15% isobutanol blend in diesel: E20 ఇథనాల్ (పెట్రోల్‌లో 20% ఇథనాల్‌) బ్లెండింగ్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన భారత్ ఇప్పుడు మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. డీజిల్‌లో గరిష్టంగా 15 శాతం ఐసోబ్యూటనాల్ మిశ్రమానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. దేశంలో దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడం, ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని పెంచడం & పర్యావరణ పరిరక్షణను బలోపేతం చేయడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

Continues below advertisement

ఇథనాల్‌ కాదు, ఐసోబ్యూటనాల్‌కేంద్ర రోడ్డు రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇథనాల్‌ను నేరుగా డీజిల్‌లో కలపడం సాధ్యం కాదని చెప్పారు. అందుకే ఇథనాల్‌ను ఐసోబ్యూటనాల్‌గా మార్చే సాంకేతికతపై ప్రభుత్వం దృష్టి సారించిందని వివరించారు. భవిష్యత్తులో ఐసోబ్యూటనాల్ డీజిల్‌కు సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే నిర్వహించిన పైలట్ ప్రాజెక్టులు ఆశాజనక ఫలితాలను ఇచ్చాయని గడ్కరీ తెలిపారు. వంద శాతం ఇథనాల్ & ఐసోబ్యూటనాల్‌తో రెండు జనరేటర్ సెట్లను విజయవంతంగా నడిపామని చెప్పారు. దీనివల్ల ఈ ఇంధనాలతో పనిచేసే ఇంజిన్ల తయారీ పూర్తిగా సాధ్యమని నిరూపితమైందన్నారు. సాంకేతికంగా ఈ ప్రయోగాలు విజయవంతం కావడంతో భవిష్యత్తులో వాణిజ్య స్థాయిలో అమలు చేసే అవకాశాలు పెరిగాయని వెల్లడించారు.

Continues below advertisement

ఇది కూడా చదవండి: 5 స్టార్ భద్రత నుంచి అద్భుతమైన మైలేజ్ వరకు - Maruti Dzireలో ప్లస్‌లే కాదు, మైనస్‌లూ ఉన్నాయి!

ఐసోబ్యూటనాల్‌ను నెక్స్ట్ జనరేషన్ బయోఫ్యూయల్‌గా నిపుణులు అభివర్ణిస్తున్నారు. సాధారణ బయోఫ్యూయల్స్‌తో పోలిస్తే దీనికి అధిక ఎనర్జీ డెన్సిటీ ఉంటుంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న డీజిల్ ఇంజిన్లకు కూడా ఇది మరింత అనుకూలంగా పనిచేస్తుంది. అంతేకాకుండా కాలుష్య ఉద్గారాలను తగ్గించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యామ్నాయ ఇంధనాల జాబితాలో ఐసోబ్యూటనాల్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది.

ఈ20 ఇథనాల్‌పై పుకార్లు నమ్మొద్దు!ఇదిలా ఉండగా, ఈ20 ఇథనాల్ మిశ్రమ కార్యక్రమంపై సోషల్ మీడియాలో ఇటీవల వస్తున్న పలు ఆరోపణలను కేంద్ర పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇథనాల్ ఉత్పత్తి వల్ల నీటి వినియోగం అధికమవుతుందని, వాహనాల ఇంజిన్లకు నష్టం జరుగుతుందని, వారంటీ & ఇన్సూరెన్స్‌పై ప్రభావం ఉంటుందని ప్రచారం జరుగుతోందని పేర్కొంది. అయితే ఈ వాదనలకు శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేసింది. నియంత్రణ సంస్థల పర్యవేక్షణలో & అంతర్జాతీయ అనుభవాల ఆధారంగా ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని తెలిపింది.

ఇది కూడా చదవండి: టైర్‌పై 91, 94, XL అని ఎందుకు ఉంటుంది? టైర్ లోడ్ రేటింగ్ గురించి ప్రతి డ్రైవర్ తెలుసుకోవాల్సిన విషయాలు

భారత్ ఇప్పటికే 2025 డిసెంబర్‌లో పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని నిర్ణయించిన గడువు కంటే ముందుగానే సాధించింది. ఈ కార్యక్రమం వల్ల విదేశీ మారకద్రవ్యంలో రూ.1.9 లక్షల కోట్లకు పైగా ఆదా జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గడమే కాకుండా కార్బన్ ఉద్గారాలు కూడా తగ్గాయని తెలిపింది. మరోవైపు ఇథనాల్ తయారీకి అవసరమైన పంటలకు డిమాండ్ పెరగడంతో రైతులకు అదనపు ఆదాయ అవకాశాలు కూడా లభించాయని ప్రభుత్వం పేర్కొంది.

డీజిల్‌లో ఐసోబ్యూటనాల్ మిశ్రమం అమల్లోకి వస్తే దేశ ఇంధన భద్రత మరింత బలపడే అవకాశం ఉంది. విదేశీ చమురు దిగుమతుల భారం తగ్గడం, దేశీయ బయోఫ్యూయల్ పరిశ్రమకు ఊతం లభించడం & రైతులకు కొత్త మార్కెట్ అవకాశాలు ఏర్పడడం వంటి ప్రయోజనాలు కలగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రతిపాదనకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.