Hyundai Creta EV:భారతీయ రహదారులపై దూసుకెళ్లే మిడ్‌సైజ్‌ ఎస్‌యూవీ హ్యందాయ్‌ క్రెటా ఇప్పుడు భారీగా ధర తగ్గించింది. దీంతో సామాన్య వినియోగదారులకి కూడా అందుబాటులో ఉండేలా 10.99 లక్షల ప్రారంభ ధరతో సంచలనానికి తెరలేపింది. ఇప్పుడు ఈ ఈవీ పెట్రోల్‌ క్రెటా ధరతో దాదాపు సమానంగా ఉంది. 

Continues below advertisement

సాధారణంగా ఎలక్ట్రిక్ కార్ల ధరలు పెట్రోల్ కార్ల కంటే 40-50 శాతం ఎక్కువగా ఉంటాయి. దీనికి ప్రధాన కారణం కారులో ఉండే అత్యంత ఖరీదైన బ్యాటరీ ప్యాక్. కారు మొత్తం తయారీ ఖర్చులో దాదాపు 30-40 శాతం కేవలం బ్యాటరీ కోసమే వెచ్చించాల్సి ఉంటుంది. ఈ సవాలును అధిగమించడానికి హ్యుందాయ్‌ బ్యాటరీ యాజ్‌ ఎ సర్వీస్‌ అనే వినూత్న మోడల్‌ను ప్రవేశ పెట్టింది.

ఈ విధానంలో వినియోగదారుడు కారు కొనేటప్పుడు బ్యాటరీకి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం కారు బాడీకి మాత్రమే ధర చెల్లించి, బ్యాటరీని అద్దె ప్రాతిపదికన వినియోగించుకోవచ్చు. దీని వల్ల ప్రారంభ కొనుగోలు ఖర్చు దాదాపు 7 లక్షల వరకు తగ్గింది. వినియోగదారులు తాము ప్రయాణించే ప్రతి కిలోమీటర్‌కు కేవలం 3.9 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.      

Continues below advertisement

ఆఫీస్‌లకు లేదా వ్యాపారాల కోసం ప్రతి రోజూ కారు వాడే వారికి ఇది ఎంతో పొదుపైన మార్గం. ట్రాఫిక్‌లో ఇంధన ఖర్చు ఎక్కువగా ఉండే నగరవాసులకు ఎలక్ట్రిక్‌ మైలేజ్‌ ఎంత కలిసి వస్తుంది. క్యాబ్‌ సర్వీస్‌లు నడిపే వారికి ఈ కిలోమీటర్ ఆధారిత రెంట్‌ ప్లాన్ నిర్వహణ భారాన్ని తగ్గిస్తుంది. 

ముఖ్యంగా బ్యాటరీ పాడైపోతుందనే భయం లేదు, వారంటీ ముగుస్తుందన్న టెన్షన్ లేదు. రీప్లేస్‌మెంట్‌ ఖర్చు ఎంత అవుతుందనే ఆందోళన లేనేలేదు. ఎందుకంటే బ్యాటరీ బాధ్యత పూర్తిగా హ్యుందాయ్‌ కంపెనీయే చూసుకుంటుంది. 

తక్కువ ధరకే లభిస్తున్నప్పటికీ, పనితీరు విషయంలో హ్యుందాయ్‌ ఎక్కా తగ్గలేదు. క్రెటా ఈవీ రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది. షార్ట్ రేంజ్‌లో 42kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 133bhp పవర్‌ను అందిస్తూ నగర ప్రయాణాలకు అత్యంత అనువుగా ఉంటుంది. లాంగ్‌ రేంజ్‌ దూర ప్రయాణాలు చేసే వారి కోసం 51.4kWh లిక్విడ్‌ కూల్డ్‌ లిథియం- అయాన్ బ్యాటరీని అందించారు. ఇది 169bhp పవర్‌ను 255Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 

వేగం విషయంలోనూ ఇది అదరగొడుతోంది. లాంగ్ రేంజ్ వేరియంట్‌ కేవలం 7.9సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి పూర్తి ఛార్జింగ్‌ చేస్తే గరిష్టంగా 510కి.మి. వరకు ప్రయాణించవచ్చని సంస్థ స్పష్టం చేసింది. 

ఛార్జింగ్‌, లేటెస్ట్ టెక్నాలజీ

ఎలక్ట్రిక్‌ కారు కొనేవారి ప్రధాన ఆందోళన ఛార్జింగ్‌ సమయం. దీనికి పరిష్కారంగా హ్యుందాయ్‌ శక్తివంతమైన డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ ఇచ్చింది. దీని ద్వారా కేవలంం 39 నిమిషాల్లోనే పది శాతం నుంచి 80 శాతం వరకు బ్యాటరీని నింపవచ్చు. ఇంటి వద్ద ఛార్జింగ్‌ చేసుకునే వారి కోసం హెచ్‌సీ వేరియంట్‌తోపాటు 7.4 kW వాల్‌  బాక్స్‌ ఛార్జర్‌ను ఉచితంగా అందిస్తున్నారు.  డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేసేందుకు ఇందులో సింగిల్‌ పెడల్ డ్రైవ్‌ ఫీచర్‌  చేర్చారు. రీజెనరేటింగ్ బ్రేకింగ్ టెక్నాలజీతో పని చేసే ఈ ఫీచర్ వల్ల డ్రైవర్‌ కేవలం యాక్సిలరేటర్‌ పెడల్‌తోనే కారు వేగాన్ని నియంత్రించవచ్చు. ఇది ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే నగరాల్లో డ్రైవింగ్‌ అలసటను తగ్గిస్తుంది. 

లగ్జరీ ఫీచర్లు 

క్రెటా ఈవీ ఇంటీరియర్‌ ప్రీమియం లుక్‌తో ఆకట్టుకుంది. ఇందులో ఎండ కాలంలో సౌకర్యంగా ఉండేలా  వెంటిలేటెడ్‌ సీట్లు, బోస్‌ ఆడియో సిస్టమ్‌, వాయిస్ కమాండ్‌తో పని చేసే సన్‌రూఫ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ ద్వారా కారును ఆపరేట్ చేసే డిజిటల్‌ కీ సదుపాయాన్ని కూడా కల్పించారు. ఇందులో లెవల్‌ 2 అడాస్‌ టెక్నాలజీ ఉంది. దీనిలో 20 కంటే ఎక్కువ రకాల సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. వీటితోపాటు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఆల్‌వీల్‌ డిస్క్‌ బ్రేక్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్‌, రెయిన్‌- సెన్సిగ్‌ వైపర్లు సైడ్‌ ఫుట్‌ స్టెప్స్‌ ఫెసిలిటీ ఉంది.