FASTag Annual Pass Details Telugu: ఫాస్టాగ్ వార్షిక పాస్‌తో, భారతదేశంలో హైవేలపై ప్రయాణం మరింత సులభంగా మారింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI). 2025 ఆగస్టు 15న ఫాస్టాగ్ యాన్యువల్‌ పాస్‌ను లాంచ్‌ చేసింది. ఇది జరిగి ఇప్పటికి (అక్టోబర్‌ 15 నాటికి) రెండు నెలలైంది. కేవలం ఈ రెండు నెలల్లోనే ఫాస్టాగ్ వార్షిక పాస్‌ భారీ రికార్డు సృష్టించింది, 25 లక్షల మంది యూజర్లను యాడ్‌ చేసుకుంది. అంటే, దేశవ్యాప్తంగా పాతిక లక్షల మంది ఈ పాస్‌ను ఉపయోగిస్తున్నారు. అంతేకాదు, ఈ రెండు నెలల్లోనే దేశవ్యాప్తంగా 5.67 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి.

Continues below advertisement


ఫాస్టాగ్ వార్షిక పాస్‌ ప్రధాన ఉద్దేశ్యం - ‘ఈజ్‌ ఆఫ్‌ కమ్యూటింగ్‌' (Ease of Commuting). అంటే.. హైవేలపై తరచూ ప్రయాణించే డ్రైవర్లకు సులభమైన, ఎలాంటి ఇబ్బంది లేని ప్రయాణం కల్పించడం ఈ పాస్‌ ప్రధాన ఉద్దేశ్యం. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 1,150 టోల్‌ప్లాజాల వద్ద ఈ పాస్‌ ఉపయోగించుకోవచ్చు.


ఫాస్టాగ్ వార్షిక పాస్‌ ఎలా పని చేస్తుంది?
ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి, ఫాస్టాగ్ వార్షిక పాస్‌ను కేవలం నాన్‌-కమర్షియల్ వాహన యజమానుల కోసం రూపొందించారు. అంటే, వ్యక్తిగతం లేదా కుటుంబ అవసరాలకు మాత్రమే ఉపయోగించుకునే కార్లు, జీపులు, వ్యాన్లు వంటి వాహనాలకు మాత్రమే వార్షిక పాస్‌ వర్తిస్తుంది. ఈ పాస్‌ కోసం ఒక్కసారి ₹3,000 చెల్లిస్తే, ఇది ఒక సంవత్సరం లేదా 200 టోల్ క్రాసింగ్స్‌ వరకు చెల్లుతుంది, దీనిలో ఏది ముందుగా పూర్తయితే అది వర్తిస్తుంది. 


ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌ వల్ల డ్రైవర్లకు చాలా సమయం ఆదా అవుతుంది. ప్రతిసారి ఫాస్టాగ్ రీచార్జ్ చేయడం లేదా రీఛార్జ్‌ మరిచిపోవడం వల్ల టోల్‌ ప్లాజాల దగ్గర ఇబ్బందులు పడడం వంటివి ఇప్పుడు ఉండవు. యాన్యువల్‌ పాస్‌ కోసం ₹3,000  చెల్లించిన తర్వాత, రాజమార్గ యాత్ర యాప్‌ (RajmargYatra App) లేదా NHAI వెబ్‌సైట్‌ ద్వారా రెండు గంటల్లో పాస్‌ యాక్టివేట్ అవుతుంది.


ఎక్కడ ఉపయోగించొచ్చు?
ఈ పాస్‌ కేవలం నేషనల్ హైవేలపై, నేషనల్ ఎక్స్‌ప్రెస్‌వేలపై మాత్రమే చెల్లుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే స్టేట్ హైవేలు లేదా లోకల్ టోల్ ప్లాజాల దగ్గర మాత్రం ఈ పాస్‌ పని చేయదు. అక్కడ మాత్రం సాధారణ ఫాస్టాగ్ బ్యాలెన్స్‌ ద్వారానే చెల్లించాలి.


యాన్యవల్‌ పాస్‌కు ఎందుకు ఇంత స్పందన?
ప్రయాణాన్ని సులభతరం చేయడం, సమయం ఆదా చేయడం, రీచార్జ్‌ టెన్షన్‌ లేకుండా ప్రయాణం చేయగలగడం వల్ల దేశవ్యాప్తంగా డ్రైవర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. NHAI చెప్పినట్లు, ఈ రెండు నెలల్లోనే 25 లక్షల వాహనదారులు ఈ పాస్‌ను తీసుకోవడం దేశంలో పెరుగుతున్న హైవే వినియోగాన్ని స్పష్టంగా చూపిస్తోంది.


ప్రభుత్వ స్పందన
25 లక్షల యూజర్ల రికార్డ్‌పై కేంద్ర హైవే & రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కూడా హర్షం వ్యక్తం చేసింది - “ఫాస్టాగ్ వార్షిక పాస్‌కు వచ్చిన ఈ విపరీతమైన స్పందన... దేశవ్యాప్తంగా సురక్షితమైన, సాఫీగా సాగే ప్రయాణ అనుభవాన్ని కల్పించాలనే NHAI నిబద్ధతను ప్రతిబింబిస్తోంది” అని వెల్లడించింది.


ఫ్యూచర్ గోల్‌
ఫాస్టాగ్‌ యాన్యవల్‌ పాస్‌ ద్వారా యూజర్లు సమయాన్ని ఆదా చేయడంతో పాటు, నగదు లావాదేవీలను తగ్గించడం కూడా ప్రధాన ఉద్దేశ్యం. భవిష్యత్తులో మరిన్ని రోడ్లను, రాష్ట్ర మార్గాలను కూడా ఇందులో చేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.


ఓవరాల్‌గా చూస్తే.. ఫాస్టాగ్ వార్షిక పాస్‌ అనేది హైవేలపై తరచుగా ప్రయాణించే వారికి ఒక పెద్ద బహుమానంగా మారింది. ₹3,000లో ఏడాది మొత్తం సులభమైన ప్రయాణం చేయవచ్చు, ఇంతకంటే మంచి డీల్‌ ఇంకేం ఉంటుంది?.