EV Subsidy Under PM E Drive Scheme: ఎలక్ట్రిక్ వాహనం (Electric Vehicle) కొనబోతున్నవాళ్లకు కేంద్ర ప్రభుత్వం పెద్ద శుభవార్త చెప్పింది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న పీఎం ఇ డ్రైవ్ పథకం (PM E Drive Scheme) కింద సబ్సిడీ గడువును పొడిగించింది. దీంతో ఈవీ కొనుగోలుదారులు మరికొంతకాలం పాటు ఈ ప్రయోజనాన్ని పొందుతారు.

Continues below advertisement

గడువు ఎప్పటి వరకు పొడిగించారు?

పీఎం ఇ డ్రైవ్ పథకం కింద ఇచ్చే సబ్సిడీ గడువును 2028 మార్చి 31 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. పథకం అమలుకు అదనంగా రూ.1,000 కోట్లు కేటాయించింది. ఇప్పటికే ఉన్న ఫండ్‌కు ఈ అదనపు కేటాయింపు తోడవుతుంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కొనుగోలును ప్రోత్సహించడంపై కేంద్రం దృష్టి పెట్టింది.

Continues below advertisement

టూవీలర్లకు ఎంత సబ్సిడీ?

పీఎం ఇ డ్రైవ్ పథకం కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా సబ్సిడీ లభిస్తుంది. ప్రతి కిలోవాట్ అవర్‌కు రూ.2,500 చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తుంది. ఒక వాహనానికి గరిష్ఠంగా రూ.5,000 వరకు సబ్సిడీ పొందవచ్చు. అయితే.. అన్ని ఎలక్ట్రిక్ టూవీలర్లకు ఈ ప్రయోజనం వర్తించదు. ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.50 లక్షలకు మించని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకే ఈ సబ్సిడీ వర్తిస్తుంది.

ఇది కూడా చదవండి: మూడు స్క్రీన్ల సెటప్‌తో కొత్త మహీంద్రా BE 07.. త్వరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ SUV ఎలా ఉంది?

గతంలో ఎంత ఉండేది?

2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ సబ్సిడీ మరింత ఎక్కువగా ఉండేది. అప్పుడు ప్రతి కిలోవాట్ అవర్‌కు రూ.5,000 చొప్పున రాయితీ ఇచ్చారు. ఒక ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనానికి గరిష్ఠంగా రూ.10,000 వరకు సబ్సిడీ లభించేది. ఇప్పుడు సబ్సిడీ మొత్తాన్ని తగ్గించినప్పటికీ, గడువు పొడిగింపు వల్ల ఈవీ కొనుగోలుదారులకు కొంత ఊరట లభించనుంది. ముఖ్యంగా, రూ.1.50 లక్షల ఎక్స్‌షోరూమ్ ధర మించని ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైక్ కొనాలని చూస్తున్న వారికి ఇది ఉపయోగపడుతుంది.

45.79 లక్షల వాహనాలకు లక్ష్యం

పీఎం ఇ డ్రైవ్ పథకం కింద మొత్తం 45,79,120 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ప్రయోజనం కల్పించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విభాగం కోసం మొత్తం రూ.2,767 కోట్లను కేటాయించింది. మొత్తం పీఎం ఇ డ్రైవ్ పథకానికి రూ.11,900 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడం, దేశంలో విద్యుత్ వాహనాల మార్కెట్‌ను బలోపేతం చేయడం దీని ప్రధాన లక్ష్యాలు.

ఇది కూడా చదవండి: E20లో క్లోరైడ్, తేమ నిజంగానే పెరిగాయా? దేశవ్యాప్త తనిఖీల తర్వాత OMCలు ఏం చెప్పాయి?

గడువు పొడిగింపునకు కారణం ఇదే

కేంద్ర ప్రభుత్వం 2024 సెప్టెంబర్‌లో పీఎం ఇ డ్రైవ్ పథకాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న గడువు 2027 మార్చి 31తో ముగియాల్సి ఉంది. అయితే ఈవీ రంగానికి మరింత ప్రోత్సాహం అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో సబ్సిడీ పథకాన్ని కొనసాగించాలని రాజ్యసభ స్టాండింగ్ కమిటీ కేంద్ర భారీ పరిశ్రమల శాఖను కోరింది. దీంతో గడువు పొడిగింపుపై కేంద్రం నిర్ణయం తీసుకుంది. 

అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తు పెట్టుకోవాలి. పథకానికి కేటాయించిన నిధులు, నిర్దేశిత గడువు కంటే ముందే అయిపోతే కొత్త క్లెయిమ్‌లను స్వీకరించరు. అంతేకాదు, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సబ్సిడీ క్లెయిమ్ చేసుకునేందుకు 2027 డిసెంబర్ 31ను చివరి తేదీగా నిర్ణయించారు. అందువల్ల, ఈవీ కొనాలని ప్లాన్ చేస్తున్నవాళ్లు అన్ని సబ్సిడీ నిబంధనలు & అర్హతలను ముందుగానే తెలుసుకోవడం మంచిది. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.