EV Tyres India:ఎలక్ట్రిక్ వాహనం (EV) కొనుగోలు చేసిన తర్వాత, చాలా మంది వినియోగదారులు కేవలం బ్యాటరీ, మోటారు , ఛార్జింగ్‌పై మాత్రమే దృష్టి పెడతారు. కానీ, మీ EV పనితీరు, మైలేజీ, సెక్యూరిటీని నిర్ణయించే కీలకమైన విభాగమే ఈ టైర్‌. దీని గురించి తరచుగా పెద్దా పట్టించుకోరు. సాధారణ టైర్లను EVలలో ఉపయోగించడం ద్వారా, మీరు కారు మైలేజ్‌ను గణనీయంగా కోల్పోవడమే కాకుండా, మీ భద్రతను కూడా రిస్క్‌లో పెడుతున్నారు. EV టైర్ల ప్రత్యేకత ఏమిటి? అవి సాధారణ టైర్ల కంటే ఎలా భిన్నంగా ఉంటాయి? ఈ అంశాలపై లోతైన విశ్లేషణ ఇక్కడ చూద్దాం. 

Continues below advertisement

టైర్ సైన్స్: రోడ్‌కు టచ్ అయ్యేది క్రెడిట్ కార్డు సైజే!

సాధారణంగా, రోడ్డుపై కారు టైర్ నడుస్తున్నప్పుడు, మొత్తం టైర్ రోడ్డుకు తగులుతున్నట్లుగా అనిపించవచ్చు. కానీ వాస్తవానికి, టైర్లలో కేవలం 4 నుంచి 5 అంగుళాల భాగం మాత్రమే రోడ్డును తాకుతుంది. ఈ చిన్న భాగం, దాదాపు ఒక క్రెడిట్ కార్డు పరిమాణంలో ఉంటుంది, ఇది మీ కారు గ్రిప్, బ్రేకింగ్, ముఖ్యంగా EVల రేంజ్‌ను నిర్ణయిస్తుంది.

ఒక EVలో సరైన టైర్లు లేకపోతే, మొత్తం వాహనం సమర్థత దెబ్బతింటుంది. అందుకే EVల కోసం ప్రత్యేక టెక్నాలజీ అవసరం.

Continues below advertisement

EV టైర్ల ప్రత్యేకతలు: సాధారణ టైర్ల కంటే ఎందుకు భిన్నం?

EV టైర్లు సాధారణ ICE (Internal Combustion Engine) వాహనాల టైర్ల కంటే నాలుగు కీలక అంశాలలో ప్రత్యేకమైనవి, ఇవి EVల ప్రత్యేకమైన డిజైన్ పనితీరు అవసరాలను తీరుస్తాయి:

1. భారీ బరువు నిర్వహణ EVలు, ఐసీఈ వాహనాలతో పోలిస్తే, దాదాపు 20% నుంచి 30% వరకు బరువుగా ఉంటాయి. దీనికి ప్రధాన కారణం భారీ బ్యాటరీ ప్యాక్ బరువు. ఈ అధిక బరువును సమర్థవంతంగా నిర్వహించడానికి, EV టైర్ల సైడ్ వాల్ చాలా బలంగా తయారుచేస్తారు. సాధారణ టైర్లను EVలో వాడితే, అవి ఎక్కువ లోడ్ స్ట్రెస్ కారణంగా సులభంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే EV టైర్లలో హై లోడ్ ఇండెక్స్ ఉంటుంది, ఇది భారీ బ్యాటరీ ప్యాక్‌లకు మద్దతు ఇస్తుంది.

2. ఇన్స్టంట్ టార్క్, గ్రిప్ :

EVలలో టార్క్ అనేది సున్నా ఆర్‌పీఎం (0 RPM) నుంచే అందుబాటులోకి వస్తుంది. దీనికి అర్థం, కారు స్టార్ట్ అయిన వెంటనే లేదా స్పీడ్ తీసుకుంటున్నప్పుడు, టైర్లపై అత్యధిక ఒత్తిడి పడుతుంది. ఈ ఇన్‌స్టంట్ పవర్‌ను తట్టుకోవడానికి, EV టైర్లలో ఉపయోగించే రబ్బర్ కాంపౌండ్ ఎక్కువ ఫ్లెక్సిబుల్‌గా, గ్రిప్పిగా ఉంటుంది. ఇది అధిక ఇన్‌స్టంట్ టార్క్‌ను నిర్వహించడానికి, తక్షణ పిక్అప్‌కు గ్రిప్‌ను పెంచడానికి సహాయపడుతుంది.

