Pawan Kalyan Fan In Jagtial: ప్రతి చిన్న విషయాలకు చిన్నారులు సీరియస్‌గా రియాక్ట్ అవుతున్నారు. తమకు కావాల్సింది దక్కలేదని క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాలో అవతలి వారి ప్రాణాల మీదకి తెస్తున్నారు. కొన్ని సందర్భాలలో సూసైడ్ చేసుకుని కన్న వారికి కడుపుకోత మిగుల్చుతున్నారు. తాజాగా జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సినిమా టికెట్ బుక్ చేసుకునేందుకు తన చేతిలో డబ్బులు లేకపోవడంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆ వివరాలిలా ఉన్నాయి.. జగిత్యాలలోని పురానీపేటలో ఓ స్కూల్లో నవదీప్ చదువుకుంటున్నాడు. ఆ విద్యార్థి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. పవన్ సినిమా వచ్చిందంటే చాలు కచ్చితంగా చూస్తాడు. భీమ్లా నాయక్ సినిమా (Bheemla Nayak Movie Ticket) కోసం తన మిత్రులు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారని తనకి కూడా 300 రూపాయలు కావాలని ఓ విద్యార్థి తన తండ్రిని అడిగాడు. డబ్బులు ఇవ్వడానికి తండ్రి నిరాకరించడంతో నవదీప్ (11) అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భీమ్లా నాయక్ సినిమా టికెట్‌కు తండ్రి డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్తాపానికి లోనైన విద్యార్థి గదిలోకి వెళ్లి తాడుతో ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. కొడుకు ఇలా చేస్తాడనుకోలేదంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
డబ్బులు తర్వాత సర్దుతా అని చెప్పాను..
కూలీ పని చేస్తేగానీ నర్సయ్యకు ఇల్లు గడవదు. అయినా కుమారుడు నవదీప్‌ను చదివిస్తూ అతడ్ని ప్రయోజనకుడ్ని చేయాలని ఎన్నో కలలు కన్నాడు ఆ తండ్రి. అయతే నాన్న నాకు రూ.300 కావాలి అని నర్సయ్యను అడిగాడు నవదీప్. అంత డబ్బు ఎందుకు, ఇప్పుడు తనకు సర్దుబాటు కావని, తరువాత ఇస్తానని చెప్పాడు. ఫ్రెండ్‌కు రూ.150 ఇవ్వాలని, మరో 150 రూపాయలతో సినిమా టికెట్ బుకింగ్ చేసుకోవాలని తండ్రికి చెప్పాడు. ఫ్రెండ్స్ అప్పటికే టికెట్ బుక్ చేసుకున్నారని, ఎలాగైన తనకు మనీ ఇవ్వాలని అడిగితే, ఇప్పుడైతే తన వల్ల కాదని కుమారుడికి నర్సయ్య చెప్పాడు. నువ్వు అడిగితే ఎప్పుడు పైసలు ఇచ్చావ్ అంటూ గదిలోకి కోపంగా వెళ్లిపోయాడు. బయటకు వస్తలేడని భయంతో డోర్ కొట్టగా లాభం లేకపోయింది. తలుపులు బద్దలుకొట్టి చూసేసరికి అప్పటికే ఉరివేసుకుని కుమారుడు చనిపోయి కనిపంచాడని బాధగా చెప్పాడు.
తనతో ఉంటే పిల్లాడికి కచ్చితంగా డబ్బులు ఇచ్చేవాడినని, కానీ కూలీ చేస్తే తప్ప కుటుంబం గడవదని నవదీప్ తండ్రి నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. తరువాత డబ్బులు ఇస్తానని చెబితే కోప్పాడ్డాడు అనుకున్నాను కానీ, ఇంతపని చేస్తాడని ఊహించలేకపోయాను. ఎదిగి ప్రయోజకుడు అవుతాడనుకుంటే, అప్పుడే ఊపిరి తీసుకున్నాడంటూ రోదించాడు.