Upcoming Cheapest Scooter :భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ల మార్కెట్ చరిత్రలో 2026 అత్యంత కీలకమైనవిగా మారనున్నాయి. వినియోగదారులు EV స్కూటర్లపై నమ్మకం పెంచుకోవడంతో, తయారీ సంస్థలు కూడా పోటీపడి కొత్త ఉత్పత్తులను, సరికొత్త సాంకేతికతలతో, అనూహ్యమైన ధరల్లో తీసుకువస్తున్నాయి. భద్రతకు ప్రాధాన్యతనిస్తూ సుజుకీ, ఫీచర్ల హోరుతో అల్ట్రావయొలెట్,  బడ్జెట్ సెగ్మెంట్‌పై ఓలా దృష్టి సారించాయి. ఈ తీవ్రమైన పోటీలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు ఇప్పుడే కొనాలా, లేక రాబోయే సంచలనాత్మక మోడల్స్ కోసం వేచి చూడాలా అనే ప్రశ్నలకు సమాధానం చూద్దాం.  

Continues below advertisement

1. సుజుకీ eXS: భద్రతకు మొదటి స్థానం జాబితాలో మొదటి స్థానంలో ఉన్న సుజుకీ eXS అతి త్వరలో మార్కెట్‌లోకి రానుంది. సుజుకీ నుంచి వస్తున్న ఈ మోడల్ చాలా ఆసక్తికరమైన ఎంపిక కావచ్చు, దీనికి ప్రధాన కారణం: ఇందులో ఎల్‌ఎఫ్‌పీ (LFP) బ్యాటరీ వాడటం.

ప్రస్తుతం అగ్రగామి బ్రాండ్‌లు అన్నీ ఎన్‌ఎంసీ బ్యాటరీలను ఉపయోగిస్తుండగా, సుజుకీ eXSలోని ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ ఎక్కువ సురక్షితమైనది, మన్నికైనదిగా చెబుతున్నారు. ఇది వినియోగదారులలో ఉన్న భద్రతా ఆందోళనలను తగ్గించగలదు.

Continues below advertisement

సాంకేతిక వివరాలు -ధర:

• మోటారు: ఇందులో 4.1 kW గరిష్ట పీక్ పవర్ గల పీఎంఎస్‌ఎం మోటారు లభించనుంది.

• బ్యాటరీ: బ్యాటరీ సామర్థ్యం 3.07 kWh, ఇది దాదాపు 80 నుంచి 85 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది.

• ఫీచర్లు: ముందు వైపున డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, డిస్క్ బ్రేక్, వెనుక వైపున సింగిల్ స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్, డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి.

• డిస్‌ప్లే: ఇది బటన్లతో ఆపరేట్ చేయగల చిన్న టీఎఫ్‌టీ నాన్-టచ్ డిస్‌ప్లేతో వస్తుంది.

• ప్రత్యేకత: ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, కారు లాంటి ఫోబ్ కీ లభిస్తుంది (ఫిజికల్ కీ ఉండదు).

• ధర అంచనా: దీని ధర సుమారు ₹1 లక్షగా అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇది లక్ష రూపాయల కంటే తక్కువ ధరకు విడుదలైతే, ఇది మార్కెట్‌లో అద్భుతమైన డీల్‌గా మారుతుంది.

2. అల్ట్రావయొలెట్ Teaser Act: ఫీచర్ల సునామీ

అల్ట్రావయొలెట్ నుంచి వస్తున్న Teaser Act స్కూటర్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది మార్కెట్‌లో ఒక సంచలనం కాబోతోంది.

డిజైన్ : ఈ స్కూటర్ డిజైన్ ఒక యుద్ధ హెలికాప్టర్ స్ఫూర్తితో రూపొందించారు. ఈ డిజైన్ చాలా అద్భుతంగా, ఆకర్షణీయంగా ఉంది.

కార్-లెవెల్ ఫీచర్లు: ఇందులో లభించే ఫీచర్లు అగ్రశ్రేణి కార్లలో కూడా లభించని విధంగా ఉన్నాయి. ఫీచర్ల పరంగా ఈ స్కూటర్ టాప్ నాచ్ అని చెప్పవచ్చు:

