మార్కెట్ లో రోజు రోజుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో.. వాహన తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటికే పలు టూ వీలర్ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకురాగా.. తాజాగా ఈ విభాగంలోకి అడుగు పెడుతున్నది హీరో మోటోకార్ప్. ఈ కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని రేపు(అక్టోబర్ 7న) విడుదల చేయనుంది. హీరో కంపెనీ తన సబ్ బ్రాండ్ అయిన విడా నుంచి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాబోతుంది.
గతేడాది ఆగస్టులో ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రదర్శన
హీరో మోటోకార్ప్ గత ఏడాది ఆగస్టులో టీజర్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రదర్శించింది. ఈ ఎలక్ట్రిక్ వాహనం మాస్ మార్కెట్ ను భర్తీ చేసే అవకాశం ఉంది. బ్రాండ్ తో పాటు ధరను దాని సామాన్యులకు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ భద్రత, రేంజ్‌పై స్పెషల్ ఫోక్ పెడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న ఇ-స్కూటర్లతో పోల్చితే అన్ని అంశాల్లో ఈ ద్విచక్ర వాహనం మెరుగైన లక్షణాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ధర రూ.1 లక్ష ఉండే అవకాశం!
హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ చమత్కారమైన బాడీ వర్క్‌తో బాక్సీగా కనిపించనుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన ఇతర వివరాలతో పాటు స్పెసిఫికేషన్లను కంపెనీ బయటకు వెల్లడించలేదు. ఈ స్కూటర్ చక్కటి బ్యాటరీ ప్యాక్ తో రాబోతున్నట్లు తెలుస్తోంద. మంచి పరిధిని కూడా ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇక హీరో విడా స్కూటర్ ధర విషయానికి వస్తే.. దాదాపు రూ. 1 లక్ష ఉండనున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ధరతో మాస్ మార్కెట్ ఉత్పత్తిగా ప్లేస్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. హీరో కంపెనీకి ఉన్న భారీ డీలర్ నెట్‌వర్క్.. ఈ స్కూటర్ కు కలిసి వచ్చే అవకాశం ఉంది. కస్టమర్ల స్పందనతో పాటు అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఎలక్ట్రిక్ స్కూటర్ ను తొలుత పరిమిత నగరాల్లో అందుబాటులో ఉంచనుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ TVS iQube, Bajaj Chetak, ఏథర్ 450X, Ola S1 వంటి టూవీలర్స్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
భారత్ పెట్రోలియంతో జతకట్టిన హీరో మోటోకార్ప్
హీరో కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు దేశ వ్యాప్తంగా ఫాస్ట్ ఛార్జింగ్, బ్యాటరీ మార్పిడి స్టేషన్లను ఏర్పాటు చేయబోతోంది. ఇందుకు భారత్ పెట్రోలియంతో హీరో మోటోకార్ప్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. త్వరలోనే ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణాన్ని మొదలుపెట్టబోతున్నది.