Vehicle Fitness Test Fees India 2025: దేశవ్యాప్తంగా వాహనాల ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఫీజులను భారీగా పెంచినట్లు కేంద్ర రహదారి రవాణా & జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ప్రకటించింది. మన దేశంలో ఇప్పటి వరకు 15 ఏళ్లు పైబడిన వాహనాలకే ఎక్కువ ఫీజులు అమల్లో ఉండేవి. కానీ కొత్త Central Motor Vehicle Rules (Fifth Amendment) ప్రకారం.... 10-15 ఏళ్ల వయస్సు, 15-20 ఏళ్ల వయస్సు & 20+ ఏళ్ల వయసు కేటగిరీలకు వేర్వేరు రేట్లు విధించారు. వాహనం వయస్సు పెరుగుతున్న కొద్దీ ఫీజులు కూడా పెరిగే విధంగా పూర్తిగా కొత్త నిర్మాణాన్ని తీసుకువచ్చారు.

Continues below advertisement


10 ఏళ్లు దాటిన వాహనాలపై కొత్త భారం
ఇప్పటి నుంచి 10 ఏళ్లు పైబడిన ఏ వాహనమైనా ఎక్కువ ఫీజులు చెల్లించాల్సిందే. ఇది ప్రైవేట్‌ వాహనాలకు మాత్రమే కాదు, కమర్షియల్‌ వాహనాలకూ వర్తిస్తుంది. ముఖ్యంగా, పాత కమర్షియల్‌ వాహనాలపై భారీగా ఆర్థిక భారం పడనుంది. కొత్త నియమాల ప్రకారం కొన్ని వాహనాల ఫిట్‌నెస్‌ ఫీజులు 10 రెట్ల నుంచి 15 రెట్ల వరకు పెరిగాయి.


ఇక, 15 నుంచి 20 ఏళ్ల వయస్సున్న వాహనాలకు మరింత ఎక్కువ ఛార్జీలు ఉండగా, 20 ఏళ్ల కంటే ఎక్కువ (20+) వయస్సు వాహనాలకు రికార్డు స్థాయి రేట్లను విధించారు. ఈ మార్పులతో, పాత వాహనాలను కొనసాగించడం వాహన యజమానులు, డ్రైవర్లకు పెద్ద భారంగా మారే అవకాశం ఉంది.


ఏ బండికి ఎంత బేస్‌ ఫీజు?


కొత్త రేట్ల ప్రకారం, 15 ఏళ్లు దాటని వాహనాలకు కూడా బేస్‌ ఫీజులు పెరిగాయి:



  • రెండు చక్రాల వాహనాలు - రూ. 400

  • లైట్‌ మోటర్‌ వాహనాలు (LMV) - రూ. 600

  • మీడియం/హెవీ కమర్షియల్‌ వెహికల్స్‌ - రూ. 1,000


ఈ రేట్లు కేవలం బేస్‌ ఫీజులు మాత్రమే. వాహనం వయస్సు పెరిగితే ఈ మొత్తం అదే స్థాయిలో పెరిగి, మరింత ఎక్కువ అవుతుంది.


MoRTH ఫిట్‌నెస్‌ రేట్లను ఎందుకు పెంచింది?


కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన ప్రకారం, పాత వాహనాలు రోడ్లపై నడవడం వల్ల:



  • ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది

  • పర్యావరణ కాలుష్యం భారీగా పెరుగుతోంది

  • ఇంజిన్‌, బాడీ, బ్రేక్‌ సిస్టమ్‌ వంటి భాగాలు త్వరగా దెబ్బతింటాయి

  • వాటిని తరచూ తనిఖీ చేయాల్సిన అవసరం వస్తుంది


ఈ కారణాల వల్ల, వయస్సు పెరిగిన వాహనాలకు ఫిట్‌నెస్‌ పరిశీలన కఠినతరం చేయడం తప్పనిసరి అయ్యిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్త రేట్లు వాహన యజమానులను మరింత మెరుగైన వాహనాల వైపు మళ్లించేలా చేస్తాయని కూడా కేంద్ర ప్రభుత్వ అంచనా.


రీ-ఇన్‌స్పెక్షన్‌ ఫీజుల్లో కూడా పెరుగుదల
ఫిట్‌నెస్‌ టెస్ట్‌లో వాహనం ఫెయిల్‌ అయితే మళ్లీ పరీక్ష చేయించుకునే వెసులుబాటు ఉంది, దీనిని రీ-ఇన్‌స్పెక్షన్‌ అంటారు. ఈ రీ-ఇన్‌స్పెక్షన్‌ ఖర్చులు కూడా ఇప్పుడు పెరిగాయి. అంటే, వాహనం సరిగా మెయింటెయిన్‌ చేయకపోతే ఈ రూపంలో మరింత ఖర్చవుతుంది. ఇలా డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేనివాళ్లు, నిబంధనల ప్రకారం వాహనం కండిషన్‌ను మెరుగ్గా నిర్వహిస్తారు.



ప్రైవేట్‌ వాహన యజమానులపై ప్రభావం
తెలుగు రాష్ట్రాల్లో 10-20 ఏళ్ల వయస్సున్న కార్ల వినియోగం ఇప్పటికీ ఎక్కువగానే ఉంది. ఈ కొత్త ఫీజులతో వాహన యజమానులకు వార్షిక వ్యయం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా 15+ & 20+ ఏళ్ల వాహనాల ఖర్చు గణనీయంగా పెరుగుతుంది.


కమర్షియల్‌ వాహనాలపై గట్టి భారం



  • పాత లారీలు, ఆటోలు, ట్యాక్సీలు నడుపుతున్న ఫ్లీట్‌ యజమానులు ఎక్కువ ఫీజులు చెల్లించాల్సి రావడం వల్ల:

  • వాహనాలను కొనసాగించడం ఖరీదైన వ్యవహారంగా మారుతుంది

  • స్క్రాప్‌ పాలసీ వైపు చూడడం పెరుగుతుంది

  • పాత వాటిని భరించలేక కొత్త వాహనాలు కొనడం తప్పనిసరిగా మారవచ్చు


తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి
హైదరాబాద్‌, విజయవాడ సహా ప్రధాన నగరాల్లో 15+ & 20+ ఏళ్ల వాహనాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఈ కొత్త రేట్లతో యజమానులు పాత వాహనాలను కొత్త వాటితో మార్చుకునే ఆలోచనకు దగ్గరయ్యే అవకాశం ఉంది.


ఈ కొత్త ఫిట్‌నెస్‌ ఫీజుల పెంపుతో రోడ్డు భద్రత, కాలుష్యం తగ్గించడం, పాత వాహనాల యాజమాన్యాన్ని తగ్గించడం వంటి లక్ష్యాలను సాధించడం ప్రభుత్వం ఉద్దేశం. అయితే వాహన యజమానులకు మాత్రం ఇది పెను భారం కానుంది.


ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.