3. తక్కువ రోలింగ్ రెసిస్టెన్స్ (Low Rolling Resistance - LRR)

మైలేజీ అత్యంత ముఖ్యమైన అంశం రోలింగ్ రెసిస్టెన్స్. EVల టైర్లు రోడ్డుపై రెసిస్టెన్స్‌ చాలా తక్కువగా ఉండేలా రూపొందిస్తారు. దీనివల్ల మోటారుపై భారం తగ్గుతుంది. మైలేజీలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తుంది.

ఉదాహరణకు, CAT ఎనర్జీ డ్రైవ్, బ్రిడ్జ్‌స్టోన్ ఎకోపియా వంటి టైర్లు EVలలో ఉపయోగిస్తున్నారు. ఇవి రోలింగ్ రెసిస్టెన్స్‌ను తగ్గించి, ఎక్కువ రేంజ్‌ను అందిస్తాయి. మీరు తక్కువ రోలింగ్ రెసిస్టెన్స్ లేని సాధారణ టైర్లను వాడితే, కచ్చితంగా మీ EV మైలేజీ తగ్గుతుంది.

4. నాయిస్ రిడక్షన్ సైలెన్స్:

EVలు చాలా సైలెంట్‌గా ఉంటాయి కాబట్టి, క్యాబిన్‌లో టైర్ల శబ్దం చాలా సులభంగా వినిపిస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి, మిషెలిన్ ఈ-ప్రీమసీ వంటి ప్రీమియం EV టైర్లలో నాయిస్ డ్యాంపింగ్ ఫోమ్ పొరను ఉపయోగిస్తారు. ఈ ఫోమ్ ప్రత్యేకంగా అధిక వేగాల వద్ద క్యాబిన్ శబ్దాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. సాధారణ టైర్లను వాడినప్పుడు, టైర్ల శబ్దం చాలా ఎక్కువగా, ఇబ్బందికరంగా అనిపించవచ్చు.

5. రీజనరేటివ్ బ్రేకింగ్ అనుకూలత:

EV టైర్లు ప్రత్యేకంగా రీజనరేటివ్ బ్రేకింగ్ బిహేవియర్ కోసం ట్యూన్ చేసి ఉంచుతారు. ఈ ట్యూనింగ్, సాధారణ టైర్లలో త్వరగా అరిగిపోయే ట్రెడ్ వాలిడిటీని బ్యాలెన్స్ చేస్తుంది.

సాధారణ టైర్లు వాడితే ఎదురయ్యే 3 పెద్ద నష్టాలు

సాధారణ టైర్లు సాంకేతికంగా EVలలో అమర్చడానికి సరిపోతాయి. కానీ, వాటిని ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు దీర్ఘకాలంలో అధికంగా ఉంటాయి:

1. ట్రెడ్ వేర్ వేగం: సాధారణ టైర్లలో ట్రెడ్ 20% వేగంగా అరిగిపోయే అవకాశం ఉంది. దీనికి కారణం EVల నుంచి వచ్చే అధిక టార్క్, బ్రేకింగ్ స్టైల్.

2. భద్రతకు ప్రమాదం: MG ZS EV, BYD ఆటో 3 వంటి హై స్పీడ్ EVలకు టైర్ స్పీడ్ రేటింగ్ H లేదా V తప్పనిసరిగా ఉండాలి. లో స్పీడ్ రేటింగ్ ఉన్న సాధారణ టైర్లను ఉపయోగిస్తే, భద్రతకు తీవ్రమైన ప్రమాదం ఏర్పడవచ్చు.

3. రేంజ్ నాయిస్‌లో రాజీ: సాధారణ టైర్లు వాడినప్పుడు, తక్కువ రోలింగ్ రెసిస్టెన్స్ లేకపోవడం వల్ల కారు రేంజ్ తగ్గుతుంది. క్యాబిన్‌లో రోడ్ నాయిస్ బాగా పెరుగుతుంది.

