇంధన ధరలు సహనాన్ని పరీక్షిస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకు పెరుగుతున్న ధరలతో ప్రజలు ముప్పు తిప్పలు పడుతున్నారు. దీంతో వాహనదారులు పదే పదే పెట్రోల్ బంకులకు వెళ్లకుండా ఒక్కసారే ట్యాంక్ నిండా ఇంధనాన్ని కొట్టిస్తున్నారు. అయితే, తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ మెసేజ్ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ట్యాంకు నిండుగా ఇంధనం కొట్టిస్తే పేలిపోయే ప్రమాదం ఉందనేది ఆ మెసేజ్ సారాంశం. ఇండియాన్ ఆయిల్ కార్పొరేషన్ (Indian Oil Corporation) పేరుతో ఈ మెసేజ్ వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. అదే నిజమనే భావనతో ప్రజలు ఆ మెసేజ్‌ను అందరికీ ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇంతకీ అందులో పేర్కొన్న అంశంలో నిజమెంతా? వేసవిలో ట్యాంకు నిండుగా ఇంధనం కొట్టిస్తే నిజంగానే పేలిపోతుందా?
ఆ మెసేజ్‌లో ఏముంది?: ఇన్నాళ్లు ఈ మెసేజ్ ఇంగ్లీష్‌లోనే చక్కర్లు కొట్టింది. ఇప్పుడు అది తెలుగులోనూ చక్కర్లు కొడుతోంది. ఆ మెసేజ్ ప్రకారం.. ‘‘రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, మీ వాహనంలో గరిష్ట పరిమితిలో పెట్రోల్ నింపకండి. ఇది ఇంధన ట్యాంక్‌లో పేలుడుకు కారణమవుతుంది. దయచేసి మీ వాహనంలో సగం ట్యాంక్‌లో ఇంధనాన్ని నింపి, గాలికి దూరంగా ఉండేలా చూసుకోండి. ఈ వారం గరిష్టంగా పెట్రోల్ నింపడం వల్ల 5 పేలుడు ప్రమాదాలు సంభవించాయి. దయచేసి పెట్రోల్ ట్యాంక్‌ను రోజుకు ఒకసారి తెరిచి, లోపల పేరుకుపోయిన గ్యాస్ బయటకు వచ్చేలా చేయండి’’ అని అందులో పేర్కొన్నారు.
Also Read: ఏసీని 24 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో పెడుతున్నారా? అయితే, ముప్పే!
వాస్తవానికి.. ఆ ప్రకటన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జారీ చేసినది కాదు. మీరు ఆ నోట్‌ను పరిశీలనగా చూస్తే అర్థమవుతుంది. ఎవరో కావాలనే దాన్ని తయారు చేసి ఈ వదంతిని ప్రచారం చేస్తున్నారు. అందులో నిజమెంతో తెలుసుకోకుండా సోషల్ మీడియాలో దాన్ని గుడ్డిగా ఇతరులకు ఫార్వర్డ్ చేస్తున్నారు. పైగా ఆ మెసేజ్‌లో పేర్కొన్నట్లు.. ట్యాంక్ నిండా ఇంధనం నింపడం వల్ల పేలుళ్లు జరిగిన ఘటనలు కూడా అవాస్తవం. అది ప్రజలను బకరా చేయడానికి అల్లిన కట్టుకథ మాత్రమే.
Also Read: జాగ్రత్త, అంగస్తంభన కోసం ఇలా చేస్తే కళ్లు పోతాయ్! తాజా అధ్యయనం వెల్లడి
మూడేళ్ల నుంచి చక్కర్లు కొడుతున్న ఫేక్ న్యూస్: చిత్రం ఏమిటంటే ఈ మెసేజ్ ఇప్పటిది కాదు. 2019 నుంచి ఇది చక్కర్లు కొడుతోంది. చివరికి అది మనకు కూడా చేరింది. దీనిపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOC) 2019లోనే వివరణ ఇచ్చింది. ఆ ఏడాది జూన్ 3న ఆ ఫేక్ వార్తను ఖండిస్తూ ఓ ట్వీట్ చేసింది. “#IndianOil నుంచి ముఖ్యమైన ప్రకటన. ఆటోమొబైల్ తయారీదారులు అన్ని పరిస్థితులను తట్టుకొనేలా తమ వాహనాలను డిజైన్ చేస్తారు. పెట్రోల్/డీజిల్ వాహనాల కోసం ఇంధన ట్యాంక్‌లో పేర్కొన్న గరిష్ట వాల్యూమ్ మినహాయింపు కాదు. కాబట్టి శీతాకాలం లేదా వేసవితో సంబంధం లేకుండా తయారీదారు పేర్కొన్న పూర్తి పరిమితి (గరిష్టంగా) వరకు వాహనాల్లో ఇంధనాన్ని నింపడం సురక్షితమే’’ అని పేర్కొంది. ఇది విషయాన్ని ఇండియన్ ఆయిల్ సంస్థ ఈ ఏడాది ఏప్రిల్ 22న కూడా మరోసారి ధృవీకరించింది.