  • • ఫ్రంట్ ,బ్యాక్ కెమెరా.
  • • రడార్ సిస్టమ్.
  • • బ్లైండ్ స్పాట్ డిటెక్షన్‌తో కూడిన స్మార్ట్ సైడ్ మిర్రర్‌లు.
  • • 7 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే.
  • • డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ (ABS).
  • • ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్, పార్క్ అసిస్ట్.
  • • హ్యాప్టిక్స్ (Haptics) ఫీచర్ ఉన్న హ్యాండిల్.
  • ఈ స్కూటర్‌లో ఫీచర్ లేని అంశం అంటూ ఏదీ లేదని చెప్పవచ్చు.
  • సాంకేతిక వివరాలు -ధర:
  • • మోటారు: ఇందులో 15 kW పీక్ పవర్ గల మోటారు ఉంటుంది.
  • • బ్యాటరీ ఆప్షన్స్: 3.5 kWh, 5 kWh, 6 kWh సామర్థ్యం గల మూడు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉంటాయి.
  • • ధర: మొదటి 50,000 బుకింగ్‌లకు ధర ₹1,20,000 గా నిర్ణయించారు, కానీ ఆ తర్వాత ధరను పెంచి ఇప్పుడు ₹1,45,000 చేశారు.
  • • లభ్యత: ఈ స్కూటర్ 2026 ప్రారంభంలో అందుబాటులోకి వస్తుంది.

3. యమహా-రివర్ భాగస్వామ్యం: ప్రీమియం ప్రయాణం

యమహా (Yamaha) నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతుండటం వినియోగదారులను ఎంతగానో ఆకర్షిస్తోంది. యమహా ఈ లాంచ్‌ను రివర్ కంపెనీతో కలిసి చేస్తోంది.

వ్యూహం: యమహా, రివర్ ఇండి స్కూటర్‌లో వాడిన అదే ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించనుంది. అయితే, స్కూటర్ డిజైన్,ట్యూనింగ్‌ను యమహా స్వయంగా చూసుకుంటుంది. స్పై షాట్స్‌లో ప్రస్తుతం ఇది పూర్తిగా కవర్‌తో ఉన్నప్పటికీ, దీని స్పెసిఫికేషన్లు రివర్ ఇండి స్కూటర్‌ను పోలి ఉండే అవకాశం ఉంది.

ధర అంచనా: ఈ స్కూటర్ ధర ప్రీమియం సైడ్లో ఉండనుంది. అంచనాల ప్రకారం, దీని ధర ₹1,50,000 చుట్టూ ఉండవచ్చు. బడ్జెట్ EV కోసం యమహా అభిమానులు ఇంకా వేచి ఉండాల్సి రావచ్చు, లేదంటే వేరే బ్రాండ్‌లకు మారాల్సి రావచ్చు.

4. బడ్జెట్ సెగ్మెంట్‌లో అగ్రగామి బ్రాండ్‌ల పోరు

అగ్రగామి బ్రాండ్‌లైన ఏథర్, బజాజ్ కూడా బడ్జెట్ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నాయి.

ఏథర్ బడ్జెట్ స్కూటర్ (EL ప్లాట్‌ఫామ్): ఇప్పటివరకు ఏథర్ (Ather) స్కూటర్లు ఒకే ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమయ్యాయి. దీనివల్ల వాటి ధరలు ప్రీమియంగా ఉండేవి. అయితే, ఏథర్ ఇప్పుడు ఈఎల్‌ (EL) ప్లాట్‌ఫామ్ అనే కొత్త, తక్కువ ఖర్చుతో కూడిన ప్లాట్‌ఫామ్‌ను రూపొందించింది. ఈ ప్లాట్‌ఫామ్‌లో స్టెయిన్‌లెస్ స్టీల్ వాడటం వల్ల తయారీ ఖర్చు బాగా తగ్గింది. ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడిన ఏథర్  మొదటి బడ్జెట్ స్కూటర్ 2026లో అందుబాటులోకి వస్తుంది. రిజ్టా వంటి నాణ్యమైన స్కూటర్లను అందించిన ఏథర్ బడ్జెట్ సెగ్మెంట్‌లోకి రావడం చాలా ఉత్సాహంగా ఉంది.

బజాజ్ చేతక్ : బజాజ్ చేతక్ (Bajaj Chetak) కూడా తన రేసులో దూసుకొస్తోంది. చేతక్ అతి తక్కువ ధర గల స్కూటర్ త్వరలో రానుంది. దీనికి సంబంధించిన స్పై షాట్స్ ఇప్పటికే లీక్ అయ్యాయి. ఈ స్కూటర్ డిసెంబర్ నాటికి విడుదల కావచ్చు.ప్రత్యేకతలు: స్పై షాట్స్‌లో చూసిన దాని ప్రకారం, ఈ కొత్త చేతక్ మోడల్ ఇప్పటివరకు వచ్చిన చేతక్ మోడళ్ల కంటే సన్నగా, తేలికగా ఉంది. ఇందులో హబ్ మోటార్ లభిస్తుంది. అయితే, ఇందులో కాస్ట్ కటింగ్ జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది, ముఖ్యంగా స్విచ్‌ల నాణ్యత పాత చేతక్‌ల కంటే తగ్గింది. కాబట్టి, ఈ స్కూటర్ చాలా తక్కువ ధరలో వస్తుందని భావించవచ్చు.

