Norton Atlas Review: అడ్వెంచర్ టూరింగ్ బైక్‌లకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంది. నార్టన్ కూడా తన కొత్త అట్లాస్ మోడల్‌తో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చింది. TVS యాజమాన్యంలో పునరుజ్జీవనం పొందిన నార్టన్ నుంచి వచ్చిన రెండో మోటార్‌సైకిల్ ఇదే. ఐస్‌లాండ్‌లోని కొండలు, వంకర తిరుగుల రహదారులు, గ్రావెల్ ట్రాక్‌లపై ఎక్స్‌పర్ట్‌లు ఈ బైక్‌ను పరీక్షించారు. తొలి రైడ్ నుంచే అట్లాస్ ప్రత్యేకమైన ముద్ర వేసింది.

Continues below advertisement

డిజైన్‌మొదట, లుక్స్‌ విషయంలోనే అట్లాస్ మంచి మార్కులు కొట్టేసింది. ఫొటోల్లో కంటే ప్రత్యక్షంగా మరింత అట్రాక్టివ్‌గా కనిపించింది. ముందు భాగంలో ప్రత్యేకమైన LED హెడ్‌ల్యాంప్, దానికి ఇరువైపులా ట్రయాంగ్యులర్ కార్నరింగ్ లైట్లు బైక్‌కు విభిన్నమైన గుర్తింపును ఇస్తాయి. హ్యాండ్‌గార్డ్స్‌లోనే ఇండికేటర్లు కలపడం వల్ల ముందు భాగం చాలా క్లీన్‌గా కనిపిస్తుంది. అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్, 15.4 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, లగేజ్ ర్యాక్, వన్ పీస్ సీట్ లాంగ్ టూరింగ్‌కు అనుకూలంగా రూపొందించబడ్డాయి. బిల్డ్ క్వాలిటీ కూడా ప్రీమియం స్థాయిలో ఉంది.

రైడింగ్ పొజిషన్ విషయంలో అట్లాస్ మంచి సమతుల్యతను అందిస్తుంది. 845 మిల్లీమీటర్ల సీట్ హైట్ కారణంగా, ఎత్తు తక్కువ ఉన్న రైడర్లకు మొదట కాస్త ఇబ్బందిగా అనిపించినా, సీట్‌పై కూర్చున్న తర్వాత బైక్‌పై పూర్తి నియంత్రణ లభిస్తుంది. వెడల్పాటి హ్యాండిల్‌బార్, సరైన ఫుట్‌పెగ్ పొజిషన్ వల్ల ఎక్కువసేపు ప్రయాణించినా అలసట తక్కువగా ఉంటుంది. రోజంతా రైడ్ చేసినప్పటికీ సీట్ సౌకర్యవంతంగానే ఉండటం విశేషం.

Continues below advertisement

ఇది కూడా చదవండి: రాయల్‌ ఎన్‌ఫీల్డ్ రైడర్లకు బిగ్ అలర్ట్‌! 350సీసీ బైక్‌కు ఫ్రీగా గేర్ పొజిషన్ ఇండికేటర్‌! మీ బైక్‌కు వస్తుందో లేదో చెక్ చేయండి!

70hp పవర్ఈ బైక్‌కు శక్తినిచ్చేది కొత్తగా అభివృద్ధి చేసిన 585cc ప్యారలల్ ట్విన్ ఇంజిన్. ఇది 70hp పవర్ & 57.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 270 డిగ్రీ క్రాంక్‌షాఫ్ట్ కారణంగా ఎగ్జాస్ట్ సౌండ్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. తక్కువ rmp నుంచే బలమైన టార్క్ అందించడం వల్ల నగర రోడ్లలోనూ, హైవేలపైనూ రైడింగ్ చాలా సులభంగా అనిపిస్తుంది. ఐదు వేల rmp తర్వాత పవర్ డెలివరీ మరింత లీనియర్‌గా మారుతుంది. అధిక వేగాల్లో కూడా ఇంజిన్ స్మూత్‌గా పనిచేయడం దీని ప్రధాన బలం.