మీరు షార్ట్ టర్మ్‌లో సాధారణ టైర్లతో డబ్బు ఆదా చేయాలనుకున్నా, దీర్ఘకాలిక భద్రత, సామర్థ్యం విషయంలో రాజీ పడాల్సి వస్తుంది.అందుబాటులో ఉన్న ప్రముఖ EV టైర్ బ్రాండ్‌లు భారత్‌లో EV వినియోగదారుల కోసం మార్కెట్‌లో నమ్మకమైన బ్రాండ్‌లు అందుబాటులో ఉన్నాయి, వీటిలో ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకమైన ఫీచర్‌పై దృష్టి సారిస్తుంది:

• CAT ఎనర్జీ డ్రైవ్: ఇది భారతదేశంలో విడుదలైన మొదటి EV టైర్‌లలో ఒకటి.

• మిషెలిన్ ఈ-ప్రీమసీ: ఇవి గ్లోబల్ LRR టైర్లు, ఇవి రేంజ్ మెరుగుపరుస్తాయి.

• బ్రిడ్జ్‌స్టోన్ ఎకోపియా : ఇది EV ఫ్రెండ్లీ కాంపౌండ్‌తో వస్తుంది.

• రెలీ ఎలెక్ట్ : ఇవి ప్రీమియంలో ఫామ్ ఆధారిత టైర్లు, ఇవి శబ్దం తగ్గించడంపై దృష్టి పెడతాయి.

కొన్ని టైర్లు రేంజ్‌ను మెరుగుపరుస్తాయి, కొన్ని గ్రిప్పింగ్‌ను మెరుగుపరుస్తాయి, మరికొన్ని శబ్దాన్ని తగ్గించడంపై దృష్టి పెడతాయి. మీ అవసరాన్ని బట్టి టైర్‌ను ఎంచుకోవచ్చు.

ఎప్పుడు EV టైర్లు తీసుకోవాలి?

EV టైర్లు తీసుకోవాలా లేదా సాధారణ టైర్లతో సరిపెట్టుకోవాలా అనే తుది నిర్ణయం మీ వినియోగంపై ఆధారపడి ఉంటుంది.

• EV టైర్లు తీసుకోవాల్సినవారు: మీ రోజువారీ డ్రైవింగ్ 20 కి.మీ కంటే ఎక్కువగా ఉంటే, EV-నిర్దిష్ట టైర్లనే తీసుకోవాలి. ఎందుకంటే అవి మెరుగైన గ్రిప్, సురక్షితమైన బ్రేకింగ్, తక్కువ శబ్దం, ఎక్కువ రేంజ్‌ను అందిస్తాయి.

• సాధారణ టైర్లతో సర్దుబాటు చేయదలిచినవారు: మీ బడ్జెట్ తక్కువగా ఉండి, రోజువారీ ప్రయాణం చాలా తక్కువగా ఉంటే, మీరు సాధారణ టైర్లతో పని కానిచ్చేయొచ్చు. కానీ, ఈ సందర్భంలో గ్రిప్, శబ్దం, రేంజ్‌లో రాజీ పడాల్సి ఉంటుంది.

సుదీర్ఘ భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేవారు ఎల్లప్పుడూ EV టైర్లనే ఎంచుకోవాలి.

టైర్ ప్రెజర్

EV టైర్ల నిర్వహణలో అతి ముఖ్యమైన అంశం టైర్ ప్రెజర్. టైర్ ప్రెజర్ తక్కువగా ఉంటే, మీ కారు మైలేజ్‌లో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది, టైర్ అరుగుదల  వేగంగా జరుగుతుంది.

మీరు EVని వాడుతున్నట్లయితే, ప్రతి నెలా కనీసం ఒక్కసారైనా టైర్ ప్రెజర్‌ను తప్పకుండా చెక్ చేయించుకోవాలి. ముఖ్యంగా వాతావరణం మారినప్పుడు టైర్ ప్రెజర్‌ను సర్దుబాటు చేయడం ముఖ్యం.

టైర్లు కేవలం వాహనాన్ని కదిలించడానికి మాత్రమే కాదు; EV విషయంలో, అవి వాహనం యొక్క ఆత్మ లాంటివి. సరైన టైర్ల ఎంపిక, మీ EV అనుభవాన్ని సురక్షితంగా సామర్థ్యంతో ముందుకు నడిపిస్తుంది.