5. ఓలా G & Z: గిగ్ వర్కర్స్ కోసం అత్యంత చౌకైన EV

వినియోగదారులలో అత్యంత ఆదరణ పొందిన ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric), రెండు చాలా ఆసక్తికరమైన స్కూటర్లను లాంచ్ చేయబోతోంది: ఓలా జీ (Ola G),  ఓలా జెడ్ (Ola Z).

ఈ స్కూటర్లు ముఖ్యంగా గిగ్ వర్కర్స్ (Gig Workers), అంటే డెలివరీ బాయ్స్,  తక్కువ దూరం ప్రయాణించే వారిని లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ స్కూటర్ల ప్రత్యేకత ఏమిటంటే, ఇవి ఓలా నుంచి వస్తున్న మొట్టమొదటి రిమూవబుల్ బ్యాటరీ స్కూటర్లు. బ్యాటరీని సులభంగా తీసి ఛార్జ్ చేసుకోవడం, గిగ్ వర్కర్స్‌కు అపార్ట్‌మెంట్‌లలో నివసించే వారికి చాలా సౌకర్యంగా ఉంటుంది.

ధర : ఈ స్కూటర్ల ధర కేవలం ₹38,000 నుంచే ప్రారంభమవుతుంది. ఇంత తక్కువ ధరకు EV స్కూటర్ అందుబాటులోకి రావడం మార్కెట్‌లో అతి పెద్ద సంచలనం కానుంది. ఈ రెండు స్కూటర్లు కూడా జనవరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

6. టీవీఎస్ సైలెంట్ స్ట్రాటజీ

ఈ జాబితాలో టీవీఎస్ (TVS) వంటి పెద్ద బ్రాండ్ పేరు లేకపోవడం ఆశ్చర్యం కలిగించవచ్చు. ప్రస్తుతం టీవీఎస్ నుంచి కొత్త మోడల్ గురించి కచ్చితమైన సమాచారం ఏదీ లేనప్పటికీ, టీవీఎస్ త్వరలోనే తమ ఐక్యూబ్ (iQube) నెక్స్ట్‌ జనరేషన్ తీసుకురావచ్చని అంచనా. ఇందులో ప్రస్తుతం ఉన్న హబ్ మోటారు స్థానంలో పీఎంఎస్‌ఎం (PMSM) మోటారును ఇచ్చి, మరిన్ని మెరుగుదలలు చేయవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.

కొనుగోలుదారులు ఏం చేయాలి?

రాబోయే 2026 నాటికి భారతీయ EV స్కూటర్ మార్కెట్ పూర్తిగా మారిపోనుంది. సురక్షితమైన LFP బ్యాటరీలతో సుజుకీ, 15 kW పవర్‌, కార్-లెవెల్ ఫీచర్లతో అల్ట్రావయొలెట్, ఓలా నుంచి అత్యంత చౌకైన EVలు రాబోతున్నాయి. మీరు బడ్జెట్‌లో నాణ్యత, భద్రత కోరుకుంటే, సుజుకీ eXS కోసం వేచి ఉండటం మంచిది. మీరు టెక్నాలజీ, ఫీచర్లను కోరుకుంటే, 2026 వరకు అల్ట్రావయొలెట్ కోసం వేచి చూడండి. ముఖ్యంగా గిగ్ వర్కర్స్, తక్కువ ధర కోరుకునేవారు, జనవరిలో రాబోయే ఓలా G/Z స్కూటర్లను పరిశీలించవచ్చు.

ఈ కొత్త లాంచ్‌లు, ఫీచర్ అప్‌గ్రేడ్‌లు, తీవ్రమైన ధరల పోటీ కారణంగా, ఇప్పుడే EV స్కూటర్ కొనడం కంటే, 2026 ప్రారంభం వరకు వేచి ఉండటం తెలివైన నిర్ణయం అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అప్పటికి మార్కెట్‌లో బెస్ట్ మోడల్స్, మెరుగైన సాంకేతికతతో, సరసమైన ధరలతో అందుబాటులోకి వస్తాయి.