Basara Gnana Saraswati Temple Silver Crown Recovered:  తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసర  జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో జరిగిన సంచలన దొంగతనం కేసును జిల్లా పోలీసులు అత్యంత చాకచక్యంగా, వేగవంతంగా ఛేదించారు. కేవలం 10 రోజుల్లోనే ఈ కేసును క్లోజ్ చేసి, భక్తులలో ఉన్న ఆందోళనను దూరం చేశారు. ఈ కేసులో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ అంతర్‌జిల్లా దొంగలతో పాటు, దొంగిలించిన సొత్తును దాచిపెట్టిన మరో రిసీవర్‌ను పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు. వారి నుంచి దొంగిలించిన అమ్మవారి వెండి కిరీటంతో పాటు సుమారు 1.48 కిలోల వెండి సొత్తును రికవరీ చేసినట్లు నిర్మల్ జిల్లా పోలీస్ యంత్రాంగం అధికారిక పత్రికా ప్రకటనలో వెల్లడించింది.

Continues below advertisement

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల జూన్ 22వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత గుంటూరు జిల్లాకు చెందిన పల్లపు ఏడుకొండలు, నిజామాబాద్ జిల్లాకు చెందిన గైని కిరణ్ అలియాస్ రామకృష్ణలు ఆలయ గోడదూకి లోపలికి చొరబడ్డారు. గర్భాలయ గేటు తాళాలు పగులగొట్టి అమ్మవారి వెండి కిరీటం, హుండీని దొంగిలించారు. అనంతరం హుండీలోని సుమారు రూ.16,000 నగదును తీసుకుని, వెండి కిరీటాన్ని రెండు భాగాలుగా విడదీశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆలయం వెనుక వైపు ఉన్న వ్యాస గుహ గుట్టల పైనుంచి పరారై, మరుసటి రోజు ఉదయం సామాన్య భక్తుల వలె రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడ నుంచి పారిపోయారు. దొంగిలించిన వెండి కిరీటాన్ని విక్రయించేందుకు నిజామాబాద్‌కు చెందిన కోడామ ఆనంద్ అనే వ్యక్తి సహాయంతో మహారాష్ట్రలోని నాందేడ్‌కు తరలిస్తుండగా పోలీసులు పక్కా స్కెచ్ వేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు కాచిగూడ–నాగర్సోల్ రైలులో ప్రయాణిస్తున్న ముగ్గురు నిందితులను బాసర రైల్వే స్టేషన్ వద్ద సీసీఎస్, లోకల్ పోలీసులు ఉమ్మడిగా దాడి చేసి గురువారం అదుపులోకి తీసుకున్నారు.  ఈ నిందితుల హిస్టరీని పరిశీలిస్తే వీరు వృత్తిపరమైన ప్రమాదకర దొంగలుగా తేలింది. రైల్వే రవాణా సౌకర్యం సులభంగా ఉన్న ప్రాంతాల్లోని దేవాలయాలనే వీరు టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరిలో ఎ1 నిందితుడు పల్లపు ఏడుకొండలుపై గతంలో వివిధ పోలీస్ స్టేషన్లలో సుమారు 25 దొంగతనం కేసులు ఉండగా, ఎ2 నిందితుడు గైని కిరణ్‌పై 20 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దొంగిలించిన వెండిని కొనుగోలు చేసేందుకు అంగీకరించి, సహాయం చేసినందుకు మహారాష్ట్ర సోలాపూర్‌కు చెందిన కోడామ ఆనంద్‌ను కూడా పోలీసులు మూడో నిందితుడిగా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 1 కిలో 220 గ్రాముల వెండి కిరీటం, 260 గ్రాముల వెండి పట్టీతో పాటు ఒక స్మార్ట్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

నేరం జరిగిన వెంటనే అలర్ట్ అయిన నిర్మల్ జిల్లా పోలీసులు.. దర్యాప్తును వేగవంతం చేసేందుకు ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నాందేడ్, ధర్మాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.   ఆలయాల భద్రత విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేస్తూ, ప్రతిభ కనబరిచిన అధికారులకు, కానిస్టేబుళ్లకు ఎస్పీ రివార్డులను ప్రకటించారు. 

Continues below advertisement