Rooftop Daredevils Engagement Viral Video:  ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎత్తైన భవనాలు, స్కైస్క్రాపర్‌లను ఎలాంటి రక్షణ పరికరాలు  లేకుండా ఎక్కుతూ, మృత్యువుతో చెలగాటమాడే రష్యన్  రూఫ్‌టాపర్స్  జంట ఏంజెలా నికోలావ్, ఇవాన్ బీర్కస్ మరోసారి అంతర్జాతీయంగా సంచలనం సృష్టించారు. ఎప్పుడూ సోషల్ మీడియాను షేక్ చేసే ఈ  రష్యన్ డెవిల్స్  జంట, ఈసారి అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన, 1,454 అడుగుల ఎత్తు గల చారిత్రాత్మక  ఎంపైర్ స్టేట్ బిల్డింగ్  ను ఎంచుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే ఈ మహానగర చిహ్నం  యాంటెన్నా కొనకు వీరు ఎవరికీ తెలియకుండా, అనధికారికంగా చేరుకుని ప్రపంచాన్ని అవాక్కయ్యేలా చేశారు.

Continues below advertisement

అయితే, ఈసారి వీరు అంతటి ప్రమాదకరమైన సాహసం చేయడం వెనుక కేవలం వ్యూస్ కోసమో, లైకుల కోసమో కాదు.. వారి జీవితకాలపు ప్రేమను ఒక మధుర జ్ఞాపకంగా మార్చుకోవాలనే ఒక అద్భుతమైన కారణం దాగి ఉంది. భవనం అత్యంత ఎత్తైన యాంటెన్నా భాగానికి చేరుకున్న ఈ జంట, అక్కడ ఒక ప్రత్యేకమైన బ్యానర్‌ను ప్రదర్శించారు. అంతులేని ఎత్తులో, వీచే బలమైన గాలుల మధ్య ఆ బ్యానర్ ప్రదర్శించిన కాసేపటికే, వారు యాంటెన్నా నుండి కొద్దిగా కిందికి దిగి ఒక సురక్షితమైన ప్లాట్‌ఫారమ్‌పైకి వచ్చారు. అక్కడ న్యూయార్క్ నగరం మొత్తం కంటికి కనిపించే వేళ.. ఇవాన్ బీర్కస్ తన మోకాళ్లపై కూర్చుని అత్యంత రోమాంచితమైన రీతిలో ఏంజెలాకు వివాహ ప్రతిపాదన   చేశాడు.  ఊహించని ఈ సర్‌ప్రైజ్‌కు ఏంజెలా ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఆకాశమే సాక్షిగా ఇవాన్ చేసిన ప్రపోజల్‌ను ఆమె వెంటనే అంగీకరించింది. ఆ తర్వాత ఇద్దరూ ఒక్కటైన ఆనందంలో కౌగిలించుకుని ముద్దులు పెట్టుకున్నారు. న్యూయార్క్ సిటీ బ్యాక్‌డ్రాప్‌తో తన నిశ్చితార్థపు ఉంగరాన్ని  చూపిస్తూ ఏంజెలా పోస్ట్ చేసిన సెల్ఫీలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.  

ఈ అద్భుతమైన విజువల్స్ నెట్‌లో వైరల్ అయినప్పటికీ, అమెరికన్ చట్టాలు , న్యూయార్క్ పోలీసులు మాత్రం ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ వంటి హై-సెక్యూరిటీ జోన్‌లోకి అనుమతి లేకుండా ప్రవేశించడం చట్టప్రకారం నేరం. గతంలోనూ ఇలాంటి సాహసాలు చేసినందుకు ఈ జంట పలు దేశాలలో జైలు శిక్షలు, జరిమానాలు ఎదుర్కొంది. ఇప్పుడు అమెరికాలోనూ వీరిపై అక్రమ ప్రవేశం, ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేయడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

న్యూయార్క్ చట్టాల ప్రకారం, ఇలాంటి నేరాలకు భారీగా జరిమానాతో పాటు కొన్ని నెలల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంతేకాకుండా, భవిష్యత్తులో వీరు అమెరికా రాకుండా  డిపోర్టేషన్,  వీసా రద్దు వంటి కఠిన శిక్షలు కూడా విధించవచ్చు. ఏది ఏమైనప్పటికీ, చట్టపరమైన చిక్కులు, పోలీసుల శిక్షలు ఎలా ఉన్నా.. మృత్యువు అంచున నిలబడి వీరు పండించిన ఈ సరికొత్త ప్రేమకథ మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. చట్టాలను ఉల్లంఘించడాన్ని తప్పుబడుతూనే, వారి అసాధారణ ప్రేమాభిమానాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.