Two decisions for Congress victory in Jubilee Hills: అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. పోలింగ్‌కు ముందు స్వతంత్ర సర్వేలు కాంగ్రెస్ ఓటమి అంచనా వేసినా, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీసుకున్న అత్యంత వ్యూహాత్మక నిర్ణయాలే ఈ ఫలితానికి కారణం అనుకోవచ్చు. సర్వేలు, పార్టీలోని కొంత శ్రేణుల ఆందోళనల మధ్య రేవంత్ ధైర్యంగా ముందుకు సాగి, అభ్యర్థి ఎంపిక నుంచి అన్ని వర్గాల మద్దతు పొందే వరకు ప్రతి అంశాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేశారు.
పోలింగ్ వారం రోజుల నుంచి మారిన వాతావరణం
పోలింగ్ కు వారం ముందు వరకూ బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌కు 45-50 శాతం ఓట్లు అంచనా వేసినట్లు చానల్స్ ప్రకటించాయి. స్వతంత్ర సర్వేలు కూడా కాంగ్రెస్‌కు 35-40 శాతం మాత్రమే ఇచ్చాయి. ఈ ఫలితాలు పార్టీలోని కొంత మంది నేతల్లో, కార్యకర్తల్లో నమ్మకాన్ని కోల్పోయేలా చేశాయి. బీఆర్‌ఎస్ సెంటిమెంట్, గోపీనాథ్ పై సానుభూతివల్ల వల్ల జూబ్లీహిల్స్‌లో ముస్లిం, క్రిస్టియన్ ఓట్లు బీఆర్ఎస్‌కు పడతాయన్న ప్రచారం జరిగింది. కానీ, గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరుగా ఉంది. రేవంత్ ఎప్పటికప్పుడు తానే అభ్యర్థి అన్నంతగా దృష్టి పెట్టి ఎన్నికలను నడిపించారు.
నవీన్ అభ్యర్థిత్వమే కీలకం
రేవంత్ తీసుకున్న మొదటి కీలక నిర్ణయం నవీన్ యాదవ్‌ను అభ్యర్థిగా ఎంపిక చేయడమే. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మజ్లిస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నవీన్ యాదవ్, జూబ్లీహిల్స్‌లో బలమైన బేస్‌ను కలిగి ఉన్నారు. ఉపఎన్నిక ప్రకటించగానే రేవంత్ ఆయనను అభ్యర్థిగా ఖరారు చేశారు. సిద్ధం కావాలని సూచించారు. పోటీలో ఉన్న ఇతర నేతలను వ్యూహాత్మకంగా తప్పించారు. ముఖ్యంగా, మాజీ ఎంపీ అజహరుద్దీన్ తాను పోటీ చేస్తానని పట్టుబట్టినా, రేవంత్ ఆయనను ఎమ్మెల్సీగా నామినేట్ చేసి, మంత్రి పదవి కూడా ఇచ్చి పోటీ నుంచి తప్పించారు. రేవంత్ నిర్ణయం వెనుక మరో కారణం, నవీన్ యాదవ్ వ్యక్తిగత బలం. జూబ్లీహిల్స్, షేక్ పేట, ఫిల్మ్ నగర్ వంటి ప్రాంతాల్లో ఆయనకు ఇరవై వేల ఓట్ల వరకు మద్దతు ఉందని పార్టీ ఇంటర్నల్ సర్వేలు చెప్పాయి. గతంలో మజ్లిస్ నుంచి పోటీ చేసినప్పటికీ, ఆయన స్థానిక సమస్యలపై చేసిన పనులు – రోడ్లు, విద్యుత్ సమస్యలు, మహిళా సంక్షేమం – ముస్లిం, క్రిస్టియన్, ఇతర మైనారిటీల్లో ఆయనకు గట్టి మద్దతును తెచ్చిపెట్టాయి.
మజ్లిస్ పార్టీ మద్దతు మరో కారణం
మజ్లిస్ పార్టీ మద్దతు పొందడం రేవంత్ మరో వ్యూహాత్మక ప్రయత్నం. ఏఐఎమ్‌ఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ బహిరంగంగా నవీన్ యాదవ్‌కు మద్దతు ప్రకటించడమే కాకుండా, పోలింగ్ రోజు మజ్లిస్ శ్రేణులు షేక్ పేట, జూబ్లీహిల్స్ బూతుల్లో చురుకుగా పనిచేశాయి. కొన్ని బూతుల్లో ఏకపక్ష ఓటింగ్ జరిగేలా మజ్లిస్ కార్యకర్తలు బూత్ మేనేజ్‌మెంట్ చేశారని, పోస్టల్ బ్యాలెట్లలో కూడా మైనారిటీ ఓట్లు పూర్తిగా కాంగ్రెస్ వైపు మళ్లాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒవైసీ మద్దతు ప్రకటన తర్వాత, మజ్లిస్ ప్రభావం ఉన్న 407 పోలింగ్ బూతుల్లో 60 శాతం దాటి కాంగ్రెస్‌కు మద్దతు వచ్చింది. ఇది బీఆర్‌ఎస్ అంచనాలను తప్పేలా చేసింది. ఈ ఫలితాన్ని రేవంత్ రెడ్డి లీడర్‌షిప్‌కు మరో విజయంగా చూస్తున్నారు.