Upcoming Budget Mileage Bikes: తక్కువ నిర్వహణ ఖర్చు, లో బడ్జెట్‌లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్‌ కోసం చూస్తున్న వాళ్లకు గుడ్ న్యూస్. త్వరలోనే హీరో, హోడా సంస్థలు మూడు రేసు గుర్రాల్లాంటి బైక్‌లను మార్కెట్‌లోకి విడుదల చేయబోతున్నాయి. ఈ నెలలోనే వీటిని విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇంతకీ ఆ బైక్‌ల గొప్పతనం ఏంటీ? వాటి ఫీచర్స్‌ మిగతా డిజైన్ వివరాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

హోండా, హీరో మోటోకార్ప్ భారత్‌లోనే అతి పెద్ద మోటార్ కార్పొరేషన్లు, త్వరలో కమ్యూటర్ విభాగంలో మూడు కొత్త బడ్జెట్ బైక్‌లను విడుదల చేస్తున్నాయి. ఈ బైక్‌ల ఇంజిన్ 125cc కంటే తక్కువగా ఉంటుంది. కానీ వాటిలో లభించే ఫీచర్లు, లుక్, టెక్నాలజీ మాత్రం ప్రీమియం మాదిరిగా వేరే లెవల్‌లో ఉంటాయి.  

హోండా CB125 హార్నెట్

హోండా నుంచి వస్తోన్న CB125 హార్నెట్ యువతను అమితంగా ఆకట్టుకోనుంది. ఈ బైక్‌ స్టైల్,  టెక్నాలజీ రెండింటిలో ది బెస్ట్ అనిపించుకుంటుంది. వారిని దృష్టిలో పెట్టుకొనే ఈ బైక్‌ను డిజైన్ చేశారు. ఈ బైక్‌లో 123.94cc సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 10.99 bhp పవర్ అండ్‌ 11.2Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కూడా వస్తుంది. దీని లుక్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఫీచర్ల గురించి చెప్పాలంటే, దీనికి 4.2-అంగుళాల TFT డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, USB-C ఛార్జింగ్ పోర్ట్, ఫ్రంట్ USD ఫోర్కులు , రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. హోండా CB125 హార్నెట్ ఇవాళే(1 ఆగస్టు , 2025) లాంచ్ అవుతుంది. దాని బుకింగ్ కూడా ఇవాల్టి నుంచే ప్రారంభమవుతుంది.

హోండా షైన్ 100 DX

మైలేజీని అన్నింటికంటే మించి ఉంచి ఇప్పుడు ప్రీమియం లుక్  అండ్‌ ఫీల్‌ను కోరుకునే వారి కోసం డిజైన్ చేసిందే హోండా షైన్ 100 DX. ఈ బైక్ షైన్ 100  అప్‌గ్రేడ్ వెర్షన్. ఇది 98.98cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 7.28 bhp పవర్ ,8.04Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 4-స్పీడ్ గేర్‌బాక్స్ లభిస్తుంది. కొత్త మోడల్‌లో, కంపెనీ వైడ్ ఫ్యూయల్ ట్యాంక్, కొత్త బాడీ గ్రాఫిక్స్, క్రోమ్ హెడ్‌లైట్ కౌల్ ,LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అనేక ముఖ్యమైన అప్‌గ్రేడ్‌లను చేసింది. హోండా షైన్ 100 DX కోసం బుకింగ్ కూడా ఇవాళ్టి (ఆగస్టు 1, 2025) నుంచి ప్రారంభమవుతుంది.

హీరో గ్లామర్ 125

హీరో మోటోకార్ప్ కూడా ఈ పోటీలో తగ్గేదేలే అన్నట్టు దూసుకొస్తోంది. పాత గ్లామర్ బండికి కొత్త గ్లామర్ అద్ది రోడ్డుపైకి తీసుకొస్తోంది. గ్లామర్ 125ని మరింత మోడ్రన్‌ లుక్‌లో తీసుకువస్తోంది. ఇది క్రూయిజ్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్‌లను పొందిన భారతదేశపు మొట్టమొదటి కమ్యూటర్ బైక్ అవుతుంది. ఇది 124.7cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 10.7 bhp శక్తిని, 10.6Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో అందుబాటులో ఉన్న ఫీచర్లు కూడా చాలా బాగున్నాయి . పూర్తిగా డిజిటల్ LCD డిస్ప్లే, అప్‌డేట్ చేసిన స్విచ్‌గేర్ , USB ఛార్జింగ్ సాకెట్ వంటివి. గ్లామర్ 125 పరీక్ష సమయంలో కనిపించింది. రాబోయే కొన్ని నెలల్లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. మీరు ప్రస్తుతం కొత్త బైక్ కొనాలని ఆలోచిస్తుంటే, కొంచెం వేచి ఉండటం మీ జేబుకు ప్రయోజనకరంగా ఉంటుంది.