E20 Petrol News: దేశవ్యాప్తంగా ప్యూర్ పెట్రోల్, E10 & E20 అనే మూడు రకాల పెట్రోల్‌ను ఒకేసారి అందుబాటులో ఉంచే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తోసిపుచ్చింది. దేశవ్యాప్తంగా E20 పెట్రోల్‌నే ప్రామాణిక ఇంధనంగా కొనసాగిస్తామని కేంద్ర పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మూడు రకాల పెట్రోల్‌ను ఒకేసారి సరఫరా చేయాలంటే భారీగా మౌలిక సదుపాయాలు అవసరమవుతాయని, దీనివల్ల వ్యయభారం పెరగడంతో పాటు పంపిణీ వ్యవస్థ కూడా క్లిష్టంగా మారుతుందని పేర్కొంది.
జులై 10న విడుదల చేసిన ప్రశ్నలు-సమాధానాల రూపంలోని వివరణలో కేంద్రం తన నిర్ణయానికి గల కారణాలను వివరించింది. దేశవ్యాప్తంగా లక్షకు పైగా పెట్రోల్ బంకులు, రిఫైనరీలు, డిపోలు, టెర్మినల్స్, పైప్‌లైన్లు & నిల్వ కేంద్రాల ద్వారా ఇంధన పంపిణీ జరుగుతోందని తెలిపింది. ఇలాంటి భారీ వ్యవస్థలో ప్యూర్ పెట్రోల్, E10 & E20లను వేర్వేరుగా నిల్వ చేసి పంపిణీ చేయడం వల్ల అదనపు గిడ్డంగులు, ప్రత్యేక నిల్వ ట్యాంకులు, వేర్వేరు సరఫరా వ్యవస్థలు అవసరమవుతాయని వెల్లడించింది.
ప్రీమియం పెట్రోల్ కూడా మార్కెట్లో లభిస్తోందని కొందరు చేస్తున్న వాదనలను కూడా కేంద్రం కొట్టిపారేసింది. ప్రీమియం పెట్రోల్‌ను చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే కొద్దిమంది వినియోగిస్తారని, దానికి ప్రత్యేక దేశవ్యాప్త సరఫరా వ్యవస్థ అవసరం ఉండదని వివరించింది. అయితే E20 మాత్రం దేశవ్యాప్తంగా వినియోగించే ప్రధాన ఇంధనమని పేర్కొంది.
ఇది కూడా చదవండి: బైక్ నడిపేవారు హెల్మెట్ పెట్టుకునేటప్పుడ్డు జాగ్రత్త! ఈ పొరపాట్లు చేస్తే చలాన్ ఖాయం!
ఇథనాల్ ఉత్పత్తి కోసం ప్రభుత్వం ఇప్పటికే భారీ పెట్టుబడులు పెట్టిన విషయాన్ని కూడా మంత్రిత్వ శాఖ గుర్తు చేసింది. డిస్టిలరీలు, నిల్వ కేంద్రాలు, రవాణా వ్యవస్థలు & ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని తెలిపింది. ఇప్పుడు మళ్లీ E10ను ప్రామాణిక ఇంధనంగా తీసుకొస్తే రైతులు, సహకార సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు & ఆర్థిక సంస్థలు చేసిన పెట్టుబడులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం నవంబర్ 2025 నుంచి జూన్ 2026 వరకు దేశంలో సగటున 20 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని సాధించింది. అంతకుముందు సరఫరా సంవత్సరంలో ఈ స్థాయి 19.2 శాతంగా నమోదైందని తెలిపింది. దీంతో ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతోందని కేంద్రం అభిప్రాయపడింది.
ఇది కూడా చదవండి: వర్షాకాలంలో చెట్టు కూలి డ్యామేజ్ అయితే మీ కారుకు బీమా ఎలా పొందాలి?
E10కు అనుగుణంగా తయారైన పాత వాహనాల యజమానుల్లో ఉన్న ఆందోళనలపై కూడా కేంద్రం స్పందించింది. E20 అమలుకు ముందు వాహన తయారీ సంస్థలు, విడిభాగాల తయారీదారులు, పరీక్షా సంస్థలు & పరిశోధన సంస్థలతో విస్తృతంగా చర్చలు జరిపినట్లు తెలిపింది. ఇంజిన్ పనితీరు, ఇంధన వ్యవస్థ, విడిభాగాల మన్నిక, ఉద్గారాలు & ఇంధన వినియోగంపై సమగ్ర పరిశీలన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
మారుతి సుజుకి అందించిన వివరాల ప్రకారం FY2025-26లో సర్వీస్‌కు వచ్చిన 2.84 కోట్ల వాహనాల్లో దాదాపు 1.5 కోట్ల పాత వాహనాలు E20కు మొదట అనుమతించబడనివేనని తెలిపింది. అయినప్పటికీ E20 వల్ల తుప్పు పట్టడం, అసాధారణంగా విడిభాగాలు దెబ్బతినడం లేదా వాటి జీవితకాలం తగ్గినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొంది. హీరో మోటోకార్ప్ కూడా ఇదే తరహా అనుభవాన్ని వెల్లడించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
అయితే E20 వాడటం వల్ల కొన్ని వాహనాల్లో ఇంధన సామర్థ్యం 3 నుంచి 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని కేంద్రం అంగీకరించింది. అయితే అధిక ఆక్టేన్ విలువ, ముడి చమురు దిగుమతుల తగ్గుదల, కాలుష్య ఉద్గారాల నియంత్రణ వంటి ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. కాగా, బహుళ రకాల పెట్రోల్‌ను అందుబాటులో ఉంచడం వల్ల వచ్చే అదనపు వ్యయం & వినియోగదారులకు కలిగే ప్రయోజనాలపై స్వతంత్ర విశ్లేషణను మాత్రం ఈ వివరణలో ప్రభుత్వం వెల్లడించలేదు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
