Renault Kwid Down Payment, Car Loan, EMI Details: ఏం పని చేసినా.. ఎంత ఖర్చవుతుంది, ఎంత మిగులుతుంది అని లెక్కలు వేసుకోవడం భారతీయుల అలవాటు. కార్‌ కొనే విషయంలోనూ ఇదే చూస్తారు. అందుకే, మన దగ్గర చవక ధర & అధిక మైలేజ్ వాహనాలకు డిమాండ్ ఎక్కువ. ఇప్పుడు రోడ్లపై తిరిగే బండ్లలో మెజారిటీ వాహనాలు ఆ తరహాలోనే ఉంటాయి. తక్కువ ధరకు ఎక్కువ ఫీచర్లు, బెటర్‌ మైలేజ్ ఉన్న కార్లను మన వాళ్లు ఇష్టపడతారు. అయినప్పటికీ, తక్కువ జీతం లేదా తక్కువ ఆదాయం కారణంగా బడ్జెట్ సరిపోక ఇప్పటికీ చాలా మంది ప్రజలు కారు కొనలేకపోతున్నారు. విశేషం ఏమిటంటే, రూ. 30,000 నెలవారీ జీతం లేదా ఆదాయం ఉన్నవాళ్లు కూడా కారును సులభంగా కొనుగోలు చేయవచ్చు. కేవలం లక్ష రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ క్విడ్ కారును మీ ఇంటి ముందు పార్క్ చేయవచ్చు.

రెనాల్ట్ క్విడ్ ఫైనాన్స్ ప్లాన్

దిల్లీలో, రెనాల్ట్ క్విడ్ బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర (Renault Kwid Ex-showroom Price) రూ. 4.70 లక్షలు. అదే నగరంలో ఆన్-రోడ్ ధర ‍‌(Renault Kwid X On-Road Price) దాదాపు రూ. 5.24 లక్షలు. మీరు తెలుగు రాష్ట్రాల్లో నివశిస్తుంటే, ఈ ధర కాస్త అటుఇటుగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ కారును కేవలం రూ. లక్ష డౌన్ పేమెంట్ చెల్లించి కొనుగోలు చేయవచ్చు. అంటే.. డౌన్‌ పేమెంట్‌ రూ.లక్ష పోను మీకు బ్యాంకు నుంచి రూ. 4.24 లక్షల రుణం లభిస్తుంది.

బ్యాంక్‌ మీ కార్‌ లోన్‌ మీద 9 శాతం వడ్డీ వేసిందనుకుందాం. మీరు ఈ రుణాన్ని 5 సంవత్సరాల కాలానికి తీసుకుంటే, 9 శాతం వడ్డీ రేటుతో, ప్రతి నెలా రూ. 8,802  EMI చెల్లించాలి. ఈ విధంగా, ఐదేళ్లలో (60 నెలలు) మొత్తం రూ. 1,04,093 వడ్డీ చెల్లించాలి. ఈ వడ్డీ + అసలు కలిపి రూ. 5,28,093 అవుతుంది.

మీరు 6 సంవత్సరాల కాలానికి లోన్‌ తీసుకుంటే, 9 శాతం వడ్డీ రేటుతో, ప్రతి నెలా రూ. 7,643 EMI చెల్లించాలి. ఈ విధంగా, ఆరేళ్లలో (72 నెలలు) మొత్తం రూ. 1,26,284 వడ్డీ చెల్లించాలి. ఈ వడ్డీ + అసలు కలిపి రూ. 5,50,284 అవుతుంది.

మీరు 7 సంవత్సరాల కాలానికి లోన్‌ తీసుకుంటే, 9 శాతం వడ్డీ రేటుతో, ప్రతి నెలా రూ. 6,822 EMI చెల్లించాలి. ఈ విధంగా, ఏడేళ్లలో (84 నెలలు) మొత్తం రూ. 1,49,029 వడ్డీ చెల్లించాలి. ఈ వడ్డీ + అసలు కలిపి రూ. 5,73,029 అవుతుంది.

EMI కాస్త ఎక్కువైనా పర్లేదు, 4 సంవత్సరాల్లోనే అప్పు మొత్తం తీర్చాలని మీరు భావిస్తే, 9 శాతం వడ్డీ రేటుతో, ప్రతి నెలా రూ. 10,551 EMI చెల్లించాలి. ఈ విధంగా, నాలుగేళ్లలో (48 నెలలు) మొత్తం రూ. 82,460 వడ్డీ చెల్లించాలి. ఈ వడ్డీ + అసలు కలిపి రూ. 5,06,460 మాత్రమే అవుతుంది.

రెనాల్ట్ క్విడ్ స్పెసిఫికేషన్లు & ఇంజిన్ కెపాసిటీ

రెనాల్ట్ క్విడ్ 1.0 RXE వేరియంట్‌లో కంపెనీ 999 cc ఇంజిన్‌ అందించింది. ఈ ఇంజన్ గరిష్టంగా 67 bhp పవర్‌ను, 9 Nm గరిష్ట టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ ఇందులో ఉంది. కంపెనీ వెల్లడించిన ప్రకారం, ఈ కారు లీటరుకు దాదాపు 21 కి.మీ. మైలేజీని అందిస్తుంది. దీనికి 28 లీటర్ల ఇంధన ట్యాంక్ కూడా ఉంది. ఈ లెక్కన, ఒక్కసారి ట్యాంక్‌ ఫుల్‌ చేస్తే మీరు 588 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు.

ఫీచర్ల విషయానికి వస్తే... రెనాల్ట్ క్విడ్‌లో పవర్ స్టీరింగ్, లేన్ ఛేంజ్ ఇండికేటర్, టాకోమీటర్, రియర్ స్పాయిలర్, LED DRL, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, చైల్డ్ సేఫ్టీ లాక్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ వంటి సూపర్‌ ఫీచర్లను యాడ్‌ చేశారు. ఈ కారు మారుతి సుజుకి Alto K10కి ఇది పోటీ ఇస్తుంది.