Women Are Better Drivers Than Men: భారతదేశంలో రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్య డ్రైవింగ్ చేస్తున్నారా? అయితే కాస్త జాగ్రత్త. రోజు మొత్తంలో ఇదే అత్యంత ప్రమాదకర సమయమని తాజా అధ్యయనం వెల్లడించింది. జునో జనరల్ ఇన్సూరెన్స్ విడుదల చేసిన ఇండియా రోడ్ సేఫ్టీ రిపోర్ట్ (IRSR) 2026 ప్రకారం, రాత్రి 8 గంటల తర్వాత డ్రైవింగ్ నాణ్యత గణనీయంగా తగ్గుతుండగా, 9 నుంచి 10 గంటల మధ్య ప్రమాదాల అవకాశాలు అత్యధికంగా ఉంటున్నాయి.

Continues below advertisement

జునో స్మార్ట్‌డ్రైవ్ యాప్ ద్వారా సేకరించిన టెలిమెట్రీ డేటా ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు. దేశంలోని 17 రాష్ట్రాల్లో నమోదైన 45 లక్షల ప్రయాణాలు & సుమారు 5.5 కోట్ల కిలోమీటర్ల డ్రైవింగ్ డేటాను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. డ్రైవింగ్ సమయంలో డ్రైవర్లు ఎలా ప్రవర్తిస్తున్నారనే అంశాన్ని ప్రధానంగా పరిశీలించారు.

ఈ అధ్యయనంలో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. పురుషుల కంటే మహిళలే మెరుగైన డ్రైవర్లు అనే అభిప్రాయానికి ఈ నివేదిక బలం చేకూర్చింది. మహిళలు సగటున 92.86 డ్రైవింగ్ స్కోర్ సాధించగా, పురుషులు 92.43 స్కోర్ నమోదు చేశారు. ఈ తేడా చాలా స్వల్పమే అయినప్పటికీ, మహిళలు కొద్దిగా మెరుగైన డ్రైవింగ్ అలవాట్లు ప్రదర్శించినట్లు నివేదిక పేర్కొంది. దీంతో "పురుషులే మంచి డ్రైవర్లు" అనే సాధారణ అభిప్రాయానికి ఈ అధ్యయనం భిన్నమైన చిత్రాన్ని చూపించింది.

Continues below advertisement

డ్రైవింగ్ అలవాట్లే ప్రమాదాలకు కారణంఅయితే రోడ్డు ప్రమాదాలకు కారణం వయస్సు, లింగం వంటి అంశాల కంటే... డ్రైవర్‌ సీట్‌లో ఉన్నవారి డ్రైవింగ్ అలవాట్లే ప్రధాన కారణమని నివేదిక స్పష్టం చేసింది. దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో 80 శాతానికి పైగా డ్రైవింగ్ అలవాట్లే కారణమని వెల్లడించింది.

ఇది కూడా చదవండి: నార్టన్ అట్లాస్ ఫస్ట్ రైడ్ - 585cc ట్విన్ ఇంజిన్, ప్రీమియం ఫీచర్లతో ఈ బండి మామూలుగా లేదుగా!

భారత డ్రైవర్లలో ఎక్కువగా కనిపిస్తున్న రెండు ప్రమాదకర అలవాట్లను కూడా ఈ నివేదిక గుర్తించింది. ఆకస్మికంగా బ్రేక్ వేయడం అత్యంత బలహీనమైన డ్రైవింగ్ లక్షణంగా నిలిచింది. దీనికి కేవలం 87 స్కోర్ మాత్రమే నమోదైంది. అలాగే ఒక్కసారిగా వేగం పెంచడం లేదా హార్ష్ యాక్సిలరేషన్ కూడా ప్రధాన సమస్యగా తేలింది. దీనికి 91 స్కోర్ లభించింది. ఈ రెండు అలవాట్లు ప్రమాదాల అవకాశాలను గణనీయంగా పెంచుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సీజన్‌తో సంబంధం లేని డ్రైవింగ్‌ నాణ్యత ఆశ్చర్యకరంగా వర్షాకాలం, చలికాలం వంటి సీజన్లు డ్రైవింగ్ నాణ్యతపై పెద్దగా ప్రభావం చూపలేదని అధ్యయనం తెలిపింది. భారీ వర్షాలు లేదా మంచు ఉన్న కాలాల్లో కూడా డ్రైవింగ్ స్కోర్లు ఏడాది పొడవునా దాదాపు ఒకే స్థాయిలో కొనసాగినట్లు జునో జనరల్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. అంటే వాతావరణం కంటే డ్రైవర్ ప్రవర్తనే రోడ్డు భద్రతలో కీలక పాత్ర పోషిస్తోందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

ఇక దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల పరిస్థితి మాత్రం ఇంకా ఆందోళనకరంగానే ఉంది. ప్రతి ఏడాది భారత్‌లో సుమారు 1.73 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే మొత్తం రోడ్డు మరణాల్లో దాదాపు 11 శాతం భారత్‌లోనే నమోదవుతున్నాయి. దీని వల్ల దేశ GDPలో 3 నుంచి 5 శాతం వరకు ఆర్థిక నష్టం వాటిల్లుతున్నట్లు నివేదిక పేర్కొంది.

ఇది కూడా చదవండి: అన్ని రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 బైక్‌ల్లో ఒకే ఇంజిన్ - కానీ మీకు సరిపోయే మోడల్‌ ఏది? పూర్తి వివరాలు

బైక్ రైడర్ల మరణాలే ఎక్కువరోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా ద్విచక్ర వాహనదారులే బలవుతున్నారు. మొత్తం రోడ్డు మరణాల్లో 44 శాతం బైక్ రైడర్లవే కాగా, 19 శాతం మంది పాదచారులు ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే రోడ్డు భద్రత విషయంలో మౌలిక వసతుల అభివృద్ధి ఒక్కటే సరిపోదని, డ్రైవర్ల ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చే సాంకేతిక పరిజ్ఞానం కూడా అవసరమని జునో జనరల్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ & CEO షనాయ్ ఘోష్ అభిప్రాయపడ్డారు.

2030 నాటికి రోడ్డు ప్రమాద మరణాలను 50 శాతం తగ్గించాలన్న స్టాక్‌హోమ్ డిక్లరేషన్ లక్ష్యాన్ని భారత్ సాధించాలంటే ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరించడం, ఆకస్మిక బ్రేకింగ్ & అధిక వేగం వంటి ప్రమాదకర అలవాట్లను తగ్గించడం అత్యంత కీలకమని ఈ నివేదిక స్పష్టం చేసింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.