భారత్‌లోని టూవీలర్ మార్కెట్ ప్రపంచంలోనే అతిపెద్దది. సెప్టెంబర్ 2025లో ఇందులో అద్భుతమైన వృద్ధి కనిపించింది. GST 2.0 సంస్కరణలు, పండుగల సీజన్ ప్రారంభం కారణంగా మొత్తం అమ్మకాల్లో 10-15% వరకు పెరుగుదల కనిపించింది. ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వాటా నిరంతరం పెరుగుతోంది. టాప్ బ్రాండ్లు Hero MotoCorp, హోండా, TVS, Bajaj, Royal Enfield సేల్స్‌లో సత్తా చాటాయి. అదే సమయంలో Royal Enfield మొదటిసారిగా Suzuki ని అధిగమించి టాప్ 5 లో చోటు దక్కించుకుంది.
టాప్‌లో దూసుకెళ్తున్న Splendor
భారత మార్కెట్లో వరుసగా 24 సంవత్సరాలుగా నంబర్ వన్ స్థానంలో ఉన్న Hero MotoCorp సెప్టెంబర్ నెలలో కూడా తన హవాను కొనసాగించింది. కంపెనీ ఈ నెలలో మొత్తం 6,47,582 యూనిట్ల దేశీయ విక్రయాలను నమోదు చేసింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 5% వృద్ధి సాధించింది. ఎగుమతులను కలిపి మొత్తం అమ్మకాలు 6,87,220 యూనిట్లకు చేరాయి. ఇందుకు అతిపెద్ద కారణం Hero Splendor Plus, దీని 2.5 లక్షలకు పైగా యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఇందులో 97.2cc ఇంజిన్ ఉండగాా, 80–85 kmpl మైలేజీ ఇస్తుంది. రూ. 73,764 ప్రారంభ ధరతో ఈ బైక్ తక్కువ మెయింటనెన్స్, స్ట్రాంగ్ బాడీతో గ్రామీణ ప్రాంతాలవారు, రోజువారీ పనులకు ఈ బైక్ ఫస్ట్ ఛాయిస్ గా ఉంది.
Honda టూవీలర్స్
Honda Two-Wheelers ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉంది. ఇది కూడా సెప్టెంబర్ నెలలో అద్భుతమైన విక్రయాలతో ఆకట్టుకుంది. హోండా సెప్టెంబర్ 2025లో 5,05,693 యూనిట్ల దేశీయ విక్రయాలను నమోదు చేసింది. హోండా 5.1% వృద్ధిని నమోదు చేసింది. ఎగుమతులను కలిపి మొత్తం అమ్మకాలు 5,68,164 యూనిట్లకు చేరాయి. Honda ప్రధానంగా స్కూటర్లపై ఫోకస్ చేసింది. మొత్తం అమ్మకాల్లో దాదాపు 60% వాటా కలిగి ఉంది. FY26 మొదటి రెండు త్రైమాసికాల్లో కంపెనీ 29.91 లక్షల యూనిట్లను విక్రయించి మార్కెట్లో తన వాటాను పెంచుకుంటుంది.
టీవీఎస్ మోటార్ (TVS Motor)
మూడవ స్థానంలో ఉన్న TVS Motor Company ఈ ఏడాది సంచలనం సృష్టించింది. దేశీయ విక్రయాలు 4,13,279 యూనిట్లుగా ఉన్నాయి. అంటే ఈ ఏడాది సంస్థ 12% వృద్ధి నమోదు చేసింది. FY26 రెండవ త్రైమాసికంలో TVS 15.07 లక్షల యూనిట్లను విక్రయించి ఇప్పటివరకు తన అత్యుత్తమ త్రైమాసికాన్ని నమోదు చేసింది. TVS పోర్ట్‌ఫోలియో చాలా సమతుల్యంగా ఉంది. టీవీఎస్ కంపెనీ బైక్‌లు, స్కూటర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు మూడింటిలోనూ అద్భుతమైన పనితీరు కనబరిచింది. ఎగుమతుల్లో కూడా కంపెనీ 30% వృద్ధిని నమోదు చేసింది.
బజాజ్ ఆటో (Bajaj Auto)
సెప్టెంబర్ నెలలో అత్యధిక విక్రయాల జాబితాలో 4వ స్థానంలో ఉన్న Bajaj Auto దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. బజాజ్ దేశీయ విక్రయాలు 2,73,188 యూనిట్లుగా ఉండగా, మొత్తం అమ్మకాలు 5,10,504 యూనిట్లకు చేరుకున్నాయి. ఎగుమతుల్లో బజాజ్ కంపెనీ 12% వార్షిక వృద్ధిని సాధించి మొత్తం 1,57,665 యూనిట్లను పంపింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield)
గత నెలలో విక్రయాలలో ఐదవ స్థానంలో ఉన్న Royal Enfield సెప్టెంబర్ 2025లో చరిత్ర సృష్టించింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ దేశీయ విక్రయాలు 1,13,573 యూనిట్లుగా ఉన్నాయి, ఇది 43% వృద్ధి నమోదు చేయడం విశేషం. మొత్తం అమ్మకాలు 1,24,328 యూనిట్లకు పెరిగాయి. ఇది ఇప్పటివరకు Royal Enfield నెలవారీ అతిపెద్ద రికార్డు. GST కోత, పండుగల సీజన్ డిమాండ్ పెరగడం Royal Enfield అమ్మకాలను భారీగా పెంచింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు Suzuki ని అధిగమించి దేశంలోని టాప్ 5 ద్విచక్ర వాహన కంపెనీలలో చేరింది, ఇది బ్రాండ్ అతిగొప్ప విజయంగా చెప్పవచ్చు.