Honda CB500X Offer: హోండా సీబీ500ఎక్స్ బైక్ మనదేశంలో గతేడాది లాంచ్ అయింది. అయితే ఈ బైక్ సేల్స్ కంపెనీ ఆశించనంతగా లేవు. గత నెలలో దీనికి సంబంధించి కేవలం 18 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. 2021 ఏప్రిల్ నుంచి 2022 జనవరి వరకు కేవలం 73 యూనిట్లు మాత్రమే అమ్ముడయినట్లు తెలుస్తోంది.


ఈ బైక్ మనదేశంలో గతేడాది మార్చిలో లాంచ్ అయింది. అయితే అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో ఇప్పుడు ఈ బైక్ ధరను కంపెనీ భారీగా తగ్గించింది. రూ.6,87,386 నుంచి రూ.5,79,952కు ఈ బైక్ ధర తగ్గింది. సరిగ్గా చెప్పాలంటే రూ.1,07,434 తగ్గింపును ఈ మిడిల్‌వెయిట్ అడ్వెంచర్ బైక్‌పై అందించారు. దీంతో ఇప్పటికైనా ఈ బైక్ సేల్స్ పెరుగుతాయని కంపెనీ ఆశిస్తుంది.


ప్రస్తుతం అందుబాటులో ఉన్న అడ్వెంచర్ బైకులు కవాసకీ వెర్సిస్ 650, సుజుకీ వీ-స్టార్మ్ 650 ఎక్స్‌టీల కంటే దీని ధర తక్కువగా ఉంది. కవాసకీ వెర్సిస్ ధర రూ.7.15 లక్షలు కాగా... సుజుకీ వీ-స్టార్మ్ ధర రూ.8.84 లక్షలుగా ఉంది. ఇవన్నీ ఎక్స్-షోరూం ధరలే.


ఈ బైక్‌పై అందించిన తగ్గింపు తాత్కాలికమే అన్నది గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ బైక్ కొనాలంటే దానికి సరైన సమయం ఇదే. హోండా సీబీ500ఎక్స్ చూడటానికి ఆఫ్ రోడ్ బైక్‌లా ఉంటుంది కానీ.. ఇది మంచి అడ్వెంచర్ బైక్. దీని సీట్ హైట్ 830 మిల్లీమీటర్లు కాగా.. వెనకవైపు ఫుట్ పెగ్స్ కూడా ఉన్నాయి. హ్యాండిల్ బార్ కొంచెం పొడుగ్గా ఉంటుంది కానీ... బ్యాలెన్స్ చేయడానికి ఇది సరిగ్గా సరిపోతుంది.


ఇందులో 471సీసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్‌ను అందించారు. 8500 ఆర్‌పీఎం వద్ద 47 బీహెచ్‌పీని, 6,500 ఆర్‌పీఎం వద్ద 43 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఈ ఇంజిన్ అందిస్తుంది. ఇందులో స్లిప్పర్ క్లచ్ ఉన్న సిక్స్-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌ను అందించారు. ఇందులో ముందువైపు 310 మిల్లీమీటర్ల, వెనకవైపు 240 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేకులను అందించారు. ఇందులో డ్యూయల్ చానెల్ యాబ్స్ కూడా ఉన్నాయి.