అట్లాస్‌లో బై డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ స్టాండర్డ్‌గా లభిస్తుంది. డౌన్‌షిఫ్ట్‌లు చాలా సాఫీగా ఉన్నప్పటికీ, అధిక వేగాల్లో అప్‌షిఫ్ట్ సమయంలో స్వల్ప జర్క్ కనిపించింది. అయినప్పటికీ మొత్తం పనితీరుపై అది పెద్దగా ప్రభావం చూపదు.

ఫీచర్లు ఈ బైక్ ప్రీమియం ప్యాకేజీని అందిస్తుంది. 8 అంగుళాల TFT టచ్‌స్క్రీన్, ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ABS, క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, హీటెడ్ గ్రిప్స్ వంటి ఆధునిక సదుపాయాలు ఇందులో ఉన్నాయి. టూరింగ్, స్పోర్ట్, ఎండ్యూరో సహా ఐదు రైడింగ్ మోడ్‌లు రైడింగ్ అనుభవాన్ని అవసరానికి అనుగుణంగా మార్చుకునే అవకాశం ఇస్తాయి. ముఖ్యంగా ఎండ్యూరో మోడ్‌లో గ్రావెల్ రోడ్లపై స్లైడ్ కంట్రోల్ అద్భుతంగా పనిచేసింది.

ఇది కూడా చదవండి: భారత్‌లో అమ్మకానికి వచ్చిన ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ బైక్‌లు ఇవిగో - ఎథనాల్ మిశ్రమంపై ఇక ఆందోళన అక్కర్లేదు!

సస్పెన్షన్ బాధ్యతలను పూర్తి అడ్జస్టబుల్ 43 మిల్లీమీటర్ల KYB USD ఫోర్క్ & వెనుక KYB మోనోషాక్ నిర్వహిస్తాయి. రోడ్‌పై బైక్ చాలా స్థిరంగా ఉంటుంది. వేగంగా తిరిగే మలుపుల్లోనూ మంచి ఆత్మవిశ్వాసం ఉంటుంది. గ్రావెల్ రోడ్లపై కూడా సౌకర్యవంతంగా ప్రయాణించగలిగినా, పూర్తిస్థాయి ఆఫ్ రోడ్ ట్రాక్‌ల కోసం రూపొందించిన బైక్‌లతో పోలిస్తే దీని బరువు కొంత ప్రభావం చూపుతుంది.

యూరోగ్రిప్ ఎక్స్‌ప్లో ఆర్ ప్లస్ డ్యూయల్ పర్పస్ టైర్లు తడి రోడ్లు, గ్రావెల్ & కొండ మార్గాల్లో అద్భుతమైన గ్రిప్‌ను అందించాయి. అయితే బ్రేకింగ్ సిస్టమ్‌లో ప్రారంభ బైట్ కొద్దిగా తక్కువగా ఉండటం ఒక లోపంగా చెప్పవచ్చు. లివర్‌ను సగం వరకు నొక్కిన తర్వాతే బ్రేకింగ్ బలం ఒక్కసారిగా పెరగడం వల్ల మొదట అలవాటు కావాల్సి ఉంటుంది.

మొత్తంగా చూస్తే నార్టన్ అట్లాస్ స్టైలిష్ డిజైన్, బలమైన ఇంజిన్, ప్రీమియం ఫీచర్లు, అద్భుతమైన టూరింగ్ సామర్థ్యంతో అడ్వెంచర్ టూరింగ్ విభాగంలో ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీవీఎస్ భారత్‌లో దీని ఉత్పత్తిని ప్రారంభించనుండటంతో ధర కూడా కీలకంగా మారనుంది. ఎక్స్ షోరూమ్ ధర రూ.5 లక్షల నుంచి రూ.5.5 లక్షల మధ్య నిర్ణయిస్తే, భారత మార్కెట్లో ఇది విజయవంతమైన ప్రీమియం అడ్వెంచర్ టూరింగ్ బైక్‌గా నిలిచే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.