హ్యుండాయ్ మోటార్ ఇండియా మనదేశంలో కొత్త కారును లాంచ్ చేసింది. అదే హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కార్పొరేట్ ఎడిషన్. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఫైవ్-స్పీడ్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.6.28 లక్షలు కాగా, ఏఎంటీ వేరియంట్ ధర రూ.6.97 లక్షలుగా ఉంది. ఇవి రెండూ ఎక్స్-షోరూం ధరలే.


ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అందించారు. మాగ్నా ట్రిమ్ ఆధారంగా ఈ గ్రాండ్ ఐ10 నియోస్ కార్పొరేట్ ఎడిషన్‌ను రూపొందించారు. బ్లాక్ ఇంటీరియర్స్, రెడ్ కలర్ ఇన్‌సర్ట్స్ (సీట్లు, ఏసీ వెంట్లు, గేర్ బూట్) కూడా ఈ కారులో ఉన్నాయి. 6.75 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం ఇందులో ఉంది. స్మార్ట్ ఫోన్ మిర్రరింగ్ ద్వారా నావిగేషన్ కూడా చేయవచ్చు.


‘హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కారును దేశంలోని యువ వినియోగదారులకు తగ్గట్లు కస్టమైజ్ చేశాం. లాంచ్ అయిన నాటి నుంచి దీని సేల్స్ బాగున్నాయి. కాబట్టి ఇందులో స్పోర్టీ లుక్ ఉన్న హైటెక్ ఫోకస్డ్ కార్పొరేట్ ఎడిషన్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. నవతరం వినియోగదారులను ఇది ఆకట్టుకోనుంది.’ అని హ్యుండాయ్ మోటార్ ఇండియా డైరెక్టర్ తరుణ్ గర్గ్ తెలిపారు.